Raj Kundra - Shilpa Shetty Fined: శిల్పాశెట్టి దంపతులకు మరో షాక్.. చిక్కుల్లో బాలీవుడ్ నటి దంపతులు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు సెబీ షాక్ ఇచ్చింది. వారు గతంలో సెబీ చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తమ విచారణలో తేలినట్లుగా గుర్తించింది.
పోర్నోగ్రఫీ ఆరోపణలతో ఇప్పటికే సతమతం అవుతున్న రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పా శెట్టికి సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) జరిమానా విధించింది. సెబీలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై సెబీ వారిపై ఈ చర్యలు తీసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా అలియాస్ రిపు సుదాన్ కుంద్రా, ఆయన భార్య, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సహా వారి కంపెనీ వివాన్ ఇండస్ట్రీస్ (హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)కు సెబీ ఈ జరిమానా పడింది.
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై సెబీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టికి చెందిన వివాన్ ఇండస్ట్రీస్ కంపెనీ దాదాపు మూడేళ్ల పాటు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తమ లావాదేవీలకు సంబంధించిన నివేదికను సమర్పించలేదు. ఈ కారణంతో వివాన్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లుగా ఉన్న రాజ్ కుంద్రా సహా ఆయన భార్య శిల్పాశెట్టికి సెబీ ఈ జరిమానా విధించింది.
మూడేళ్లుగా వివరాలు ఇవ్వకుండానే..
2013 సెప్టెంబరు నుంచి 2015 డిసెంబరు మధ్య కాలంలో వివాన్ ఇండస్ట్రీస్ (హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) స్టాక్ మార్కెట్‌లో జరిపిన ట్రేడింగ్, డీలింగ్స్‌పై సెక్యురిటీస్ ఆఫ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా రాజ్ కుంద్రా అలియాస్ సుదాన్ కుంద్రా, శిల్పా శెట్టి కుంద్రా, వివాన్ ఇండస్ట్రీస్.. సెబీ చట్టంలోని నిబంధనలు 7(2)(ఏ), 7(2)(బి) ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది.
వివాన్ ఇండస్ట్రీస్ తన కంపెనీకి చెందిన 5 లక్షల ఈక్వీటీ షేర్లను నలుగురు వ్యక్తులకు కేటాయించినట్లుగా 2015లో ప్రకటించింది. కానీ, ఆ ఈక్విటీ షేర్లను తన ప్రమోటర్లైన రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇద్దరికి మాత్రమే కేటాయించినట్లుగా సెబీ గుర్తించింది. సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ రూల్స్ 2015 చట్టంలోని 7(2)(ఎ) నిబంధన ప్రకారం.. ఏదైనా కంపెనీ తన షేర్లను కేటాయించిన వివరాలను రెండు ట్రేడింగ్ రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ షేర్ల విలువ రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకే వర్తిస్తుంది. అయితే, రాజ్ కుంద్రా, శిల్పా శెట్టికి కేటాయించిన షేర్ల విలువ ఒక్కొక్కరికి రూ.2.57 కోట్ల వరకూ ఉంది. అయితే, దీనికి సంబంధించిన ప్రకటనను వారు నిర్ణీత గడువులోపు చేయలేదు. 2015 నాటి ఈ లావాదేవీకి సంబంధించిన ప్రకటనను వారు 2019లో చేశారని సెబీ వివరించింది. అందుకే వారిపై పెనాల్టీ విధించినట్లుగా సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: Raj Kundra Case: ''బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారు''