ITR 2024: ఐటీ డిపార్ట్‌మెంట్ పంపే 6 నోటీస్‌లు, మీకు రాకుండా చూసుకోండి
మీరు రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఏదైనా సమస్య ఉంటే, ఆదాయ పన్ను విభాగం సలహా తీసుకోవచ్చు.
Income Tax Notice: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (Income Tax Return) ఫైల్ చేసే వాళ్లు కొన్ని కీలక విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఐటీఆర్ (ITR 2024) ఫైలింగ్ సమయంలో తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఐటీఆర్‌లో అందించిన సమాచారంలో నిజం ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇన్ఫర్మేషన్‌ను అరకొరగా ఇవ్వడం, దాచడం, లేనివి ఉన్నట్లు చూపించడం, అస్పష్టమైన సమాచారం ఇవ్వడం వంటి తప్పులు/పొరపాట్లు ఐటీఆర్‌లో ఉంటే, అలాంటి టాక్స్ పేయర్లకు (Taxpayer) మాత్రమే నోటీస్ అందుతుంది. ఏటా చాలా మందికి వివిధ సెక్షన్ల కింద ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీస్‌లు పంపుతుంది. ఒకవేళ, మీరు రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఏదైనా సమస్య ఉంటే, ఆదాయ పన్ను విభాగం సలహా తీసుకోవచ్చు.
ఐటీ డిపార్ట్‌మెంట్ జారీ చేసే 6 రకాల ఆదాయ పన్ను నోటీస్‌లు (6 Types of Income Tax Notices):
సెక్షన్ 143(2) కింద ఆధారాల కోసం నోటీస్
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139 లేదా 142(1) కింద రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుకు, సెక్షన్ 143(2) కింద ఆదాయ పన్ను విభాగం నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారు తప్పుడు సమాచారం ఇచ్చారని, లేదా ఆదాయానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఇవ్వలేదని అసెసింగ్ ఆఫీసర్ (AO) భావిస్తే, డిపార్ట్‌మెంట్ తరపున నోటీస్ పంపవచ్చు. ఈ సెక్షన్ కింద పంపే నోటీస్ ద్వారా, ఐటీఆర్‌లోని సమాచారానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించమని టాక్స్ పేయర్‌ను AO కోరతారు.
సెక్షన్ 156 కింద చెల్లింపుల కోసం నోటీస్
పన్ను, వడ్డీ, పెనాల్టీ లేదా ఇండివిడ్యువల్ తరపున కట్టాల్సిన బకాయి ఏదైనా ఉంటే, ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచిస్తూ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 156 కింద అసెసింగ్ అధికారి నోటీస్ జారీ చేయవచ్చు.
సెక్షన్ 245 కింద రిఫండ్ సెట్-ఆఫ్‌పై నోటీస్
గత ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలు ఉన్న పన్ను చెల్లింపుదార్లకు ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీస్‌లు పంపవచ్చు. ఇలాంటి సందర్భంలో సెక్షన్ 245 కింద నోటీస్ అందుతుంది. ఇలాంటి పన్ను చెల్లింపుదార్లకు టాక్స్ రిఫండ్ (Tax refund) కూడా ఆలస్యం అవుతుంది.
తప్పుడు రిఫండ్ విషయంలో 139(9) సెక్షన్ కింద నోటీస్
రిటర్న్‌లో అసంపూర్ణమైన, స్పష్టత లేని సమాచారం ఇవ్వడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆ రిటర్న్ లోపభూయిష్టంగా ఉందని AO పరిగణించవచ్చు. దాని గురించి సదరు టాక్స్ పేయర్‌కు తెలియజేయడానికి ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 139(9) కింద నోటీస్ ఇవ్వవచ్చు. ఈ నోటీస్ అందుకున్న టాక్స్ పేయర్, సమాచారం అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు రివైజ్డ్ రిటర్న్ (Revised Return) ఫైల్ చేయాలి.
సెక్షన్ 142(1) కింద నోటీస్
ఒక వ్యక్తి లేదా సంస్థ ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసినా, అదనపు సమాచారం సమర్పించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 142(1) కింద నోటీస్ జారీ చేస్తారు.
సెక్షన్ 148 కింద నోటీస్
ఐటీఆర్‌లో, వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపారని డిపార్ట్‌మెంట్‌కు అనుమానం వస్తే, గతంలో ఫైల్ చేసిన రిటర్న్‌ను సరిచేసి మళ్లీ దాఖలు చేయమని సూచిస్తూ, ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 148 కింద నోటీస్ కింద నోటీస్ ఇస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మదుపు చేస్తే టాక్స్ కట్టక్కర్లేదు, డబ్బంతా మీదే