Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Voda Idea, OMCs, Suryoday SFB
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 04 April 2024: రేపటి ఆర్‌బీఐ పాలసీ ఫలితాల నేపథ్యంలో, ఇండియన్ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు (గురువారం) అస్థిరంగా కదలొచ్చు.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 44 పాయింట్లు లేదా 0.2 శాతం గ్రీన్ కలర్‌లో 22,599 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ప్రైమరీ మార్కెట్‌లో, భారతి హెక్సాకామ్ IPO మొదటి రోజు ముగిసే సమయానికి 34 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఒక్కో షేరును రూ. 542-570 రేంజ్‌లో ఆఫర్ చేస్తున్న కంపెనీ, రూ.4,275 కోట్లను సమీకరించే ప్రయత్నంలో ఉంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్ నికాయ్ 1.5% ర్యాలీ చేసింది. కోస్పి కూడా మిక్స్‌డ్ ట్రెండ్‌లో కాస్త లాభాలు చూసింది. చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లకు ఈ రోజు సెలవు.
ఆర్థిక వ్యవస్థలో బలం, అధిక ద్రవ్యోల్బణం రేటును దృష్టిలో ఉంచుకుని వేచి చూసే విధానానికి కట్టుబడి ఉంటామని US ఫెడరల్ రిజర్వ్ బుధవారం పునరుద్ఘాటించింది. దీంతో, US మార్కెట్లు మిశ్రమ సెంటిమెంట్‌తో ముగిశాయి. S&P 500 0.1 శాతం, నాస్‌డాక్ 0.2 శాతం పెరిగితే, డౌ జోన్స్ 0.1 శాతం పడిపోయింది.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పుంజుకుంది, 4.359 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $90 చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్ ర్యాలీ కొనసాగుతోంది, ఔన్సుకు $2,321కి చేరింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
చమురు కంపెనీలు: కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్ మీద విండ్‌ఫాల్ టాక్స్‌ను మెట్రిక్ టన్నుకు రూ. 4,900 నుంచి రూ. 6,800 కు పెంచింది. దీంతో ONGC, ఆయిల్ ఇండియా, రిలయన్స్ వంటి షేర్లు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
NLC ఇండియా: రూ.6,000 కోట్ల విలువైన పునరుత్పాదక ఆస్తులను విక్రయించాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన ఈ ప్రభుత్వ రంగ సంస్థ కూడా మార్కెట్ దృష్టిలో ఉంటుంది.
సన్ ఫార్మాస్యూటికల్స్: ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వచ్చేలా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా ధీరజ్ సిన్హా నియమితులయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనిల్ రావు స్థానంలో పోస్టింగ్ దక్కింది.
వొడాఫోన్ ఐడియా: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రమోటర్ గ్రూప్ కంపెనీలకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 2,075 కోట్ల విలువైన ఈక్విటీ లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలను జారీ చేయడానికి ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ శనివారం బోర్డు సమావేశం నిర్వహిస్తుంది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ పవర్ కంపెనీ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మధ్యంతర డివిడెండ్‌గా (FY24) కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2,033 కోట్లు చెల్లించింది.
యూనియన్ బ్యాంక్: విదేశీ వ్యాపార వృద్ధికి కోసం విదేశీ మార్కెట్ నుంచి దాదాపు రూ. 4,200 కోట్లు సేకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) నుంచి ఈ డబ్బు సేకరించింది.
RBL బ్యాంక్: Q4FY24లో బ్యాంక్ డిపాజిట్లు సంవత్సరానికి (YoY) 22 శాతం పెరిగి రూ. 1.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో అడ్వాన్సులు 19 శాతం పెరిగి రూ.85,640 కోట్లకు చేరుకున్నాయి.
రాయల్ ఆర్చిడ్ హోటల్స్: 300 గదులు, రెస్టారెంట్, బార్, బాంకెట్ హాల్స్, మీటింగ్ రూమ్స్ ఉన్న హోటల్ మాసాను నిర్వహించడం కోసం మాసా హోటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మార్చి త్రైమాసికంలో బ్యాంక్ స్థూల అడ్వాన్సులు 41 శాతం పెరిగి రూ.8,650 కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లు 50 శాతం పెరిగి రూ.7,775 కోట్లకు చేరాయి. రుణాల చెల్లింపులు 39 శాతం పెరిగి రూ.2,340 కోట్లకు చేరుకున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పట్టపగ్గాల్లేని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి