FDIs In To India: భారత ఆర్థిక వ్యవస్థను ఎఫ్‌డీఐ ఎలా మార్చింది?, ఏ రాష్ట్రాలు ఎక్కువ లాభపడ్డాయి?
FDI Data: పీవీ నరసింహారావు హయాంలోని ఆర్థిక సంస్కరణల నుంచి ఇప్పటి అమృత్ కాల్ వరకు, విదేశీ పెట్టుబడులు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోసం కొత్త ద్వారాలు తెరిచాయి, సరికొత్త ఎత్తులకు నడిపించాయి.
FDI Inflows In To India: ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు FDIలు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మూలస్తంభం వంటివి. ఏ దేశానికి ఎక్కువ విదేశీ పెట్టుబడులు తరలివస్తే, ఆ దేశం త్వరగా ఎదుగుతుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడంలో విదేశీ పెట్టుబడుల పాత్ర కూడా చాలా కీలకం. FDIలు దేశాల మధ్య బలమైన & శాశ్వత సంబంధాన్ని ఏర్పరుస్తాయి.
గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) భారతదేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు స్వల్పంగా తగ్గాయి. ఆ ఆర్థిక ఏడాది మొత్తం మీద 44.4 బిలియన్ డాలర్ల FDI వచ్చింది. అంతకుముందు ఏడాది నమోదైన 46 బిలియన్ డాలర్లతో పోలిస్తే కొంచెం తక్కువ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, ప్రతి దేశం దాని సొంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం భారత్‌లోకి విదేశీ ప్రవాహాలు తగ్గడానికి ప్రధాన కారణాలు.
FDI అంటే?
FDI వివిధ రూపాల్లో ఉంటుంది. ఒక విదేశీ సంస్థ షేర్ల కొనుగోలు ద్వారా భారతదేశ కంపెనీల్లో వాటా దక్కించుకోవచ్చు. విదేశీ కంపెనీయే స్వయంగా ఏదైనా కంపెనీని స్థాపించవచ్చు. భూమిని కొనడం, కొత్త యంత్రాలను అమర్చడం వంటివి కూడా విదేశీ పెట్టుబడుల కిందకు వస్తాయి.
భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
1991లో, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థలోకి ఎఫ్‌డీఐని ఆకర్షించారు. ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు తలుపు తెరిచారు. దీంతో, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దేశంలో పెట్టుబడుల వాతావరణం గణనీయంగా మెరుగుపడింది. 2000 సంవత్సరం నుంచి కొత్త అడుగులు పడ్డాయి. ఆ సంస్కరణల వల్ల విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం సులువైంది. భారతదేశం కొత్త టెక్నాలజీ, క్యాపిటల్, గ్లోబల్ మార్కెట్లలోకి యాక్సెస్ పొందింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ప్రస్తుతం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో భారతదేశం టాప్ 100 దేశాల్లో ఉంది.
2012 సంవత్సరంలో, విదేశీ కంపెనీలు తమ డబ్బును పెట్టుబడి పెట్టగల దేశంగా చైనా తర్వాత భారత్‌ను ఇష్టపడ్డాయి. ఆ కాలంలో... సేవల రంగం, టెలికాం, నిర్మాణం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగాల్లోకి అత్యధిక విదేశీ డబ్బు వచ్చింది. మారిషస్, సింగపూర్, అమెరికా, బ్రిటన్ భారతదేశానికి ఎక్కువ పెట్టుబడులు తెచ్చాయి. 2011-12లో మన దేశంలోకి 35.1 బిలియన్ డాలర్ల FDI వచ్చింది. కొన్నేళ్ల తర్వాత అది పడిపోయింది. తిరిగి, 2015లో పుంజుకుంది. అప్పుడు చైనా, అమెరికా కంటే ఎక్కువ ఇన్‌ఫ్లోస్ సాధించింది. ఆ ఏడాది భారత్‌కు 30 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, చైనాకు 28 బిలియన్ డాలర్లు, అమెరికాకు 27 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి FDI మొత్తం పెరుగుతూనే ఉంది, 2020-21లో 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ మొత్తం.
2000 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు, గత 24 సంవత్సరాల్లో, 678 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి ప్రవహించాయి. ఇందులో దాదాపు సగం మారిషస్, సింగపూర్ దేశాలకు చెందినవే. 25.31 శాతం పెట్టుబడులు మారిషస్ నుంచి, 23.56 శాతం పెట్టుబడులు సింగపూర్ నుంచి వచ్చాయి. అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టే అగ్ర దేశాల లిస్ట్‌లో ఉన్నాయి.
ఏ రాష్ట్రాల్లో ఎక్కువ పెట్టుబడి?
2023-24 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఆ రాష్ట్రంలోకి 7.3 బిలియన్ డాలర్లు వెళ్లాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 55% పెరుగుదల. గుజరాత్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఎఫ్‌డీఐలు పెరిగాయి. అదే సమయంలో, గత రెండేళ్లుగా కర్ణాటకలో FDI క్షీణిస్తోంది. దిల్లీలోనూ విదేశీ పెట్టుబడులు 13.4% తగ్గాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐ పరంగా దిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది.
ఏ రంగంలో ఎంత పెట్టుబడి?
2023-24లో, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్ రంగాన్ని ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇష్టపడ్డారు, అత్యంధికంగా 7.9 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆ తర్వాత సేవల రంగంలోకి 6.6 బిలియన్ డాలర్లు పంప్ చేశారు. అయితే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు రంగాల్లో FDI తగ్గింది. ఔషధాలు, రసాయనాలు, ఆటోమొబైల్, టెలికాం రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయి. అంతకుముుందు ఏడాదితో పోలిస్తే ఈ రంగాల్లో వరుసగా 48 శాతం, 54 శాతం, 20 శాతం, 60 శాతం క్షీణత నమోదైంది.
2023-24లో, నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు విదేశీయులను ఆకర్షిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్ దాటితే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి