Russia Ukraine Conflict: 100కే భయపడ్డాం - అతి త్వరలోనే లీటర్ పెట్రోల్ ధర రూ.150 అవుతోందా?
Petrol Price - Diesel Price: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాలోనూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరగనున్నాయి. మరికొన్ని రోజుల్లో పెట్రోలు ధరలు రూ.150కి చేరుకుంటాయేమోనని ప్రజలు భయపడుతున్నారు.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine Conflict) ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది! ఐరోపా, ఆసియా దేశాలకు ముడి చమరులు, సహజ వాయువును ఎక్కువగా రష్యానే ఎగుమతి చేస్తుంటుంది. ఆంక్షలు, సరఫరా లోపం వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. ఇండియాలోనూ ఇది పెట్రోలు, డీజిల్ ధరల (Petrol Price - Diesel Price) పెరుగుదలకు ఊతమిస్తోంది. మరికొన్ని రోజుల్లో పెట్రోలు ధరలు రూ.150కి చేరుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బ్యారెల్ క్రూడ్ ధర 120 డాలర్లకు
ముడి చమురు సరఫరాపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దాంతో నెల రోజుల క్రితం 75 డాలర్లుగా ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఇప్పుడు 105 డాలర్లకు పెరిగింది. గురువారం సైనిక చర్యకు దిగుతున్నామని పుతిన్ ప్రకటించగానే ముడి చమురు ధర 103 డాలర్లకు చేరుకుంది. ఏడేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి పెరుగుదల. యుద్ధం మరీ తీవ్రమైన రష్యాపై ఆంక్షలు మరింతగా విధిస్తారని విశ్లేషకులు అంటున్నారు. దాంతో సరఫరా, గిరాకీ మధ్య సమతుల్యం దెబ్బతినడంతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
పెరగనున్న Petrol ధరలు
ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు ధరలు రాష్ట్రాలను బట్టి మారుతున్నాయి. దీపావళి సమయంలో కేంద్ర ప్రభుత్వం సర్‌ఛార్జీలు, కొన్ని పన్నులు తగ్గించడంతో లీటరుకు రూ.8-10 వరకు ధర తగ్గింది. దాంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు రూ.90-95లోపే ఉన్నాయి. కాంగ్రెస్, స్థానిక పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ధరలు తగ్గించకపోవడంతో లీటరు పెట్రోలు రూ.108 వరకు ఉంటోంది. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం బ్యారెల్‌కు 75 డాలర్లు ఉన్నప్పటి ధరలకే పెట్రోల్ విక్రయిస్తున్నాయి. ఇప్పుడది 105 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది సగటున బ్యారెల్‌కు 110 డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. మరి 75 డాలర్లప్పుడే రూ.100కు పెట్రోల్ విక్రయించగా లేనిది 120 డాలర్లకు చేరితే కచ్చితంగా రూ.150కి పెరిగే అవకాశం లేకపోలేదు.
సుంకాలు తగ్గిస్తేనే
దాదాపుగా ఇప్పుడు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్, దిగుమతి సుంకం, సర్‌ఛార్జీ, కస్టమ్స్ వంటి పన్నులే అధిక శాతం ఉంటున్నాయి. ఇప్పుడు ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరతో అనుసంధానం అయ్యాయి. దానివల్ల ఆయిల్ కంపెనీలు ఇప్పుడు నష్టాలకే పెట్రోలును విక్రయిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ధరలు పెంచక తప్పదు. అలాంటప్పుడు రూ.120కి మించి పెట్రోలును విక్రయిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చే అవకాశం ఉంది. అందుకే సర్‌ఛార్జీలు, కస్టమ్స్ పన్నులను తగ్గించి ప్రభుత్వాలు ఈ భారం పడకుండా చూస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతోందో చూడాలి.