Retail Inflation: వడ్డీ రేట్ల వాత తప్పేలా లేదు, ఈసారి ఎంత బాదొచ్చంటే?
ఆగస్టులోని నంబర్‌ను చూస్తే, సామరస్య విధానం మీద నిలబడడం కష్టంగానే కనిపిస్తోంది.
Retail Inflation: ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) మళ్లీ చెలరేగి 7 శాతానికి చేరింది. గత మూడు వరుస నెలల్లో (మే, జూన్, జులై) 7 శాతం కంటే తక్కువగా నమోదైన ద్రవ్యోల్బణం ఆగస్టులో జూలు విదిలించింది. జులై నంబర్ 6.71 శాతం నుంచి ఇది పెరిగింది. ప్రధానంగా ఆహార ధరల్లో పెరుగుదల కారణంగా ఈ జంప్ కనిపించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కంఫర్ట్ లెవెల్ 2-6 శాతం కంటే ఎక్కువగా ఈ ఏడాది జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతోంది. ఇలా, 6 శాతం కంటే ఎక్కువగా ఉండటం (ఆగస్టుతో కలిపి) వరుసగా ఇది 8వ నెల.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలు దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్తుంటే, ఆ పంథాకి దూరంగా ఉండాలని భారత్ భావించింది, ఇప్పటివరకు అలాగే ఉంది. కానీ, ఆగస్టులోని నంబర్‌ను చూస్తే, సామరస్య విధానం మీద నిలబడడం కష్టంగానే కనిపిస్తోంది.
యూరప్ దేశాల్లో ఇన్‌ఫ్లేషన్ ఇంకా పెరుగుతుందన్న అంచనాలతో, గత వారంలో, యూరో జోన్ సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు (Bps) పెంచింది.
అగ్రరాజ్యంలో అంచనాలకు మించి..
అమెరికాలో, ఆగస్టు నెల ఇన్‌ఫ్లేషన్ డేటా మంగళవారం బయటికొచ్చింది. అగ్రరాజ్యంలోనూ ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే ఉంది. 8.1 శాతాన్ని మార్కెట్ అంచనా వేస్తే, 8.3 శాతంగా ద్రవ్యోల్బణం తేలింది. ఫలితంగా US ట్రెజరీ బెంచ్‌మార్క్ ఈల్డ్స్ మరో 6 bps పెరిగి, 3.42 శాతానికి చేరింది.
ఈ నెల చివరి వారంలో యూఎస్ ఫెడ్ సమావేశం ఉంది. అంచనాలకు మించిన ద్రవ్యోల్బణం కారణంగా, ఆ దేశం వడ్డీ రేటును 75 Bps పెంచుతుందన్న అంచనాలున్నాయి.
50 Bps వరకు పెంపు
మన దేశానికి తిరిగి వస్తే... మే-జులై వరకు ఉన్న ప్రశాంత చిత్రాన్ని ఆగస్ట్ నెల మార్చింది కాబట్టి, ఇప్పుడు RBI తీసుకునే స్టెప్ మీద ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖరులో రెపో రేటులో మరో సగం శాతం లేదా 50 Bps పెంపు ఉంటుందని మార్కెట్ భావిస్తోంది. 2023 ప్రారంభం వరకు ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగుతుందని RBI అంచనాలు కూడా చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం కూడా 50 Bps పెంపును ఆశించవచ్చు.
ఈ నెల 30న, RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం ఉంది. వడ్డీ రేట్లను పెంచాలా, ఎన్ని Bps పెంచాలి, లేక యథాతథంగా కొనసాగించాలా అన్న విషయం మీద ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.
రీసెర్చ్ హౌస్ నోమురా ఇండియా వేసిన లెక్క ప్రకారం.. 35 - 50 bps మధ్య వడ్డీ రేట్లను పెంచుతూ సెప్టెంబర్ MPC నిర్ణయం తీసుకోవచ్చు.
2019 తర్వాత, ఈ ఏడాది మొదటిసారిగా రేట్లను టైట్ చేసిన RBI, మే 5న రెపో రేటును 40 bps పెంచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దఫదఫాలుగా బెంచ్‌మార్క్ గేజ్‌ను 140 bps పెంచింది. దీంతో ఇది 5.40 శాతానికి చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.