SBI Credit Card Rules: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు, కస్టమర్లకు షాక్ ఇచ్చిన బ్యాంక్
మీ దగ్గర ఈ కార్డ్ ఉండి, మీరు ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
SBI Credit Card Rules: కొత్త సంవత్సరం 2023 ప్రారంభం నుంచి చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అవన్నీ మన దైనందిన జీవితం మీద, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ప్రభావం చూపే అంశాలే. వాటి గురించి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది, నష్టాన్ని నివారింవచ్చు.
ఇదే కోవలో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా నేటి (శుక్రవారం, 06 జనవరి 2023) నుంచి తన సేవల విషయంలో కొన్ని మార్పులు చేసింది. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ సేవలు అందించే కంపెనీ 'ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్' (SBI Cards & Payment Services Ltd), తాను జారీ చేసిన ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్‌కు (SBI Simply CLICK Credit Card) సంబంధించిన నిబంధనలు మార్చింది. మీ దగ్గర ఈ కార్డ్ ఉండి, మీరు ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు
SBI కార్స్డ్ & పేమెంట్ సర్వీసెస్ ప్రకటించిన ప్రకారం... ఓచర్లు & రివార్డ్ పాయింట్ల రిడీమ్‌కు సంబంధించిన నిబంధనలు జనవరి 6, 2023 నుంచి మారాయి. క్లియర్ ట్రిప్ (Cleartrip) ఓచర్లు అందుకున్న Simply CLICK కార్డ్ హోల్డర్లు, ఇప్పుడు దానిని ఒకే లావాదేవీలో రీడీమ్ చేసుకోవాలి. గతంలోలాగా దపదఫాలుగా రిడీమ్ చేసుకోవడం కుదరదు. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన వ్యయం నిర్దిష్ట పరిమితిని అందుకోగానే, సింప్లీక్లిక్ కార్డ్ హోల్డర్లకు క్లియర్ ట్రిప్ ఓచర్లు జారీ అవుతాయి.
5X రివార్డ్ పాయింట్లు మాత్రమే
కొత్త నియమం ప్రకారం... Simply CLICK లేదా Simply CLICK Advantage SBI కార్డ్‌తో మీరు అమెజాన్‌లో (Amazon.in) చేసిన ఆర్డర్లకు సంబంధించి, మీకు క్రెడిట్ అయ్యే రివార్డ్ పాయింట్ రూల్స్ మారాయి. ఈ కార్డ్ ద్వారా Amazonలో చేసిన ఖర్చు మీద 10X రివార్డ్ పాయింట్లు గతంలో వచ్చేవి. జనవరి 1, 2023 నుంచి, 10X రివార్డ్ పాయింట్లకు బదులుగా 5X రివార్డ్ పాయింట్లు మాత్రమే మీ అకౌంట్‌లో జమ అవుతాయి.
అయితే... అపోలో 24X7 (Apollo 24X7), బుక్ మై షో (BookMyShow), క్లియర్ ట్రిప్ (Cleartrip), ఈజీ డైనర్ (Eazydiner), లెన్స్‌కార్ట్ (Lenskart), నెడ్‌మెట్ (Netmeds) సైట్లలో Simply CLICK లేదా Simply CLICK Advantage SBI కార్డ్‌తో చేసిన వ్యయం మీద ఇచ్చే రివార్డ్ పాయింట్లను మార్చలేదు. గతంలో ఇచ్చిన 10X రివార్డ్ పాయింట్లనే ఇక పైనా అందిస్తారు.
ఈ కార్డ్‌తో ప్రయోజనాలు
Simply CLICK లేదా Simply CLICK Advantage SBI కార్డ్ ద్వారా ఒక సంవత్సరంలో చేసిన 1 లక్ష లేదా 2 లక్షల రూపాయలను వ్యయం మీద రూ. 2000 వరకు విలువైన క్లియర్ ట్రిప్ ఈ-ఓచర్లు ఖాతాదారుకి అందుతాయి. ఈ కార్డ్ పునరుద్ధరణ రుసుము (Renewal Fee) ఏడాదికి 499 రూపాయలు. మీరు ఒక ఏడాదిలో ఈ కార్డ్ ద్వారా ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తే, ఆ రెన్యూవల్ ఫీజు తిరిగి మీకు అందుతుంది.