Sensex Down: సెన్సెక్స్ 900, నిఫ్టీ 260 పాయింట్లు పతనం - భారీ దెబ్బకొట్టిన నిఫ్టీ బ్యాంక్
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో BSE ఇన్వెస్టర్లు రూ. 6.6 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
Sensex Down: అదానీ స్టాక్స్ ప్రభావం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇండియన్ స్టాక్ మార్కెట్లను అమెరికన్ బ్యాంక్‌ల రూపంలో మరో సంక్షోభం చుట్టుముట్టింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ రూపంలో వచ్చి పడిన ఉప్పెన ధాటికి భారతీయ స్టాక్ మార్కెట్లు కొట్టుకుపోయాయి.
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో BSE ఇన్వెస్టర్లు రూ. 6.6 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 2,000 పాయింట్లు క్రాష్ అయ్యింది.
ఇవాళ, ఒకదశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. డే-హై నుంచి 1300 పాయింట్ల మేర క్షీణించింది. చివరకు, 1.52% లేదా 897 పాయింట్ల నష్టంతో 58,238 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.48% లేదా 259 పాయింట్ల నష్టంతో 17,154 వద్ద స్థిరపడింది, కీలకమైన 17,200 స్థాయిని కోల్పోయింది. ఇంత నష్టాలకు మూలకారణమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2.27% లేదా 920 పాయింట్ల నష్టంతో 39,564 పాయింట్ల వద్ద రోజును ముగించింది.
ఈరోజు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవడంతో, ఫియర్ గేజ్ ఇండెక్స్ 'ఇండియా VIX' 15% పెరిగింది.
దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదార్లను ఇబ్బంది పెట్టిన 5 ముఖ్యాంశాలు ఇవి:
SVB, సిగ్నేచర్ సంక్షోభం
US రెగ్యులేటర్స్ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. SVB పెట్టిన మంటను సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం మరింత పెంచింది. దీంతో మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్, ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బాగా దెబ్బతింది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు వాల్ స్ట్రీట్ సంకేతాలకు అనుగుణంగా నడుచుకున్నాయి. గత వారం, డౌ జోన్స్ 4.4%, S&P 500 4.5%, నాస్‌డాక్ 4.7% పడిపోయాయి. వీటికి అనుగుణంగా... ఇవాళ, జపాన్‌కు చెందిన నికాయ్ 1% పైగా క్షీణించగా, ఆస్ట్రేలియాకు చెందిన ASX 200 0.5% డౌన్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఇండియన్ మార్కెట్స్ సెల్లాఫ్ మరింత తీవ్రమైంది.
బ్యాంకు స్టాక్స్‌లో అమ్మకాలు
బ్యాంకుల షేర్లు అంతర్జాతీయంగా పతనమైన నేపథ్యంలో, నిఫ్టీ బ్యాంక్ ఈరోజు 2% పైగా నష్టపోయింది. ఈ ప్యాక్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా పతనమైంది, 7% పైగా నష్టపోయింది. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి.
ఫెడ్ భయం
SVB సంక్షోభం నేపథ్యంలో, యూఎస్ ఫెడ్ నుంచి 50 బేసిస్ పాయింట్ల పెంపు అవకాశాలు తగ్గాయి. అయినా, అమెరికాలో ఫిబ్రవరి వినియోగదారు ధరల సూచీ (ద్రవ్యోల్బణం), ఉత్పత్తిదారు ధరల సూచీపై మార్కెట్ పార్టిసిపెంట్స్ దృష్టి పెట్టారు. మార్కెట్ ఊహించినట్లుగా, జనవరి కంటే ఇవి పెరిగితే, ఫెడ్ నుంచి 50 బేసిస్ పాయింట్ల పెంపును ఆశించవచ్చు, ఆ పెంపు చక్రం ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది.
బలహీనంగా ఉన్న సాంకేతిక ఛార్ట్‌లు
వీక్లీ చార్ట్‌లో, నిఫ్టీ గత కొన్ని వారాలుగా ఏకీకృతం (consolidate) అవుతోంది. ప్రైజెస్ క్రమంగా వాటి కనిష్ట స్థాయులకు దిగి వస్తున్నాయి. ఇది, 'బేరిష్ - సైడ్‌వేస్' మొమెంటంను సూచిస్తోంది. డైలీ ఛార్ట్‌లో, గత శుక్రవారం, బేరిష్ ఎంగుల్పింగ్ క్యాండిల్‌స్టిక్ (bearish engulfing) ప్యాట్రెన్‌ను ఫామ్ చేసింది. దీంతోపాటు స్వల్పకాలిక సగటులు (9 & 21) EMA కంటే దిగువన ముగిసింది.
నిఫ్టీ 17,200 స్థాయి కంటే దిగువకు పడిపోయిన నేపథ్యంలో, ఇండెక్స్ కొత్త మద్దతు ఇప్పుడు 17,000 స్థాయిలో కనిపిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.