Jio 5G in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జియో 5G సర్వీసులు ప్రారంభం, ముందే వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్
ఆంధ్రప్రదేశ్‌లో 5G సేవలు అందించేందుకు, రద్దీ ఎక్కువగా ఉన్న నగరాలను రిలయన్స్ జియో తొలుత ఎంచుకుంది.
Jio 5G in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రిలయన్స్ జియో (Reliance Jio) వినియోదారులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫిఫ్త్ జెనరేషన్ (5G) నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, తన 5G సేవలను ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 5G సేవలు అందించేందుకు, రద్దీ ఎక్కువగా ఉన్న నగరాలను రిలయన్స్ జియో తొలుత ఎంచుకుంది. కలియుగ వైకుంఠం తిరుమల, సాగర నగరం విశాఖపట్నం, జంట నగరాలు విజయవాడ & గుంటూరులో మొదట సేవలు ప్రారంభించింది.
సోమవారం నుంచి 5G సర్వీస్‌లు
సోమవారం (డిసెంబర్ 26, 2022) నుంచి 5G సర్వీస్‌లు మొదలయ్యాయి. ఈ నాలుగు నగరాల్లోని జియో వినియోగదారులకు జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio 5G Welcome Offer) కోసం ఆహ్వానం అందుతుందని ఈ టెలికాం కంపెనీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో Jio 5G ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ IT మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. S. జవహర్ రెడ్డి, ప్రభుత్వ సీనియర్ అధికారులు, జియో అధికారులు పాల్గొన్నారు. జియో కమ్యూనిటీ క్లినిక్ కిట్ ద్వారా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ రంగంలో అందే ప్రయోజనాలను, AR-VR డివైస్, జియో గ్లాస్‌ను ఈ సందర్భంగా టెల్కో ప్రదర్శించింది.
ఇప్పటికే ఉన్న ₹ 26,000 కోట్ల పెట్టుబడితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో 5G నెట్‌వర్క్‌ను అమలు చేయడానికి జియో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది మన రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆ కంపెనీకి ఉన్న అపారమైన నిబద్ధతకు నిదర్శనం అని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు.
అదనపు ఖర్చు లేకుండా 5G సర్వీసులు
డిసెంబర్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, మండలం, గ్రామంలో జియో ట్రూ 5G (JioTrue 5G) సేవలు అందుబాటులోకి వస్తాయి. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలోనే Jio True 5G నెట్‌వర్క్‌ను రాష్ట్రంలోని అన్ని మూలలకు విస్తరిస్తామని జియో ప్రతినిధి వెల్లడించారు.
Jio True 5G సేవలు ఎంపిక చేసిన వినియోగదారులకు అందుతాయి. ఇందుకోసం ఒక్క రూపాయిని కూడా అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, 5G సేవలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల 4G టారిఫ్ ప్లాన్/ ప్యాకేజీ 5Gకి అప్‌గ్రేడ్ అయింది. అప్‌గ్రేడ్ అయిన అన్ని 5G ప్లాన్‌ల ద్వారా అపరిమిత డేటా వినియోగించుకోవచ్చు.
జియో వెల్‌కమ్ ఆఫర్ ఎలా అందుతుంది?
5G సేవలు అందుకోవడానికి 5G సిమ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం మీరు వాడుతున్న జియో 4G సిమ్ ద్వారానే 5G సేవలను వినియోగించుకోవచ్చు. మీ ఫోన్‌లో మైజియో (MyJio) యాప్ ఉంటే, ఆ యాప్ ద్వారా వెల్‌కమ్ ఆఫర్ కోసం ఆహ్వానం మీకు అందుతుంది.
జియో వెల్‌కమ్ ఆఫర్ పొందడానికి అర్హతలు
5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ మీ దగ్గర ఉండాలి
జియో 5G నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతంలో ఉండాలి
ప్రి-పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ వినియోగదారులు తప్పనిసరిగా రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్లాన్‌లను రీచార్జ్ చేసుకుని ఉండాలి