SpiceJet Crisis: స్పైస్‌జెట్ ఉద్యోగులకు 3 నెలలు జీతం కట్, బలవంతంగా సెలవులు
SpiceJet Furlough Scheme: స్సైస్‌జెట్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. DGCA, హైకోర్టు నుంచి కూడా మొట్టికాయలు తింటోంది.
SpiceJet Crisis: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ కంపెనీ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తన సిబ్బందిలో కొందరికి సెలవులు ఇచ్చి ఇంటికి పంపింది. సెలవులు ఇస్తే సంతోషమే కదా అనుకోకండి. వాళ్లు సెలవుల్లో ఉన్నంత కాలం జీతం ఉండదు. మరోవైపు... స్పైస్‌జెట్‌పై నిఘాను మరింత కఠినతరం చేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ 'డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్' (DGCA) నిర్ణయించింది.
3 నెలల జీతం కోత
ఆఫ్ సీజన్ కావడం, ఎయిర్ పాసెంజర్ల సంఖ్య తగ్గడంతో స్పైస్‌జెట్ బిజినెస్ తగ్గింది. దీంతో విమాన సర్వీసుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, ఖర్చులు తగ్గించుకునేందుకు సిబ్బందిపై "ఫర్‌లో స్కీమ్"ను (furlough scheme) విమానయాన సంస్థ అప్లై చేసింది. ఉద్యోగిని "ఫర్‌లో" పంపడం అంటే జీతం లేకుండా సెలవు ఇచ్చినట్లు అర్థం. ఈ విధంగా 150 మందిని జీతం లేని సెలవులపై ఇంటికి పరిమితం చేసింది. స్పైస్‌జెట్ "ఫర్‌లో" పంపిన 150 మంది ఉద్యోగులంతా క్యాబిన్ సిబ్బందే. బాధిత ఉద్యోగులకు తదుపరి 3 నెలల పాటు జీతం రాదు.
"ఆఫ్ సీజన్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో "ఫర్‌లో" నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చింది. 150 మంది క్యాబిన్ క్రూని మూడు నెలల పాటు సెలవులో పంపుతున్నాం. సెలవు కాలంలోనూ వారిని కంపెనీ ఉద్యోగులుగానే పరిగణిస్తాం, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్జిత సెలవులు (earned leaves) సదుపాయాలు యథాతథంగా కొనసాగుతాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గడం, విమాన సర్వీసులు తగ్గడం వల్ల సంస్థ భవిష్యత్‌ను, స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’’ - స్పైస్‌జెట్
22 విమానాలతో బిజినెస్
అప్పుల భారం పెరిగి ఆర్థిక పరిస్థితి దిగజారడంతో స్పైస్‌జెట్ తన విమానాల సంఖ్యను తగ్గించింది. ప్రస్తుతం, కేవలం 22 విమానాల ఫ్లీట్‌తో పని చేస్తోంది.
డీజీసీఏ, హైకోర్టు నుంచి మొట్టికాయలు
మరోవైపు, ఏవియేషన్ రెగ్యులేటర్ నుంచి చర్యలు పెరగడం కూడా ఈ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సమస్యలు ఇంకా పెంచింది. DGCA స్పైస్‌జెట్‌ను సమగ్ర నిఘాలో ఉంచాలని నిర్ణయించింది. విమానయాన సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు స్పాట్ చెక్స్ చేయాలని, రాత్రి వేళ నిఘా పెంచాలని DGCA నిర్ణయించింది. ఆగస్టు 7, 8 తేదీల్లో స్పైస్‌జెట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీస్‌లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కొన్ని లోపాలు కనిపించినట్లు DGCA వెల్లడించింది.
దిల్లీ ఉన్నత న్యాయస్థానంలో కూడా స్పైస్‌జెట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 3 ఇంజిన్‌లను గ్రౌండ్ చేసి 15 రోజుల్లోగా లీజింగ్ కంపెనీలకు (లీజర్స్) తిరిగి ఇవ్వాలని ఈ విమానయాన కంపెనీని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. లీజింగ్ కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడంలో పదేపదే విఫలమైనందుకు స్పైస్‌జెట్‌ను కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
ఇటీవల వెల్లడించిన త్రైమాసిక ఫలితాల (Q1FY25) ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో స్పైస్‌జెట్ రూ.149.96 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023 ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.204.56 కోట్లతో పోలిస్తే ఇది 27% తక్కువ. మొత్తం ఆదాయం కూడా తగ్గింది. Q1FY24లో వచ్చిన ఆదాయం రూ. 2,268.06 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.2,067.21 కోట్లు మాత్రమే సంపాదించింది.
మరో ఆసక్తికర కథనం: రిటైర్ అయ్యే ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ దరఖాస్తు - వివరాలన్నీ ఒకే ఫారంలో, సంతకం చేస్తే చాలు!