OPEC: భారత్ నెత్తిన చమురు బాంబ్ - ఉత్పత్తిలో భారీ కోత పెడుతున్న ఒపెక్+
చమురు ధర కోలుకున్నా ఒపెక్ దేశాలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది.
OPEC+ Producers: ముడి చమురు ఉత్పత్తి & ఎగుమతి దేశాలు భారీ బాంబ్ పేల్చాయి. సౌదీ అరేబియా సహా ఒపెక్ ప్లస్ (OPEC +) దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో రోజుకు 11.6 లక్షల బ్యారెళ్ల తగ్గింపును ప్రకటించి అంతర్జాతీయ సమాజానికి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న భారత్ సహా అన్ని అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలకు ఇది గట్టి శరాఘాతంగా చెప్పుకోవాలి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం మరింత బలపడుతుంది, ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనపడుతుంది.
OPEC+ కూటమిలో కీలక దేశాలైన సౌదీ అరేబియా, రష్యా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది మే నుంచి డిసెంబరు చివరి వరకు, రోజువారీ ముడి చమురు ఉత్పత్తిని 5 లక్షల బ్యారెళ్ల (bpd) మేర తగ్గిస్తామని సౌదీ అరేబియా ఆదివారం (02 ఏప్రిల్ 2023) నాడు ప్రకటించింది. 2023 చివరి వరకు, రోజుకు 2 మిలియన్ (20 లక్షలు) బ్యారెళ్ల కోతను ఒపెక్ దేశాలు గత అక్టోబర్ నుంచే అమలు చేస్తున్నాయి. ప్రస్తుత కోతలు దీనికి అదనంగా జత కలవనున్నాయి.
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం వల్ల చమురు డిమాండ్ తగ్గుతుందన్న ఆందోళనతో, ముడి చమురు ధరలు గత నెలలో బ్యారెల్‌కు 70 డాలర్లకు పడిపోయాయి, 15 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. అయితే, బ్యాంకింగ్ సంక్షోభం సద్దుమణిగి బ్యారెల్ ముడి చమురు ధర మళ్లీ 70 డాలర్లకు చేరుకుంది. చమురు ధర కోలుకున్నా ఒపెక్ దేశాలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. ఎవరూ ఊహించని నిర్ణయం ఇది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇటీవలి కాలంలో అత్యంత అస్థిరంగా కదులుతున్నాయి. ధరలను శాంతిపజేసి, స్థిరంగా ఉంచేందుకు ముడి చమురు ఉత్పత్తి దేశాలు సప్లైని తగ్గిస్తున్నాయి. సరఫరాను తగ్గిస్తే ధరలు పెరిగి ఒక స్థాయిలో స్థిరపడతాయన్నది ఓపెక్ ప్లస్ అంచనా.
చమురు ధరలు జంప్
OPEC+ చేసిన ఆశ్చర్యకర ప్రకటనతో, అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ (సోమవారం, 03 ఏప్రిల్ 2023) ప్రారంభంలోనే ముడి చమురు ధరలు విజృంభించాయి, ఒక్కో బ్యారెల్ దాదాపు 5 డాలర్ల మేర జంప్ చేశాయి.
ఆదివారం నాటి నిర్ణయంతో, రష్యా సహా ఇతర చమురు దేశాల మొత్తం కోతలు రోజుకు 3.66 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి, మొత్తం ప్రపంచ డిమాండ్‌లో ఇది 3.7% కు సమానం.
ఇప్పటికే రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోతను అమెరికా వ్యతిరేకిస్తుండగా, తాజా నిర్ణయంతో అగ్రరాజ్యం రగిలిపోతోంది. సప్లై తగ్గితే చమురు ధరలు పెరిగి రష్యాకు బాగా లాభాలు వస్తాయన్నది ఆ దేశ బాధ. వాస్తవానికి, ఉత్పత్తిని పెంచి ముడి చమురు రేట్లను తగ్గించేలా చేయడానికి అగ్రరాజ్యం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దీనికి వ్యతిరేకంగా నిర్ణయాలు రావడంతో కడుపు మంటతో కస్సుబుస్సులాడుతోంది.
ఇప్పటికే 5,00,000 bpd తగ్గించిన రష్యా
ఆదివారం నాటి ప్రకటన ప్రకారం, ఈ ఏడాది మే నెల నుంచి రోజువారీ ఉత్పత్తిలో కోతలు ప్రారంభమవుతాయి. సౌదీ అరేబియా కూడా 5,00,000 bpd, ఇరాక్ 2,11,000 bpd ఉత్పత్తిని తగ్గించుకుంటాయి. UAE 1,44,000 bpd, కువైట్ 1,28,000 bpd, ఒమన్ 40,000 bpd, అల్జీరియా 48,000 bpd, కజకిస్తాన్ 78,000 bpd, గాబన్ 8,000 bpd ఉత్పత్తి తగ్గింపును ప్రకటించాయి.
2023 చివరి వరకు 5,00,000 bpd కోతను కొనసాగిస్తామని రష్యా ప్రకటించింది. పాశ్చాత్య దేశాలు విధించిన చమురు ధరల పరిమితులకు వ్యతిరేకంగా, ఫిబ్రవరిలోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రష్యా ఏకపక్ష నిర్ణయం వల్ల OPEC సభ్యులతో దాని స్నేహం బలహీనపడుతుందని అప్పట్లో U.S. అధికారులు చంకలు గుద్దుకున్నారు. అయితే, ఆదివారం నాటి నిర్ణయంతో, రష్యా చెలిమి ఇప్పటికీ బలంగా ఉందని నిరూపితమైంది.