Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Flights cancelled from Vizag and Tirupati | ఫెంగల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Landslide in Tirumala | తిరుమల: ఫెంగల్ తుపాను తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు, శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం నాడు కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ మార్గంలో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై ఎప్పటికప్పుడు జేసీబీలతో రోడ్ల మీదకు వచ్చిన బండరాళ్లను తొలగించి రోడ్డు మార్గాన్ని క్లియర్ చేస్తున్నారు.
తిరుపతి, విశాఖ నుంచి విమానాలు రద్దు
విశాఖపట్నం: ఫెంగల్ తుపాను ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖపట్నం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో వర్షాల కారణంగా విశాఖపట్నం- తిరుపతి విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును సైతం తాత్కాలికంగా మూసివేశారు. దాంతో విశాఖపట్నం- చెన్నై విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్, విమనాశ్రయ అధికారులు తెలిపారు.
ఫెంగల్ ప్రభావంతో వర్షాలు
పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం - కరైకాల్ మధ్య శనివారం రాత్రి ఫెంగల్ తుపాన్ తీరం దాటింది. పశ్చిమ- నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ బలహీనడుతోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచనతో తమిళనాడులో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో తీర ప్రాంత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ విమానానికి చెన్నై ఎయిర్ పోర్టులో ప్రమాదం తప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫెంగల్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున, విమానాల రాకపోకలకు సమస్య తలెత్తింది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చెన్నై ఎయిర్ పోర్టులో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ చేయాలని చూడగా వీలు కాలేదు. ల్యాండింగ్ చేసే ప్రయత్నంగా చేయగా పొగలు వచ్చినట్లు కనిపిస్తోంది. పైలట్ కరెక్ట్ టైంలో అప్రమత్తమై ల్యాండింగ్ బదులు, విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపడంతో ప్రమాదం తప్పిపోయింది. విమానంలో ఉన్న ప్రయాణికులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. మరోవైపు వర్షాల కారణంగా తమిళనాడులో పలు జిల్లాల్లో స్కూళ్లకు రెండు, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.