RBI: వడ్డీ రేట్లపై కొన్ని గంటల్లో ప్రకటన - జనం ఆశలపై నీళ్లు చల్లిన ఒపెక్!
అకాల వర్షాలతో పాటు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని OPEC దేశాలు అనూహ్యంగా నిర్ణయించడంతో అంచనాలు మారిపోయాయి.
RBI MPC Meeting: మూడు రోజుల పాటు సాగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దవ్య విధాన కమిటీ (RBI MPC) సమావేశ ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలుపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్రవ్య విధానాన్ని ఇవాళ (గురువారం, 06 ఏప్రిల్ 2023) ప్రకటించబోతున్నారు.
స్టాక్ మార్కెట్ నిపుణుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరి దృష్టి గవర్నర్ ప్రకటించనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశ ఫలితాలపైనే ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితి, దేశ GDP గణాంకాలు క్షీణించడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వడ్డీ రేట్లను మరింత పెంచే నిర్ణయం RBI తీసుకోదని అంతా భావించారు. కానీ.. మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలతో పాటు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని OPEC దేశాలు అనూహ్యంగా నిర్ణయించడంతో అంచనాలు మారిపోయాయి. ఇవాళ, రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం లేదా 0.25%) పెంచే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఏడు ద్రవ్య విధాన సమావేశాల్లో ఆరింటిలో రెపో రేటును పెంచాలని RBI నిర్ణయించింది. మొత్తంగా కలిపి రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24లో కూడా మరోసారి రెపో రేటు పెంచే అవకాశం కనిపిస్తోంది. 2023 ఫిబ్రవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.44 శాతంగా ఉంది, RBI టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే ఇది ఎక్కువ. అంతకుముందు జనవరి నెలలో కూడా 6 శాతం కంటే ఎక్కువే ద్రవ్యోల్బణం రేటు నమోదైంది. ఇన్‌ఫ్లేషన్‌ను తగ్గించడానికి వడ్డీ రేట్లను ఆర్‌బీఐ నిరంతరం పెంచుతోంది. అయితే, ఆ భారాన్ని ఖరీదైన రుణాల రూపంలో ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తోంది. గతంలో, బ్యాంకుల నుంచి చౌకగా తీసుకున్న గృహ రుణాలు సహా చాలా రకాల లోన్లపై EMIలు ఇప్పుడు చాలా ఖరీదుగా మారాయి. ఇకపైనా రుణాలు మరింత ఖరీదుగా మారితే, EMIలు కట్టే వాళ్ల కష్టాలు మరింత పెరుగుతాయి.
అకాల వర్షాలు - ఒపెక్+ నిర్ణయం
ఖరీదైన రుణాల ప్రభావం ఆటోమొబైల్ రంగం నుంచి రియల్ ఎస్టేట్ రంగం వరకు కనిపిస్తోంది. ఈ రెండు రంగాల వృద్ధి వేగం తగ్గింది. కానీ ద్రవ్యోల్బణాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రెపో రేటును RBI పెంచుతోంది. అకాల వర్షాల కారణంగా రబీ పంటలైన గోధుమలు, ఆవాలు సహా చాలా పంట దిగుబడులు దెబ్బతిన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార పదార్థాల ధరలు తగ్గే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. ముడి చమురును ఉత్పత్తి చేసే ఒపెక్ ప్లస్ దేశాలు, తమ ఉత్పత్తిని మే నెల నుంచి తగ్గించాలని నిర్ణయించాయి. ఈ కారణంగా ముడి చమురు ధరలు ఇంకా పెరగవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న RBI అంచనాలు ఈ కారణాల వల్ల తలకిందులయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఇవాళ్టి ద్రవ్య విధాన ప్రకటనలో, 2023-24లో ద్రవ్యోల్బణ రేటు గణాంకాల లక్ష్యంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలను కూడా RBI పరిగణనలోకి తీసుకుంటుంది.