Paytm Buyback: పేటీఎం బైబ్యాక్‌లో పెద్ద చిక్కు, ఆ ఆప్షన్ లేదంటున్న ఎక్స్‌పర్ట్స్
షేర్ల బై బ్యాక్ ప్రపోజల్ మీద నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 13న (మంగళవారం, డిసెంబర్ 13 2022) సమావేశం అవుతోంది.
Paytm Buyback: మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో. అసలే షేర్ల ధరలు పతనమై, కంపెనీ విలువ పడిపోతూ పేటీఎం అల్లాడుతుంటే, ఇప్పుడు కొత్తగా మరో చిక్కు వచ్చి పడింది.
పడిపోతున్న షేరు ధరను నిలబెట్టడానికి, ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి షేర్ల బై బ్యాక్ (తన షేర్లను మార్కెట్ నుంచి తానే తిరిగి కొనుక్కోవడం) ప్రతిపాదనను ఈ కంపెనీ మార్కెట్ ముందుకు తెచ్చింది. షేర్ల బై బ్యాక్ ప్రపోజల్ మీద నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (One 97 Communications Ltd) డైరెక్టర్ల బోర్డు ఈ నెల 13న (మంగళవారం, డిసెంబర్ 13 2022) సమావేశం అవుతోంది.
అయితే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా కూడా గట్టిన డబ్బు ఇంకా కంపెనీ చేతిలో ఉంది. ఇదికాక, Paytm తాజా ఆదాయ నివేదిక ప్రకారం రూ. 9,182 కోట్ల లిక్విడిటీ కంపెనీ దగ్గర ఉంది. ఇందుకోసం ఐపీవో ద్వారా వచ్చిన డబ్బును బై బ్యాక్ కోసం కంపెనీ ఉపయోగించుకుంటుందన్న వార్తలు బయటకు వచ్చాయి. అయితే, షేర్ల బై బ్యాక్ కోసం IPO ఫండ్స్‌ను వాడడానికి వీల్లేదన్నది ఎక్స్‌పర్ట్స్ మాట. ఏ కంపెనీ అయినా IPO ద్వారా వచ్చిన మొత్తాన్ని షేర్ బై బ్యాక్ కోసం ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. అంతేకాదు, బై బ్యాక్ కోసం సైడ్ డీల్స్ లేదా నెగోషియేడెడ్ డీల్స్ మీద కూడా చట్టంలో నిషేధం ఉంది.
అంటే, IPO డబ్బుతో షేర్ల బై బ్యాక్ చేసే ఛాన్స్ ఇప్పుడు పేటీఎంకు లేదు. చేతిలో ఉన్న నిధులను (లిక్విడిటీ) మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
మొదట్నుంచీ క్షీణతే..
గత ఏడాది నవంబర్‌లో IPOకి వచ్చిన ఈ కంపెనీ, రూ. 18,300 కోట్లు సమీకరించింది. అదే నెలలో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో షేర్లు లిస్ట్ అయ్యాయి. ఆ సమయంలో చోటు చేసుకున్న గ్లోబల్ టెక్ విక్రయాల దెబ్బకు ఈ స్టాక్ విలవిల్లాడింది. టెక్ కంపెనీల మీద ఇన్వెష్టర్లకు నమ్మకం లేని కారణంగా, 2022లో ఈ స్టాక్ 60 శాతం క్షీణించింది. దీంతోపాటు సంస్థ లాభదాయకత, పోటీ, మార్కెటింగ్, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్స్ మీద చాలా సందేహాలు తలెత్తాయి.
BSEలో శుక్రవారం ఈ స్టాక్ ముగింపు ధర రూ. 545. ఐపీవో ఇష్యూ ప్రైస్ రూ. 2,150 కంటే ఇది చాలా తక్కువలో ట్రేడ్ అవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.