Trade deal: బ్రిటన్‌తో భారత్ భారీ ట్రేడ్ డీల్ - మోదీ పర్యటనలో సంతకాలు పూర్తి
India UK trade deal: ఇండియా, బ్రిటన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. మోదీ లండన్ పర్యటనలో రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Starmer and Modi sign India UK trade deal: భారతదేశం , యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , యూకే ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆరు బిలియన్ పౌండ్ల వాణిజ్యం జరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఒప్పందం వల్ల యూకే ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 4.8 బిలియన్ పౌండ్ల మేర లాభం జరుగుతుంది. భారతదేశం నుంచి యూకేకి 11 బిలియన్ పౌండ్ల విలువైన వస్తువుల దిగుమతులు ఇప్పటికే జరుగుతున్నాయి. కొత్తగా జరిగిన ట్రేడ్ డీల్ వల్ల వస్త్రాలు, ఆభరణాలు వంటి భారతీయ ఎగుమతులు మరింతగా చౌకగా బ్రిటన్ లో లభిస్తాయి.
యూకే నుంచి భారతదేశానికి ఎగుమతి చేసే వస్తువులపై సగటు సుంకం 15 నుంచి 3 శాతానికి తగ్గించారు. ఇది యూకే కంపెనీలకు మేలు చేస్తుంది. మద్యం ఎగుమతులపై సుంకం 150 శాతం నుంచి 75 శాతం తగ్గించారు. 2035 నాటికి ఇది 40 శాతానికికి చేరుతుంది. ఈ ఒప్పందం యూకేలో 2,200 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని స్టార్మర్ పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలు ఏరోస్పేస్, టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాలలో ఇంజనీర్లు, టెక్నీషియన్లు , సప్లై చైన్ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి.
భారతీయ ఎగుమతులపై 99 శాతం పన్నులు.. సున్నాకు వచ్చాయి. వస్త్రాలు, ఆభరణాలు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల భాగాలను యూకే మార్కెట్‌లోకి సులభంగా భారతీయ కంపెనీలు ప్రవేశ పెట్టవచ్చు. భారతీయ కంపెనీల నుంచి యూకేకి తాత్కాలికంగా బదిలీ అయిన ఉద్యోగులు, యూకే కంపెనీల నుంచి భారతదేశంలో తాత్కాలికంగా పనిచేసే ఉద్యోగులు, రెండు దేశాలలో సామాజిక భద్రతా చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. వారి స్వదేశంలో మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ మినహాయింపు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు పొడిగించారు.
The UK has signed a trade deal with India - the largest agreement Britain has signed since leaving the European Union.
— Sky News (@SkyNews) July 24, 2025
Watch the moment here ⬇️ https://t.co/yQEsoSDgsp
📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/LJHdfOHNib
రెండు దేశాలు రక్షణ, విద్య, వాతావరణం, టెక్నాలజీ, ఆవిష్కరణలలో సన్నిహిత సహకారంపై అంగీకరించాయి. నేర రికార్డుల భాగస్వామ్యంతో కూడిన కొత్త ఒప్పందం కోర్టు కార్యకలాపాలకు, ఖచ్చితమైన వాచ్‌లిస్ట్‌ల నిర్వహణకు, ట్రావెల్ బ్యాన్‌ల అమలుకు సహాయపడుతుంది.నఅక్రమ వలసలను ఎదుర్కోవడానికి మెరుగైన ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆపరేషనల్ సహకారంపైనా సంతకాలు జరిగాయి. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, సీరియస్ ఫ్రాడ్, రప్షన్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
యూకే, భారతదేశంలో పెట్టుబడుల రక్షణ కోసం బైలాటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీపై చర్చలు కొనసాగుతున్నాయి. స్టార్మర్ ఈ ఒప్పందాన్ని "చారిత్రాత్మకం" అని అభివర్ణించారు. ఇది బ్రిటిష్ కార్మికుల జీవన వ్యయాన్ని తగ్గించడంలో.. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం మే 2025లో ప్రకటించబడినప్పటికీ, భారత కేబినెట్ ఈ వారం దీనిని ఆమోదించింది. ఇది పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది . అమలులోకి రావడానికి కనీసం ఒక సంవత్సరం పట్టవచ్చు. ఈ ఒప్పందం చర్చలు 2022లో మాజీ యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హయాంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికి ఓ స్పష్టత వచ్చింది.





















