FedEx New CEO: మరో అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా ఇండో అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం
FedEx New CEO Raj Subramaniam: ఫెడెక్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం నియమితులయ్యారు.
FedEx New CEO: మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతికి చెందిన అమెరికన్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్ సుబ్రమణ్యం ఫెడెక్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer of FedEx)గా నియమితులయ్యారు. అమెరికాకు చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ ఫెడెక్స్ కొత్త సీఈఓగా రాజ్ సుబ్రమణ్యం బాధ్యతలు చేపట్టనున్నారని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ వ్యవస్థాపకులతో ఒకరైన ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1, 2022న పదవీ విరమణ చేయనుండగా.. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన అమెరికన్‌కు పగ్గాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్ సుబ్రమణ్యంపై నమ్మకం ఉంది..
‘కంపెనీకి మరో స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి రాజ్ సుబ్రమణ్యం అని నేనే నమ్ముతున్నాను. వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు నడిపే సామర్థ్యం ఆయనకు ఉంది. సుస్థిరత, ఆవిష్కరణ, పబ్లిక్ పాలసీలతో పాటు మరెన్నో అంశాలపై ఫోకస్ చేస్తారు. రాజ్ సుబ్రమణ్యం లాంటి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడం సంస్థకు మరిన్ని విజయాలు అందిస్తుందని’ నూతన సీఈఓగా నియమితులైన రాజ్ సుబ్రమణ్యం (FedEx Announces Raj Subramaniam As New CEO)పై ఫ్రెడరిక్ స్మిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
స్మిత్ స్థానాన్ని భర్తీ చేయడంపై హర్షం..
‘స్మిత్ 1971లో ఫెడెక్స్ సంస్థను స్థాపించారు. ఆయన దార్శనికత కలిగిన నాయకుడు, వ్యాపారవేత్త. ప్రపంచంలో ఎంతో గుర్తింపు కలిగిన సంస్థను ప్రారంభించిన దిగ్గజం ఫ్రెడరిక్ స్మిత్. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో కలిసొచ్చింది. ఇప్పుడు ఆయన స్థానంలో కీలక బాధ్యతలు చేపట్టనుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆయన మొదలుపెట్టిన కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతుగా శ్రమిస్తానని’ ఫెడెక్స్ ప్రస్తుత సీఈఓ, వ్యవస్థపకుడు ఫ్రెడరిక్ స్మిత్‌పై నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న భారతీయ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజ్ సుబ్రమణ్యం ప్రొఫైల్..
30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వ్యక్తి రాజ్ సుబ్రమణ్యం కేరళలోని తిరువనంతపురానికి చెందిన వారు. ఆయన ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. న్యూయార్క్ లోని సిరక్యూస్ వర్సిటీలో అదే విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏంబీఏ పట్టా పొందారు. 1991లో ఫెడెక్స్ లో చేరిన రాజ్ సుబ్రమణ్యం ఆసియా, అమెరికాలో పలు మార్కెటింగ్ సంస్థలలో మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ కెనడాలో ప్రెసిడెంట్‌గా చేశారు. సీఈఓగా నియమితులు అవకముందు ఫెడెక్స్ కార్పొరేషన్ సీఈఓగా సేవలు అందించారు. ప్రస్తుతం ఫెడెక్స్ కంపెనీలో 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫెడెక్స్ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా సైతం కీలక బాధ్యతలు నిర్వహించారు.
Also Read: IPL 2022: ఐపీఎల్ స్పెషల్ ఆఫర్! ఫ్రీగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లైవ్‌స్ట్రీమింగ్ ఇస్తున్న జియో!