Indian Billionaires: 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు కోల్పోయిన అదానీ- అంబానీకి డేంజర్ బెల్స్
Mukesh Ambani - Gautam Adani: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ బిలియన్ల కొద్దీ నష్టపోతే, గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో సభ్యత్వాన్ని కోల్పోయారు.
Indian Stock Market: భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అత్యంత సంపన్నులు అనగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani), అదానీ గ్రూప్ (Adani Group) అధిపతి గౌతమ్ అదానీ (Gautam Adani) ముందుగా గుర్తొస్తారు. ఇండియాలో నంబర్ 1 సంపన్నుడు ముకేష్ అంబానీ కాగా, నంబర్ 2 ధనవంతుడు గౌతమ్ అదానీ. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇటీవలి పతనం కారణంగా, ఈ ఇద్దరు భారతదేశ బిలియనీర్ల సంపద భారీ మొత్తంలో ఆవిరైంది.
షేర్ మార్కెట్లలో నష్టాల వల్ల, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద విలువ (Mukesh Ambani Net Worth) 162 బిలియన్ డాలర్ల నుంచి 105 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇంత భారీ మొత్తంలో సొమ్మును కోల్పోయినప్పటికీ, ముకేష్ అంబానీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 14వ స్థానంలో ఉన్నారు. అదే సమయంలో, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ నికర విలువ (Gautam Adani Net Worth) 94.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 18వ స్థానానికి పడిపోయారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ఫ్రెష్ రిపోర్ట్ ప్రకారం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నికర విలువ (Elon Musk Net Worth) 256 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు. 206 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg Net Worth) రెండో స్థానంలో ఉన్నారు.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) డేటా ప్రకారం, భారతీయ స్టాక్ మార్కెట్ గత వారం పెట్టుబడిదార్లకు దారుణమైన అనుభవాలు, నష్టాలను చూపించింది. BSE మొయిన్ ఇండెక్స్ అయిన సెన్సెక్స్ (Sensex) ఏకంగా 4,000 పాయింట్లు పతనమైంది. దీనివల్ల, ఆ ఇండెక్స్‌లోని కంపెనీల పెట్టుబడిదార్లు 17,000 కోట్ల రూపాయలు కోల్పోయారు. ఈ తగ్గుదల నంబర్ 1, నంబర్ 2 భారతీయ బిలియనీర్‌లపైనా ప్రభావం చూపింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఛైర్మన్ ముకేష్ అంబానీ రూ. 134,44,85,60,000 (13,444 కోట్ల రూపాయలకు పైగా) నష్టాన్ని చవిచూడగా, గౌతం అదానీ ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 7915,65,89,700 (7,915 కోట్ల రూపాయలకు పైగా) నష్టపోయారు.
ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం పెరగడంతో పాటు, చైనా ఆర్థిక వ్యవస్థలో సడలింపు & ఉద్దీపన ప్యాకేజీ విధానాల వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIs) చైనా మార్కెట్ల వైపు చూస్తున్నారు. భారతదేశ మార్కెట్లలో వేల కోట్ల విలువైన షేర్లు అమ్మేసి, ఆ డబ్బును డ్రాగన్ కంట్రీకి మళ్లిస్తున్నారని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఇండియన్ ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేయడం వంటి కారణాలతో భారతీయ మార్కెట్లలో అమ్మకాలు మరికొన్నాళ్లు కొనసాగే సూచనలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో భారతీయ మార్కెట్లు చాలా అస్థిరంగా కదలొచ్చని అంటున్నారు. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
ఈ రోజు (మంగళవారం, 08 అక్టోబర్ 2024), ఉదయం 11.25 గంటల సమయానికి BSE సెన్సెక్స్ 494.89 పాయింట్లు లేదా 0.61% పెరిగి 81,544.89 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 176.55 పాయింట్లు లేదా 0.71% పెరిగి 24,972.30 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారా? ఐసీయూలో చికిత్స పొందుతున్నారా?