SEBI: ట్రేడింగ్ ఆగిపోకుండా ఇన్వెస్టర్లను పెద్ద కష్టం నుంచి గట్టెక్కించిన సెబీ
2023 డిసెంబర్ 31 తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాలను యథావిధిగా ఆపరేట్ చేయగలరు.
SEBI Extended Last Date For Nominee Declaration: మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లకు మరోమారు ఉపశమనం లభించింది. సరైన టైమ్‌లో కీలక నిర్ణయం తీసుకున్న స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, ఇన్వెస్టర్ల అకౌంట్స్ నిలిచిపోకుండా చేసింది, వారిని పెద్ద కష్టం నుంచి బయటపడేసింది.
మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరును యాడ్ చేసే చివరి తేదీని (last date for nominee declaration in mutual funds, demat accounts) సెబీ మరోమారు పొడిగించింది. ఖాతాదార్లు, తమ నామినీని ప్రకటించడానికి ప్రస్తుతం ఉన్న గడువు 2023 డిసెంబర్ 31. తాజాగా, ఈ పనిని పూర్తి చేయడానికి ఖాతాదార్లకు మరో ఆరు నెలల సమయాన్ని సెబీ ఇచ్చింది.
కొత్త గడువు 2024 జూన్ 30
ఇప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరును యాడ్ చేయడానికి చివరి తేదీని 2024 జూన్ 30 వరకు సెబీ (SEBI) పొడిగించింది. పెట్టుబడిదార్లు ఈ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాలి లేదా నామినీని వెల్లడించకూడదనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. నామినేషన్ కోసం 2023 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చినా, ఇప్పటికీ భారీ సంఖ్యలో పెట్టుబడిదార్లు ఈ పని పూర్తి చేయలేదు. అందరికీ అవకాశం ఇవ్వడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ గడువును మరో 6 నెలలు వాయిదా వేసింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఈ నెల 27న ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని కింద, నామినీని ప్రకటించని వాళ్లు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
నామినేషన్ సమర్పణకు ఆఖరి తేదీని సెబీ పొడిగించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈ గడువు 2023 సెప్టెంబర్ 30గా ఉంది, దానిని డిసెంబర్ 31 వరకు ఎక్స్‌టెండ్ చేసింది.
సెప్టెంబర్ వరకు పెండింగ్‌లో 25 లక్షల నామినేషన్లు
రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌గా (RTA) వ్యవహరించే CAMS డేటా ప్రకారం... 2023 సెప్టెంబర్ 30 వరకు, సుమారు 25 లక్షల మంది పాన్ కార్డ్ (PAN card) హోల్డర్లు తమ నామినీలను అప్‌డేట్ చేయలేకపోయారు. 2023 డిసెంబర్ చివరి నాటికి ఉన్న డేటా ఇంకా అందలేదు.
నామినీని ప్రకటించే ప్రక్రియను తప్పనిసరి చేయడం వల్ల పెట్టుబడిదార్లకే ఉపయోగం. తన పెట్టుబడి వివరాలను కుటుంబ సభ్యులకు చెప్పకుండా పెట్టుబడిదారు హఠాత్తుగా చనిపోతే, ఆ డబ్బును నామినీకి అందిస్తారు. తద్వారా, అతని మరణం తర్వాత వివాదాలు తలెత్తకుండా నిరోధించవచ్చు. అలాగే, పెట్టుబడిదారు ఖాతాను మరొకరికి బదిలీ చేయడం లేదా మూసివేసే పని సులభంగ మారుతుంది.
గడువు పొడిగింపుతో తప్పిన ఇబ్బందులు
మ్యూచువల్ ఫండ్స్ & డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరును యాడ్ చేసే గడువును సెబీ పొడిగించడం వల్ల, ప్రస్తుతానికి, పెట్టుబడిదార్లు చాలా ఇబ్బందులు తప్పించుకున్నారు. 2023 డిసెంబర్ 31 తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాలను యథావిధిగా ఆపరేట్ చేయగలరు. డబ్బులు యాడ్ చేయగలరు, విత్‌డ్రా చేయగలరు. ఒకవేళ, సెబీ గడువును పొడిగించకపోతే ఆయా అకౌంట్లు డీయాక్టివేట్ అవుతాయి. ఈ ఇబ్బందిని తప్పించుకోవాలంటే, మీ అకౌంట్‌లో నామినీ పేరును ఇప్పుడే యాడ్ చేయండి.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.64 వేలు దాటిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి