Plastic Ban Items: ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని వాడుతున్నారా? జులై 1 నుంచి కేంద్రం నిషేధం.. వాడితే పనిష్మెంట్!!
Single Use Plastic Ban Items List: వాతావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి మాత్రమే వాడి పారేసి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది.
నింగి, నేల, నీరు కాలుష్యం బారిన పడకుండా పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి మాత్రమే వాడి పారేసి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. 2022, జులై 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. 2022 నుంచి దశల వారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single use plastic items) ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజన్‌తో ఉన్నారని తెలిపింది. చెత్తా చెదారంలోకి చేరి పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నామని వెల్లడించింది.
జులై 1 నుంచి నిషేధించే ప్లాస్టిక్ వస్తువుల జాబితా
- ప్లాక్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్
- బుడగలకు ఉపయోగించే ప్లాస్టిక్ పుల్లలు
- ప్లాస్టిక్ జెండాలు
- క్యాండీ స్టిక్స్‌ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ పుల్లలు
- అలంకరణ కోసం వినియోగించే థెర్మకోల్
- ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు
- మిఠాయి డబ్బాలకు చుట్టే ప్లాస్టిర్ రేపర్లు, ప్యాకేజింగ్ రేపర్లు
- ఆహ్వాన పత్రికలు
- సిగరెట్ పెట్టెలు
- 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు
- కాఫీ, టీ కలుపుకొనే పుల్లలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు కేంద్రం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఎవరైనా అనుమతి లేకుండా, దొంగచాటుగా వీటిని తయారు చేస్తున్నారా, దిగుమతి, నిల్వ, సరఫరా, అమ్మకం చేస్తున్నారో గమనించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతరాష్ట్ర సరఫరాపై నిఘా వేసేందుకు సరిహద్దు చెక్‌పాయింట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. పౌరులను సైతం భాగస్వాములను చేసేందుకు పరిష్కార వేదికగా సీపీసీబీ గ్రీవెన్స్ రెడ్రసల్ యాప్‌ను ఆవిష్కరించింది.
'ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ నిబంధనలు, 2021 ప్రకారం సెప్టెంబర్ 30, 2021 నుండి అమలులోకి వచ్చే విధంగా డెబ్బై ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది. 31 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చే విధంగా నూట ఇరవై మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన వాటిపై నిషేధం ఉంటుంది.
సూక్ష్మ,చిన్నమరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ (సిపెట్) మరియు వాటి రాష్ట్ర కేంద్రాలతో పాటుగా సిపిసిబి / ఎస్ పిసిబిలు / పిసిసిల ప్రమేయంతో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాల తయారీకి సాంకేతిక సహాయాన్ని అందించడం కోసం MSME యూనిట్ ల కొరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ లు నిర్వహిస్తాం. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నుండి దూరంగా పరివర్తన చెందడంలో అటువంటి సంస్థలకు మద్దతు ఇవ్వడానికి నిబంధనలు రూపొందించారు' అని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.