Share Market Update: బుల్.. భలే రన్! 60వేల పైనే ముగిసిన సెన్సెక్స్.. ఆ 4 కంపెనీలే కీలకం
గురువారం 59,885 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయమే భారీ లాభంతో మొదలైంది. 60,108 వద్ద ఆరంభమై 11 గంటల ప్రాంతంలో ఇంట్రాడే గరిష్ఠమైన 60,315ను తాకింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17,842 వద్ద ముగిసింది.
'బుల్' రంకెలేసింది.. మునుపెన్నడూ లేనంత వేగంగా పరుగులు తీస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారత ఆర్థిక మార్కెట్లకు తిరుగులేదని చాటి చెప్పింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారి 60,000 మైలురాయిని అధిగమించింది. వారాంతమైనా సరే ఆపై స్థాయిలో నిలదొక్కుకొంది. మున్ముందు తన లక్ష్యం 'లక్ష' అని చాటింది. మదుపర్లు సంపదగా భావించే నిఫ్టీ సైతం 18వేలకు చేరువైంది.
Also Read: మళ్లీ దుమ్మురేపిన జియో.. పోటీలో ఎయిర్‌టెల్! వొడాఫోన్ ఐడియాకు కష్టాలు
పండగ వాతావరణం
శుక్రవారం మార్కెట్లలో పండగ వాతావరణం కనిపించింది. ఆరంభమైన వెంటనే సూచీలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. గురువారం 59,885 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయమే భారీ లాభంతో మొదలైంది. 60,108 వద్ద ఆరంభమై 11 గంటల ప్రాంతంలో ఇంట్రాడే గరిష్ఠమైన 60,315ను తాకింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ ఉదయం 17,897 వద్ద మొదలై 11 గంటల ప్రాంతంలోనే ఇంట్రాడే గరిష్ఠమైన 17,938ని తాకింది. అయితే 18వేల మార్కును మాత్రం అందుకోలేదు. చివరికి 30 పాయింట్ల లాభంతో 17,842 వద్ద ముగిసింది.
Also Read: మరింత పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ భారీగా.. హైదరాబాద్‌లో స్థిరం
ఫోకస్‌లో ఈ షేర్లు
నిఫ్టీలో ఏసియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ, దివీస్ ల్యాబ్, శ్రీసెమ్ నష్టాల బాట పట్టాయి. భారతీ ఎయిర్‌టెల్, జీ, ఇండస్ టవర్, డీఎల్‌ఎఫ్, రిలయన్స్ షేర్లు ఎక్కువగా చేతులు మారాయి.
167 రోజుల్లోనే
భారత స్టాక్ మార్కెట్లు కేవలం సరికొత్త గరిష్ఠాలకు చేరేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. కేవలం 167 రోజుల్లోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 50000 నుంచి 60000కు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సూచీ పదివేల పాయింట్లు ఎగబాకడం ఇదే తొలిసారి. అంతకు ముందు పదివేల పాయింట్లకు సూచీ 931 ట్రేడింగ్ సెషన్లు తీసుకుంది.
మొత్తంగా సెన్సెక్స్ 60,000 మార్క్‌ను అందుకోవడానికి 31 ఏళ్లు తీసుకుంది. 1990, జులై 25న 1000 పాయింట్ల మైలురాయి అందుకుంది. 2015, మార్చి 4న 30,000 మార్క్‌ను తాకింది. 30వేలకు 25 ఏళ్లు పట్టగా 30,000 నుంచి 60,000కు చేరుకొనేందుకు కేవలం ఆరేళ్లే తీసుకుంది.
Also Read: ఎల్‌ఐసీలో.. చైనా పెట్టుబడులు అడ్డుకొనే దిశగా కేంద్రం అడుగులు
4 కంపెనీల వల్లే
సెన్సెక్స్ 50 వేల నుంచి 60 వేలకు చేరుకొనేందుకు నాలుగు కంపెనీలు కీలకంగా మారాయి. ఇన్ఫోసిస్ (30% పెరుగుదల), రిలయన్స్ ఇండస్ట్రీస్ (19%), ఐసీఐసీఐ బ్యాంక్ (30%), భారతీ ఎయిర్‌టెల్ (25%).. సూచీ 50వేల తర్వాత 20% పెరిగేందుకు ఉపయోగపడ్డాయి. ఈఆర్థిక ఏడాదిలో సూచీలోని కంపెనీలు ఆదాయం 35 శాతం, వచ్చే ఏడాది 20 శాతం వరకు పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.