LIC Adani Debt: అదానీ కంపెనీలకు ఎల్‌ఐసీ నుంచి వేల కోట్ల రుణాలు, తీర్చింది అతి స్వల్పం
2023 మార్చి 05 నాటికి ఈ రుణాలు స్వల్పంగా తగ్గాయి.
LIC Adani Debt: ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దగ్గర కోటానుకోట్ల నిధులు మూలుగుతుంటాయి. ఇందులో కొంత భాగాన్ని ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడుతుంది. అంటే, వివిధ కంపెనీల్లో షేర్లు కొంటుంది. మరికొంత భాగాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల కంపెనీలకు రుణాల రూపంలో ఇస్తుంది. ఇటు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి, అటు అప్పులపై వడ్డీల రూపంలో ఎల్‌ఐసీ రెండు చేతులా రాబడి ఆర్జిస్తోంది. అయితే, కొంతకాలంగా ఎల్‌ఐసీ వాటాలు, రుణ పోర్ట్‌ఫోలియోపై వివాదం నడుస్తోంది. ముఖ్యంగా, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు, కొన్ని కంపెనీలకు ఇచ్చిన రుణాలపై రగడ చెలరేగింది.
ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాచారం ఇదీ..
అదానీ కంపెనీలకు ఎల్‌ఐసీ ఇచ్చిన రుణాలపై, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, సోమవారం నాడు పార్లమెంటులో గణాంకాలను విడుదల చేశారు. ఒక ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వకంగా వివరాలు అందించారు. మార్చి 05 నాటికి అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసీ రుణాలు (LIC Debt Exposure) రూ. 6,182.64 కోట్లుగా ఉన్నట్లు ఆ లెక్కల్లో నిర్మల సీతారామన్ వెల్లడించారు. 31 డిసెంబర్ 2022 నాటికి ఉన్న రుణాలు రూ. 6,347.32 కోట్లతో పోలిస్తే, 2023 మార్చి 05 నాటికి ఈ రుణాలు స్వల్పంగా తగ్గాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సమాచారాన్ని తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
అదానీ గ్రూప్‌లోని ఏయే కంపెనీకి ఎంత ఎల్‌ఐసీ రుణం?
ఆర్థిక మంత్రి సమాధానం ప్రకారం... అదానీ గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు (Adani Ports and SEZ) అత్యధికంగా రూ. 5,388.60 కోట్ల రుణాన్ని ఎల్‌ఐసీ మంజూరు చేసింది. అదే విధంగా, అదానీ పవర్ (ముంద్ర) లిమిటెడ్‌కు రూ. 266 కోట్లు, అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ ఫేజ్-1 కు రూ. 81.60 కోట్లు, అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ ఫేజ్-3 కి రూ. 254.87 కోట్లు, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్‌కు రూ. 45 కోట్లు, రాయ్‌పుర్ ఎనర్జీ లిమిటెడ్‌కు 145.67 కోట్లు అప్పుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇచ్చింది.
అదానీ గ్రూప్ కంపెనీలకు ఐదు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ విధమైన రుణం ఇవ్వలేదని, తన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి తెలియజేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలకు సంబంధించి... ప్రాజెక్టుల లాభదాయకత & నగదు ప్రవాహ సామర్థ్యాన్ని అంచనా వేయడం, రిస్క్‌ను పరిగణనలోకి తీసుకోవడం, తగిన భద్రతను నిర్ధరించుకోవడం ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలియజేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రాజెక్టులపై వచ్చే ఆదాయం నుంచి రుణ వాయిదాలను ఆయా కంపెనీలు చెల్లిస్తాయి, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి కాదని వెల్లడించారు.
అదానీ గ్రూప్‌పై యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏ కమిటీని నియమించలేదని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభకు వెల్లడించారు.