SIM Card Rules: కొత్త సిమ్ కొనే ముందు ఒకటికి, రెండుసార్లు ఆలోచించండి - రూ.లక్షల్లో జరిమానా!
MNP Regulations: వచ్చే నెల నుంచి మొబైల్ నంబర్లకు సంబంధించిన రూల్స్ మారుతునున్నాయి. అసాంఘిక, దేశ విద్రోహ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డ్ నిబంధనలను కఠినంగా మారుస్తోంది.
Mobile Number Portability New Rules: వచ్చే నెల ఒకటో తేదీ (2024 జులై 01) నుంచి, మొబైల్ నంబర్ రూల్స్ సహా టెలికమ్యూనికేషన్ రంగంలో చాలా నిబంధనలు మారనున్నాయి. సిమ్ కార్డ్‌లను ఉపయోగించి మోసం చేస్తున్న కేసులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం టెలికాం నియమాలను సవరించి, కఠినంగా మార్చింది. సవరించిన చట్ట నియమాలు 01 జులై 2024 నుంచి అమలులోకి వస్తాయి.
టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (9వ సవరణ) నిబంధనలు-2024 ఈ ఏడాది జులై 01 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడిస్తూ, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), ఈ ఏడాది మార్చి 14న కొత్త సవరణలు చేసింది. వాటిని జులై 01 నుంచి అమలు చేయబోతున్నారు.
యునిక్ పోర్టింగ్ కోడ్‌లో కొత్త నిబంధన
సిమ్ స్వాప్ లేదా సిమ్ రీప్లేస్‌మెంట్ పద్ధతి ద్వారా అసాంఘిక శక్తులు మొబైల్ నంబర్‌లను పోర్ట్ చేసే అవకాశాలను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నియమాల్లో మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ సవరణ ద్వారా, మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి అవసరమైన యునిక్ పోర్టింగ్ కోడ్‌కు (UPC) సంబంధించిన కొత్త రూల్‌ను యాడ్ చేశారు.
UPC రిక్వెస్ట్‌ను తిరస్కరించొచ్చు
యునిక్ పోర్టింగ్ కోడ్ కోసం వచ్చే రిక్వెస్ట్‌ను తిరస్కరించే హక్కు ఈ చట్టం ద్వారా దఖలు పడుతుంది. ప్రత్యేకించి.. సిమ్ మార్చినప్పుడు లేదా స్వాప్ చేసినప్పుడు 7 రోజుల లోపు పోర్ట్ కోడ్ రిక్వెస్ట్ పంపిన సందర్భాల్లో, ఆ అభ్యర్థనను తిరస్కరించవచ్చు. అంటే సిమ్ స్వాప్ లేదా సిమ్ రీప్లేస్‌మెంట్ తర్వాత కనీసం 7 రోజులు గడిచిన తర్వాత మాత్రమే మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడం సాధ్యం అవుతుంది. గతంలో ఈ వెయిటింగ్ పిరియడ్ 10 రోజులుగా ఉండేది. తాజా సవరణ ద్వారా ఆ గడువును కేంద్ర ప్రభుత్వం 7 రోజులకు తగ్గించింది. సిమ్ స్వాప్ తర్వాత 10 రోజుల వెయిటింగ్ పిరియడ్ చాలా ఎక్కువని పరిశ్రమ వర్గాలు అభ్యర్థించాయి. అంత సుదీర్ఘ నిరీక్షణ కారణంగా సబ్‌స్క్రైబర్లు ఇబ్బందులు పడుతున్నట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. నిరీక్షణ గడువు 2 నుంచి 4 రోజుల ఉంటే చాలని చెప్పాయి. అయితే, సిమ్ కార్డ్‌లను ఉపయోగించి జరుగుతున్న మోసాల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం నిరీక్షణ కాలాన్ని 7 రోజులుగా మార్చింది.
సిమ్ కార్డ్‌ను ఉపయోగించి చేసే అక్రమాలకు అరికట్టేందుకు భారత ప్రభుత్వం మరికొన్ని రూల్స్‌ను కూడా మార్చింది. ఈ మార్పులు కూడా జులై 01 నుంచి అమల్లోకి వస్తాయి.
సిమ్ కార్డ్‌ల విషయంలో జులై 01 నుంచి కనిపించే కొన్ని ప్రధాన మార్పులు:
--- ఇకపై, ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవచ్చు. జమ్ము&కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఈ పరిమితి 6 సిమ్ కార్డ్‌లు.
--- పరిమితికి మించి సిమ్ కార్డు కొనుగోలు చేస్తే భారీ జరిమానా విధిస్తారు. మొదటి ఉల్లంఘనకు రూ.50 వేలు, రెండో ఉల్లంఘనకు రూ.2 లక్షలు జరిమానా విధిస్తారు.
--- వేరొకరి ఐడీ ద్వారా తప్పుడు మార్గంలో సిమ్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాల జైలు శిక్ష & రూ.50 లక్షల జరిమానా వంటి భారీ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది.
--- వినియోగదారు అనుమతి లేకుండా కంపెనీలు వాణిజ్యపరమైన సందేశాలను పంపకూడదు. ఈ నియమం ఉల్లంఘిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా చెల్లించాలి.
--- అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, భారత ప్రభుత్వం మొత్తం టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను స్వాధీనం చేసుకుటుంది. కాల్స్ & సందేశాలను కూడా నియంత్రిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: 6 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్నా EPS విత్‌డ్రా - ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు