Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే
కేవలం రెండు నిమిషాల్లో (ఉదయం 9.17 గం. సమయానికి) రూ.4.09 లక్షల కోట్లు పెరిగింది, రూ.341.76 లక్షల కోట్లకు చేరుకుంది.
Stock Market News in Telugu: ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో మరో దీపావళి కనిపించింది, ఇండియన్ ఈక్విటీస్ తారాజువ్వల్లా దూసుకెళ్లాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి (GDP Data), నవంబర్ నెలలో జీఎస్‌టీ (GST) వసూళ్లు బలంగా ఉండడంతో పాటు కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) గెలుపుతో దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ ఇండీస్ ఈ రోజు (సోమవారం, 04 డిసెంబర్ 2023) తాజా రికార్డు స్థాయికి (fresh record high) చేరాయి.
రికార్డ్ రేంజ్ ఓపెనింగ్‌తో, మదుపర్ల సంపదగా పిలిచే BSEలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE listed companies market capitalisation) కేవలం రెండు నిమిషాల్లో (ఉదయం 9.17 గం. సమయానికి) రూ.4.09 లక్షల కోట్లు పెరిగింది, రూ.341.76 లక్షల కోట్లకు చేరుకుంది.
మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 981 పాయింట్లు లేదా 1.45% పెరిగి 68,462.67 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి, NSE నిఫ్టీ 307 పాయింట్లు లేదా 1.52% పెరిగి 20,575 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ల ర్యాలీని నడిపించిన కీలక అంశాలు:
రాష్ట్ర ఎన్నికల ఫలితాలు:
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో... ఉత్తరాదిలోని మూడు ప్రధాన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది, కమలం ముద్ర స్పష్టంగా కనిపించింది. దీంతో... కేంద్రంలో ప్రభుత్వం మారదు, రాజకీయ స్థిరత్వం ఉంటుందన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. ఆ ప్రభావంతో దలాల్ స్ట్రీట్‌లో ఊపు పెరిగింది, బీఎస్‌ఈ & ఎన్‌ఎస్‌ఈ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఆసియా మార్కెట్లు:
ఈ రోజు ప్రారంభ సెషన్‌లో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ మినహా ఆసియా-పసిఫిక్ షేర్ల MSCI సూచీ 0.4% పెరిగింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. యెన్ లాభాలు కొనసాగడంతో జపాన్ నికాయ్ 0.4% క్షీణించింది.
US బాండ్ ఈల్డ్స్ (US bond yield):
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు గురించి US ఫెడ్ అధికార్ల కామెంట్ల తర్వాత ట్రెజరీ ఈల్డ్స్ భారీగా క్షీణించాయి, 'మల్టీ-మంత్ లో' లెవెల్స్‌కు చేరుకున్నాయి. రెండేళ్ల బాండ్ ఈల్డ్స్ 4.6% వద్ద కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 4.23% వద్ద కనిష్టానికి దిగి వచ్చాయి.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు:
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIs), శుక్రవారం, నికరంగా రూ.1,589 కోట్ల విలువైన ఇండియన్ షేర్లను కొనుగోలు చేశారు, నెట్ బయ్యర్స్‌గా కొనసాగారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) రూ.1,448 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సెప్టెంబర్, అక్టోబర్‌లోని విక్రయాల తర్వాత, ఎఫ్‌ఐఐలు నవంబర్ నెలలో రూ.9,001 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.
$80 దిగువన ముడి చమురు:
మిడిల్ ఈస్ట్‌లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ఆ ప్రాంతం నుంచి సరఫరా గురించిన ఆందోళనలు కూడా పెరిగాయి, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 52 సెంట్లు లేదా 0.5% పడిపోయి $78.36కి చేరుకుంది. WTI క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 45 సెంట్లు లేదా 0.6% తగ్గి $73.62 వద్ద ఉన్నాయి.
బలం పుంజుకున్న రూపాయి:
ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, భారతదేశ పాలక పక్షం విజయంతో, ఈ రోజు ట్రేడ్ ప్రారంభంలో, US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 6 పైసలు పెరిగి $83.27కి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ కూడా 0.03% పెరిగి 103.29 స్థాయికి చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: చుక్కలు దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి