TDP Bihar: గుర్తింపు కార్డుల్లేవని ఓట్ల తొలగింపు సరి కాదు - బీహార్ ఇష్యూలో ఎన్నికల సంఘానికి టీడీపీ అభిప్రాయం
Votersఛ List: బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీడీపీ ఈసీకి తన అభిప్రాయం చెప్పింది. ఓటర్ల జాబిత సవరణ పారదర్శకంగా జరగాలని స్పష్టం చేసింది.

TDP on the ongoing voter list revision process in Bihar: సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధానాల్లో సంస్కరణలు, ఓటరు జాబితా సవరణలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస రావు , టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఓటరు జాబితాల్లోని లోపాలను సరిచేయాలన్న ఎన్నికల సంఘం లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
ఓటరు గుర్తింపులో ఆధార్‌ను ఏకైక ఆధారంగా పరిగణించకూడదని సమావేశంలో ఈసీకి సూచించారు. 11 రకాల గుర్తింపు పత్రాలను అంగీకరించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీడీపీ స్వాగతించిందని ఆ పార్టీ ప్రతినిధులు గుర్తు చేశారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, ప్రతి ఓటరుకు ప్రత్యేక డోర్ నంబర్ కేటాయించడం ద్వారా డేటా చోరీని నిరోధించి, యూనిక్ ఓటర్ ఐడెంటిటీ సృష్టించవచ్చని టీడీపీ సూచించింది. పేర్కొన్నారు. ఓటరు జాబితా పరిశీలనలో ఎన్నికల సంఘానికి ప్రత్యేక హక్కులు ఉన్నప్పటికీ, పౌరసత్వ నిర్ధారణ వారి అధికార పరిధిలో లేదని, 1995 సుప్రీంకోర్టు లాల్ బాబు హుస్సేన్ కేసు తీర్పును పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు.
అభ్యంతరాలు లేవనెత్తిన వారే ఆధారాలు సమర్పించాలని, ఆధారాలు చూపలేకపోయినంత మాత్రాన ఓటర్ల హక్కును రద్దు చేయడం సరికాదని స్పష్టం చేశారు. బిహార్‌లో ఈ ప్రక్రియ కారణంగా గందరగోళం నెలకొందని, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఆధార్ ఉన్నా ఇతర పత్రాలు లేని వారు ఎక్కువగా ఉండటం వల్ల నిజమైన ఓటర్లు తొలగింపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌లో సుమారు 3 కోట్ల మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం ఆర్టికల్ 326కు విరుద్ధమని, గుర్తింపు పత్రాలు లేని వారు భారతీయులేనని నిర్ధారించే బాధ్యత ప్రభుత్వ సంస్థలదేనని ఆయన అన్నారు. టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస రావు, ఓటర్లకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన, పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని, ఫీల్డ్ లెవెల్ అధికారుల నియామకంలో పారదర్శకతను నిర్వహించాలని సూచించారు.
వాలంటీర్ వ్యవస్థలు, మొబైల్ వాహనాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పత్రాల సేకరణకు ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. వాట్సాప్ హెల్ప్‌లైన్లు, వార్డు స్థాయి సమస్యా పరిష్కార విధానాలు సమర్థవంతంగా పనిచేయాలని, పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులను అన్ని దశల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి పౌరుని ఓటు హక్కును కాపాడేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బూత్ లెవెల్ అధికారులకు (BLOs) ప్రస్తుతం అందిస్తున్న రూ.250 ప్రోత్సాహకాన్ని పెంచాలని, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) మరియు BLOలు సమన్వయంతో పనిచేస్తే పని మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని తెలుగుదేశసం ఈసీకి సూచించింది.





















