RIL Q2 Results: సెప్టెంబర్ క్వార్టర్‌లో రిలయన్స్ లాభం 27 శాతం జంప్ - రిటైల్, టెలికాంలో జోష్
ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను కంపెనీ బోర్డులోకి తీసుకురావడానికి వాటాదార్ల నుంచి ఆమోదం లభించింది.
Reliance Q2 Results: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అద్భుతమైన లాభాన్ని కళ్లజూసింది. 2023 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అంబానీ కంపెనీ రూ.17,394 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ లెక్కన ఒక్కో షేరుకు రూ.25.71 లాభం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.13,656 కోట్ల లాభాన్ని సాధించింది. అప్పుడు ఒక్కో షేరుకు రూ.19.92 లాభం లెక్క తేలింది. ఈ ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈసారి ప్రాఫిట్ 27 శాతం (YoY) పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో రూ.16,011 కోట్ల లాభాన్ని RIL ఆర్జించింది.
రెండో త్రైమాసికంలో, కార్యకలాపాల ఆదాయం రూ. 2.34 లక్షల కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.2.35 లక్షల కోట్లుగా ఉంది.
కంపెనీలోని అన్ని వ్యాపార విభాగాల బలంగా పని చేశాయని, వాటి ఆర్థిక సహకారం కారణంగా రిలయన్స్ ఒకదాని తర్వాత మరొక త్రైమాసికంలో అద్భుతమైన వృద్ధిని చూపడంలో విజయవంతం అవుతోందని రెండో త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చెప్పారు.
రిలయన్స్ వ్యాపార విభాగాల ఆర్థిక ఫలితాలను విశ్లేషిస్తే...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన వ్యాపారమైన చమురు-రసాయనాల వ్యాపారం సెప్టెంబర్ క్వార్టర్‌లో పుంజుకుంది. ఇంధనం & పెట్రోకెమికల్స్‌కు పెరిగిన డిమాండ్, విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్‌లో కోత వల్ల ఎక్కువ లాభం మిగిలింది. O2C విభాగం ఎబిటా 36% పెరిగి రూ. 16,281 కోట్లకు చేరింది. చమురు ధర 14% తగ్గడంతో ఆదాయం 7.3% తగ్గి రూ.1,47,988 కోట్లకు పరిమితమైంది
రిలయన్స్ రిటైల్ స్థూల ఆదాయం 18.8 శాతం పెరిగి రూ. 77,148 కోట్లకు చేరుకుంది. ఫుడ్ అండ్ గ్రోసరీ విభాగంలో 33 శాతం వృద్ధి నమోదైంది. రిలయన్స్ రిటైల్ ఈ త్రైమాసికంలో రూ. 2790 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. సెకండ్ క్వార్టర్‌లో రిలయన్స్ రిటైల్ 471 కొత్త స్టోర్లను ప్రారంభించింది, దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 18,650కి చేరుకుంది. రెండో త్రైమాసికంలో, రిలయన్స్ రిటైల్ స్టోర్లలోకి 260 మిలియన్ల మంది వచ్చివెళ్లారు. ఇది 40.5 శాతం ఎక్కువ.
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఫలితాలను పరిశీలిస్తే... రెండో త్రైమాసికంలో, ఈ వ్యాపార ఆదాయం 10.6 శాతం పెరిగి రూ. 31,537 కోట్లకు చేరుకుంది. లాభం 12 శాతం జంప్‌తో రూ. 5,297 కోట్లుగా ఉంది. జియో ఈ త్రైమాసికంలో 11.1 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. ఒక్కో వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU) 2.5 శాతం పెరిగి రూ.181.7కి చేరింది.
ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను కంపెనీ బోర్డులోకి తీసుకురావడానికి వాటాదార్ల నుంచి ఆమోదం లభించింది. జియో ట్రూ5జీ త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ చెప్పారు.
శుక్రవారం, BSEలో 1.75% పెరిగిన రిలయన్స్ షేర్ ప్రైస్ రూ. 2,265.25 దగ్గర క్లోజ్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అదానీ గ్రూప్ దర్యాప్తులో ఊహించని ట్విస్ట్, NFRA బరిలోకి దిగడంతో మారిన స్టోరీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial