Tax On UPI Transactions: యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్ దాటితే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి
UPI Transactions Limit: యూపీఐ ద్వారా డబ్బులు స్వీకరిస్తే, ఒక పరిమితి దాటిన తర్వాత, ఆ డబ్బు "పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం"గా మారుతుంది. దానిని ITRలో తప్పనిసరిగా చూపించాలి.
Income Tax On UPI Transactions: మన దేశంలో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థ 2016లో ప్రారంభమైంది. అప్పటి నుంచి డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు భారతదేశం పరుగులు పెట్టింది. UPI యూజర్లు తమ ఫోన్‌నే వాలెట్‌గా మార్చుకున్నారు. భౌతిక నగదు లేదా కార్డ్‌ల అవసరం తగ్గింది. లావాదేవీల్లో వేగం, సౌలభ్యం, ఛార్జీలు లేకపోవడం వల్ల యూపీఐ వ్యవస్థకు విపరీతమైన జనాదరణ లభించింది.
యూపీఐ వల్ల ప్రజలకే కాదు, ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. లావాదేవీలు డిజిటల్ పద్ధతిలో సాగుతాయి కాబట్టి వాటిపై ఓ కన్నేసి ఉంచొచ్చు. భౌతిక నగదు వినియోగం తగ్గడం వల్ల నోట్ల ముద్రణ & నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి.
UPI లావాదేవీలపై ఆదాయ పన్ను
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, UPI లావాదేవీలు "ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం" (Income from other sources) కేటగిరీలోకి వస్తుంది. ఈ లావాదేవీలు సెక్షన్ 56(2) కిందకు వస్తాయి. పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేసేటప్పుడు అన్ని UPI & డిజిటల్ వాలెట్ లావాదేవీలను తప్పనిసరిగా చూపించాలి. డిజిటల్ ట్రాన్‌జాక్షన్ లెక్కలన్నీ ఆదాయ పన్ను విభాగం దగ్గర ఉంటాయని గుర్తుంచుకోండి.
UPI లేదా డిజిటల్ వాలెట్ల ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ డబ్బు పొందితే, కొన్ని షరతులకు లోబడి, ఆ డబ్బు మొత్తం "పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం" అవుతుంది.
UPI లావాదేవీలపై విధించే ఆదాయ పన్ను కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది:
-- రూ.50,000 లోపు UPI లావాదేవీలకు పన్ను మినహాయింపు ఉంటుంది, వీటికి ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.
-- మీరు పని చేసే కంపెనీ/యజమాని నుంచి రూ. 5,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో గిఫ్ట్ ఓచర్లను UPI లేదా ఇ-వాలెట్‌ల ద్వారా స్వీకరిస్తే, ఆ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.
-- ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం, డిజిటల్ వాలెట్‌లు & UPI యాప్‌ల నుంచి పొందిన క్యాష్‌బ్యాక్‌లు "పన్ను పరిధిలోకి వచ్చే బహుమతులు" అవుతాయి.
--- నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూల్స్ ప్రకారం, UPI ద్వారా రూ. 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై ఆదాయ పన్ను చెల్లించాలి.
స్నేహితులకు డబ్బు పంపితే?
స్నేహితుల మధ్య నగదు లావాదేవీలు చాలా కామన్. స్నేహితుల నుంచి తీసుకున్న అప్పును తిరిగి తీర్చేందుకు UPI లేదా ఇ-వాలెట్ ఉపయోగిస్తే, దానికి సంబంధించిన పన్నులపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. సాధారణంగా, రూ. 50,000 కంటే తక్కువ విలువైన రీపేమెంట్స్ పన్ను మినహాయింపు పరిమితిలో ఉంటాయి. ఈ పరిమితి దాటితే, లావాదేవీకి సంబంధించిన వివరాలను సేవ్ చేసి పెట్టుకోవడం మంచిది.
UPI లావాదేవీలపై ఇంటర్‌ఛేంజ్ ఫీజు
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIలు) ద్వారా రూ. 2000 కంటే ఎక్కువ UPI లావాదేవీలు చేస్తే, వాటిపై 1.1% ఇంటర్‌చేంజ్ ఫీజు వసూలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫార్సు చేసింది. ఈ రుసుము PPI మర్చంట్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. పీర్-టు-మర్చంట్, పీర్-టు-పీర్ UPI చెల్లింపుల విషయంలో కస్టమర్‌లకు మినహాయింపు ఉంటుంది.
GST ప్రకారం UPI పరిమితి
ఆదాయ పన్ను చట్టం తరహాలోనే GST చట్టంలోనూ UPI లావాదేవీలపై పరిమితి లేదు. కానీ, GST రిజిస్ట్రేషన్ కోసం ఒక షరతు పాటించాలి.
--- ఒక వ్యక్తి వస్తువులను మాత్రమే సరఫరా చేస్తే, మొత్తం టర్నోవర్ పరిమితి రూ. 40 లక్షలు
--- ఒక వ్యక్తి సేవలను మాత్రమే అందిస్తే, మొత్తం టర్నోవర్ పరిమితి రూ. 20 లక్షలు
ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి చేసిన UPI లావాదేవీలు ఈ పరిమితుల కంటే ఎక్కువగా ఉంటే, అతను GST రిజిస్ట్రేషన్ పొందాలి.
మరో ఆసక్తికర కథనం: కొత్త సిమ్ కొనే ముందు ఒకటికి, రెండుసార్లు ఆలోచించండి - రూ.లక్షల్లో జరిమానా!