Recession: అగ్ర దేశాల వాణిజ్య యుద్ధం - జాగ్రత్త, కమ్ముకొస్తోంది ఆర్థిక మాంద్యం!
Goldman Sachs Report: వాణిజ్య యుద్ధం, మాంద్యం భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. కాబట్టి, ఇది చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం.

America-China Trade War Effect: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs), బ్రెంట్ క్రూడ్ ఆయిల్, WTI క్రూడ్ ఆయిల్ ధరల అంచనాలను దారుణంగా తగ్గోసింది. ఈ సంవత్సరం బ్రెంట్ ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు $69గా ఉంటుందని & WTI ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు $66గా ఉంటుందని అంచనా వెలువరించింది. గత అంచనా కంటే ఇది దాదాపు 6 శాతం తక్కువ.
గోల్డ్‌మన్ సాచ్స్ ఏం చెప్పింది?
గోల్డ్‌మన్ సాచ్స్ చమురు పరిశోధన అధిపతి డాన్ స్ట్రూయ్వెన్ వెలువరించిన నివేదికలో, 2026 నాటికి మాంద్యం ప్రమాదం పెరుగుతుందని & OPEC+ ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల ముడి చమురు ధరలు మరింత పతనం కావచ్చని లెక్కలు వేశారు. 2026 సంవత్సరానికి, బ్రెంట్ ముడి చమురు సగటు ధరను $62 & WTI చమురు సగటు ధరను $59గా అంచనా వేశారు. అంటే, వచ్చే ఏడాది కూడా క్రూడాయిల్ రేట్లలో తగ్గుదల అవకాశం ఉంది.
చమురు ధరల్లో చారిత్రక పతనం
గురువారం, శుక్రవారం ముడి చమురు ధరలు 7 శాతానికి పైగా తగ్గాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు $65.58 గా ఉంది. WTI బ్యారెల్‌కు $61.99కు దిగి వచ్చింది. ఈ రెండు ధరలు 4 సంవత్సరాలలో అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. వారం వ్యవధిలో బ్రెంట్ 10.9 శాతం & WTI 10.6 శాతం తగ్గాయి. ఈ క్షీణత గత రెండు సంవత్సరాలలో అతి పెద్దది.
భారీ పతనానికి కారణాలు ఏంటి?
ముడి చమురు ధరల తగ్గుదల వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
1. చైనా అమెరికాపై సుంకాన్ని 34 శాతం పెంచింది, ఇది వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రంగా మార్చింది. దీనికి ముందు, ట్రంప్ ప్రభుత్వం అనేక దేశాలపై భారీగా పన్నులు విధించింది, ఇవి గత 100 సంవత్సరాలలో అత్యధికం.
2. మే నెల నుంచి ఉత్పత్తిని పెంచుతున్నట్లు OPEC+ దేశాలు అకస్మాత్ ప్రకటన చేశాయి. కొత్త ఉత్పత్తితో కలిపి, ఒపెక్ ప్లస్ కూటమి రోజుకు 4,11,000 బ్యారెళ్ల ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకువస్తుంది, ఇప్పటి వరకు ఈ సంఖ్య 1,35,000 బ్యారెళ్లు.
3. కాస్పియన్ పైప్‌లైన్ టెర్మినల్‌ను మూసివేయాలన్న పిటిషన్‌ను రష్యన్ కోర్టు తిరస్కరించింది, దీని కారణంగా కజకిస్థాన్ నుంచి సరఫరాలు కొనసాగుతాయి. ఈ సంఘటనలన్నీ చమురు ధరలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి.
మాంద్యం సంకేతమా?
ఈ సంవత్సరం చివరి నాటికి ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశం 60 శాతం ఉందని JP మోర్గాన్ చెబుతోంది. ఇంతకు ముందు ఈ అంచనా 40 శాతంగా ఉండేది. HSBC కూడా చమురు డిమాండ్ అంచనాలను తగ్గించింది. 2025లో రోజువారీ డిమాండ్ 0.9 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే పెరుగుతుందని ఆ సంస్థ నమ్ముతోంది, గతంలో ఇది 1 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది.
ఈ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి?
మీరు పెట్టుబడిదారులైతే, తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ముడి చమురు ధరలు తగ్గడం కొన్ని రంగాలకు (విమానయానం, పెయింట్స్, FMCG వంటివి) ఉపశమనం కలిగించవచ్చు. అయినప్పటికీ, వాణిజ్య యుద్ధం & మాంద్యం భయం గ్లోబల్ మార్కెట్‌లను కలవరపెడుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.





















