UPI Transactions: యూపీఐకి గుడ్‌బై చెప్పేస్తాం - స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనం
UPI Transaction Fee: UPI వచ్చాక క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల వినియోగం తగ్గింది. యూపీఐ లావాదేవీలపై ఫీజ్ వసూలును దాదాపు 75 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది.
UPI Digital Transaction: యూపీఐ (Unified Payments Interface) భారతదేశంలో వేగంగా విస్తరించింది, ప్రజల రోజువారీ జీవితంలో ఒక భాగమైంది. యూపీఐ వచ్చాక ప్రజలు బ్యాంక్‌లకు వెళ్లడం కూడా తగ్గించారు. గతంలో పెనుభూతంలా భారత్‌ను ఊపేసిన చిల్లర సమస్య ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలోని అనేక దేశాలు UPI తరహా విధానాన్ని అవలంబిస్తున్నాయి, అక్కడ కూడా మన UPIని యాక్సెప్ట్ చేస్తున్నాయి. మరోవైపు... మన దేశంలో ప్రతి నెలా UPI లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి, ఫిజికల్ కరెన్సీ వినియోగం వేగంగా తగ్గిపోయింది. తాజాగా, ఓ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సర్వే ప్రకారం, యుపీఐ వినియోగం ఆపేస్తామని దాదాపు 75 శాతం మంది ప్రజలు కుండబద్ధలు కొట్టారు.
UPI లావాదేవీలపై రుసుమును సహించేది లేదు
యూపీఐ లావాదేవీలపై ఫీజ్ వసూలు చేస్తారన్న ఊహాగానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లోకల్ సర్కిల్స్ (Localcircles) అనే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఒక సర్వే చేపట్టింది. ఈ ఏడాది జులై 15 - సెప్టెంబరు 20 తేదీల మధ్య ఆన్‌లైన్ పద్ధతిలో సర్వే జరిపింది. దేశంలోని 308 జిల్లాల్లో ఉన్న, వివిధ వర్గాలకు చెందిన 42,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. దాదాపు 37 శాతం మంది ప్రజలు తమ మొత్తం ఖర్చులో 50 శాతాన్ని యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. యూపీఐ వచ్చాక డిజిటల్ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం కూడా తగ్గింది.
ఒకవేళ యూపీఐ లావాదేవీలపై ఛార్జీ విధిస్తే, యూపీఐ సర్వీస్‌ను వినియోగించడం కొనసాగిస్తారా అన్న ప్రశ్నను కూడా లోకల్ సర్కిల్స్ అడిగింది. యూపీఐ ట్రాన్జాక్షన్ల మీద ఫీజ్ విధిస్తే, యూపీఐ వాడడాన్ని ఆపేస్తామని 75 శాతం మంది ప్రజలు తేల్చిచెప్పారని ఆ సంస్థ వెల్లడించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఫీజులు విధించినా వ్యతిరేకిస్తామని ప్రజలు స్పష్టం చేశారు. కేవలం 22 శాతం మంది మాత్రమే యూపీఐ లావాదేవీలపై ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన రిపోర్ట్‌లో లోకల్ సర్కిల్స్ పేర్కొంది. సర్వే ఫలితాలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (RBI) కూడా అందజేస్తామని ఈ సంస్థ తెలిపింది.
UPI లావాదేవీలు & విలువ రెండింతలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం... 2023-24 ఆర్థిక సంవత్సరంలో, UPI లావాదేవీల సంఖ్య 57 శాతం పెరిగింది, 13,100 కోట్లను దాటింది. ఆ ఏడాది UPI లావాదేవీల సంఖ్య మొదటిసారిగా 131 బిలియన్లు దాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 84 బిలియన్లుగా (8,400 కోట్ల లావాదేవీలు) ఉంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 139.1 లక్షల కోట్లుగా (ట్రిలియన్లు) ఉన్న లావాదేవీల మొత్తం విలువ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 199.89 లక్షల కోట్లకు చేరుకుంది. 2022-23తో పోలిస్తే, 2023-24లో లావాదేవీల మొత్తం విలువ 44 శాతం పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 వస్తువుల రేట్లు మారబోతున్నాయ్- బీ అలెర్ట్