Post Office Savings Account: పోస్టాఫీస్ ప్రీమియం ఖాతాతో క్యాష్‌బ్యాక్ సహా చాలా ప్రయోజనాలు
పోస్ట్ ఆఫీస్ సేవలను మరింత మెరుగుపరచడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ప్రీమియం సర్వీసును ప్రారంభించింది.
Post Office Premium Savings Account: చిన్న మొత్తాల (Small Savings) పెట్టుబడిదారుల కోసం ఇండియా పోస్ట్ ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. పోస్టాఫీస్ బ్యాంక్ ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఈసారి అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు... ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (India Post Payments Bank -IPPB) అందిస్తున్న ఆఫర్స్ ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఈ రోజుల్లో, మార్కెట్‌లో అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. పోస్ట్ ఆఫీసు స్కీమ్‌లకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది చందాదారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, పోస్ట్ ఆఫీస్ సేవలను మరింత మెరుగుపరచడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ప్రీమియం సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీస్ కింద... పోస్ట్ ఆఫీస్ ప్రీమియం సేవింగ్స్ ఖాతాను (Post Office Premium Saving Account) కస్టమర్లు తెరవవచ్చు. ఈ ప్రీమియం ఖాతా ద్వారా.. అనేక సేవలు, ప్రయోజనాలను మీరు పొందవచ్చు.
ప్రీమియం సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలు
పోస్ట్ ఆఫీస్ ప్రీమియం సేవింగ్స్ ఖాతా ద్వారా రుణ సదుపాయాన్ని మీరు పొందవచ్చు. ఈ ప్రీమియం ఖాతాదారుడు, డోర్ స్టెప్ బ్యాంకింగ్ (Door Step Banking) ద్వారా రుణ సదుపాయాన్ని పొందే వీలుంది. అంటే, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సిబ్బంది మీ ఇంటి దగ్గరకే వచ్చి రుణం మంజూరు చేస్తారు. మీరు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో పాటు, ఈ ఖాతా ద్వారా మీరు ఏదైనా బిల్లును చెల్లిస్తే, మీకు క్యాష్ బ్యాక్ ప్రయోజనం కూడా ఉంటుంది. నిర్దిష్ట నగదు మొత్తం తిరిగి మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ ఖాతాతో వర్చువల్ డెబిట్ కార్డ్ (Virtual Debit Card) సదుపాయాన్ని కూడా పొందుతారు. ఈ ఖాతాలో కనీస నగదు నిల్వ (Zero cash balance) పరిమితి లేదు. ఖాతాదారుడు తనకు కావాల్సినంత డబ్బును డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం ఈ ఖాతా ప్రత్యేకత.
ఇతర ప్రయోజనాలు ఏంటి?
పోస్ట్ ఆఫీస్ ప్రీమియం అకౌంట్ ద్వారా పింఛనుదార్లు (Pensioners) డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించే సౌకర్యం కూడా పొందుతారు. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా చేసే వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఖాతా ప్రత్యేకంగా రూపొందించారు. ఒక పోస్టాఫీసు ఖాతా నుంచి మరొక పోస్టాఫీసు ఖాతాకు డబ్బు పంపడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పోస్ట్ ఆఫీస్ ప్రీమియం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
IPPB ప్రీమియం సేవింగ్స్ ఖాతాను తెరవడానికి మీరు మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లాలి. పోస్ట్‌మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవక్ ద్వారా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. ప్రీమియం ఖాతా నిర్వహణ కోసం వార్షిక రుసుము రూపంలో రూ. 99 చెల్లించాలి. అదే సమయంలో, మొదటిసారి ఈ ఖాతాను తెరిచినప్పుడు, 149 రూపాయలు + GST విడివిడిగా పోస్టాఫీస్ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.