McDonald: వెజిటేబుల్ పిజ్జా తింటారా! మెనూ నుంచి టమాట తొలగించిన మెక్‌డొనాల్డ్స్!
McDonald: ఘుమఘుమలాడే వెజిటేబుల్ పిజ్జా తినాలని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంటుకు వెళ్తున్నారా! అయితే మీరు కోరుకుంటున్న కొన్ని కూరగాయల ముక్కలు అందులో ఉండకపోవచ్చు.
McDonald:
మాంచి.. ఘుమఘుమలాడే వెజిటేబుల్ పిజ్జా (Veg Pizza) తినాలని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంటుకు వెళ్తున్నారా! అయితే మీరు కోరుకుంటున్న కొన్ని కూరగాయల ముక్కలు అందులో ఉండకపోవచ్చు. మరీ ముఖ్యంగా టమాట ముక్కలు కొన్నాళ్లు కనిపించకపోవచ్చు. పెరిగిన ధరలు, తగ్గిన సరఫరాయే ఇందుకు కారణం!
దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. పెరిగిన ధరల వల్ల ఇలా చేయడం లేదని.. తమ నాణ్యతా ప్రమాణాలకు తగిన టమాట (Tomato Price) సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని సదరు రెస్టారెంటు చెబుతోంది. అందుకే మెనూలో వాటిని తొలగించామని వెల్లడించింది. ఈ మేరకు రెస్టారెంట్ల ముందు నోటీసులు అతికిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'మేం ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే మా నాణ్యతా ప్రమాణాలకు దీటైన టమాటాలు దొరకడం లేదు. అందుకే మేం కొన్నాళ్లు టమాట లేని ఆహార ఉత్పత్తులను వడ్డించాల్సి వస్తోంది. వేగంగా టమాటాలను దిగుమతి చేసుకోవడానికి మేం కష్టపడుతున్నాం' అని కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు ప్రదర్శిస్తున్నారు.
మెక్ డొనాల్డ్స్‌కు దేశంలో రెండు మాస్టర్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. సంజీవ్ అగర్వాల్ నేతృత్వంలోని ఎంఎంజీ గ్రూప్ ఉత్తర, తూర్పు భారతంలో రెస్టారెంట్లను నిర్వహిస్తుంది. బీజే లలిత్ నేతృత్వంలోని వెస్ట్ లైఫ్ గ్రూప్ దక్షిణ, పడమర భారతదేశంలో వ్యాపారం చేస్తుంది.
విపరీతమైన వడగాల్పులు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాల వల్ల దేశంలో టమాట దిగుబడి పడిపోయింది. దాంతో అనేక నగరాల్లో కిలో టమాట రూ.150 వరకు పలుకుతోంది. బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ గ్రాసరీ, వెజిటేబుల్ యాప్‌లో కిలో రూ.160 వరకు అమ్ముతున్నారు. సాధారణంగా జులై-ఆగస్టు నెలల్లో టమాట ధరలు పెరుగుతుంటాయి. వర్షాలు కురవడం వల్ల దిగుబడి పంట త్వరగా పాడువుతుంది.
Also Read: డాలర్ల వర్షంలో తడిచి ముద్దయిన 7 సెక్టార్స్ - ఫారినర్లు పోటీలు పడి కొన్నారు
మన దేశంలో 2016లో కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ సందర్భంలోనూ మెక్ డొనాల్డ్స్ తమ మెనూలోంచి టమాటను కత్తించింది. 2022 అక్టోబర్ నుంచి చాలా ప్రాంతాల్లో ఆహారం, భోజనాల ధరలు తగ్గాయి. టమాట ఇతర కూరగాయాలు ధరలు కొండెక్కడంతో మే, జూన్ నెలల్లో భోజనాల ధరలూ పైపైకి చేరుకుంటున్నాయి.
'2022, అక్టోబర్ నుంచి శాకాహార, మాంసాహార భోజనాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మే, జూన్ 2023లో ధరలు పెరగడం మొదలైంది. ప్రతి నెలా టమాట ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం' అని క్రిసిల్ అనలిస్టులు అంటున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial