Stock Market: ఎలుగుబంట్ల పట్టుతో టాప్-10 కంపెనీల్లో 8 విలవిల, నష్టం రూ. 1.17 లక్షల కోట్లు
గత వారం, 30 షేర్ల BSE సెన్సెక్స్ 775.94 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టపోయింది.
Stock Market: స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి, బ్లూ చిప్ కంపెనీల ఇన్వెస్టర్లకు కూడా నష్టాలు తప్పడం లేదు. గత వారంలో (సోమవారం-శుక్రవారం), BSEలోని టాప్-10 కంపెనీల్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ (market capitalization) ఏకంగా రూ. 1,17,493.78 కోట్లు క్షీణించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలోని ఇన్ఫోసిస్ అత్యధికంగా నష్టపోయింది. గత వారం, 30 షేర్ల BSE సెన్సెక్స్ 775.94 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టపోయింది.
ఈ వారంలో నష్టపోయిన ఎనిమిది కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఉన్నాయి. ITC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే పెరిగింది.
అత్యధికంగా క్షీణించిన ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ
సమీక్ష కాల వారంలో, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అతి భారీగా రూ. 66,854.05 కోట్లు తగ్గి రూ. 5,09,215 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. మార్చి త్రైమాసిక ఫలితాలను ఈ నెల 13న ఈ ఐటీ కంపెనీ ప్రకటించింది.
గత వారంలో.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 10,880.5 కోట్లు తగ్గి రూ. 9,33,937.35 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.10,462.77 కోట్లు తగ్గి రూ. 6,17,477.46 కోట్లకు పడిపోయింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 10,318.52 కోట్ల నష్టంతో రూ. 11,56,863.98 కోట్లకు దిగి వచ్చింది. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) మార్కెట్ విలువ రూ. 8,458.53 కోట్ల నష్టంతో రూ. 5,86,927.90 కోట్లకు చేరింది. HDFC మార్కెట్ క్యాప్ రూ. 5,172.27 కోట్లు తగ్గి రూ. 5,06,264.24 కోట్లకు దిగజారింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా నష్టం
మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. గత వారంలో, RIL మార్కెట్ విలువ రూ. 4,566.52 కోట్లు క్షీణించి రూ. 15,89,169.49 కోట్లకు పరిమితమైంది. భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ. 780.62 కోట్లు కోల్పోయి రూ. 4,26,635.46 కోట్లకు చేరింది.
ఇన్వెస్టర్లకు లాభాలు పంచిన రెండు స్టాక్స్
నష్టాల ట్రెండ్‌కు భిన్నంగా, ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15,907.86 కోట్లు పెరిగి రూ. 5,07,373.82 కోట్లకు చేరుకుంది. గత వారంలో, ఐటీసీ స్టాక్ ధర తొలిసారి రూ. 400 మార్క్ దాటింది, కంపెనీ మార్కెట్ విలువ కూడా తొలిసారి రూ.5 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వాల్యుయేషన్ రూ. 8,746.11 కోట్లు పెరిగి రూ. 4,84,561.80 కోట్లకు చేరింది.
మొదటి స్థానం నిలబెట్టుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
నష్టపోయినప్పటికీ, టాప్-10 సెన్సెక్స్ కంపెనీల్లో మొదటి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలబెట్టుకుంది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ITC, HDFC, SBI, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.