Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్'
ఈ ప్లాన్‌లో భాగంగా, అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి మీకు ఇచ్చేస్తారు. అంటే, డబ్బు ఖర్చు లేకుండా బీమా రక్షణ పొందవచ్చు.
Zero Cost Term Insurance: కరోనా కాలం నుంచి ఆరోగ్య సంరక్షణ మీద జనానికి అవగాహన పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలు తీసుకునే వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ఒకటి, రెండు ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకున్నవాళ్లు ఇప్పుడు మూడు, నాలుగు తీసుకుంటున్నారు. తాము లేని పరిస్థితుల్లో తమ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. LIC సహా చాలా బ్యాంకులు, సంస్థలు ఈ రంగంలో పోటీలో ఉండడంతో, కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నాయి. కొత్త ఆప్షన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే ‘జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్’.
‘జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్’ అంటే ఏంటి?
మీ కష్టార్జితాన్ని మళ్లీ మీ జేబులోకి చేర్చేదే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ ప్లాన్‌లో భాగంగా, అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి మీకు ఇచ్చేస్తారు. అంటే, డబ్బు ఖర్చు లేకుండా బీమా రక్షణ పొందవచ్చు.
ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి జనం పెద్దగా ఇష్టపడరు. ప్రీమియం రూపంలో మనం కట్టిన డబ్బులు తిరిగి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుని, బీమా కంపెనీలు తీసుకు వచ్చిన కొత్త ప్లాన్ ‘జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్’. అన్ని పాలసీల్లాగే దీనిలోనూ బీమా రక్షణ ఉంటుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే, నామినీకి బీమా సొమ్ము అందుతుంది. దీనిలో ఇంతకు మించిన మరో ఆప్షన్ ఉంది. ఒకవేళ, ఏ కారణం వల్లనైనా ఇక టర్మ్ ఇన్సూరెన్స్ వద్దని మీరు అనుకుంటే, మీ పాలసీని సదరు సంస్థకు సరెండర్ చేయవచ్చు. ఇలా సరెండర్ చేస్తే, అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని పాలసీదారుకు తిరిగి చెల్లిస్తారు. ఆ ప్రీమియం మీద జీఎస్‌టీని మాత్రం మినహాయించుకుంటారు. మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చేస్తారు.
అంటే, అవసరం అనుకున్నంత కాలం టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లో ఉండి, అవసరం లేదు అనుకున్నప్పుడు మీ పాలసీని తిరిగి ఇచ్చేయవచ్చు. అప్పటి వరకు కట్టిన డబ్బును తిరిగి తెచ్చుకోవచ్చు. ప్రీమియం కట్టినంత కాలం మీకు రక్షణ ఉంటుంది. ఆ తర్వాత, కట్టిన డబ్బంతా తిరిగి చేతికి వస్తుంది. రక్షణకు రక్షణ, డబ్బుకు డబ్బు అన్నమాట.
‘జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్’ తీసుకోవడానికి ఎవరు అర్హులు?
45 సంవత్సరాల వయస్సు మించని వాళ్లు మాత్రమే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అయితే, డబ్బు అవసరమైన సందర్భాల్లో తొందరపడి పాలసీని సరెండర్ చేయవద్దు. మీరు యాక్టివ్‌గా పని చేస్తున్నంత కాలం మీ కుటుంబానికి తగిన రక్షణ ఉండాలని గుర్తు పెట్టుకోండి. ఇక మీరు ఇంటి నుంచి కదలాల్సిన అవసరం లేని సందర్భంలో, మీపై ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేనప్పుడు, మీ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేసే నిర్ణయం తీసుకోండి.