Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్, సెన్సెక్స్ 1000pts జంప్ - గ్లోబల్ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు
Sensex And Nifty Today: వాణిజ్య ఉద్రిక్తతల మధ్య శుక్రవారం గ్లోబల్ మార్కెట్లు డీలా పడినప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్ ఫుల్ జోష్‌లో ఉంది.

Indian Stock Market Open At High Today: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు ఉదయం (శుక్రవారం, 11 ఏప్రిల్ 2025) బుల్స్ ఛార్జ్ తీసుకున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు, ఈ రోజు ప్రారంభంలో ఆసియా మార్కెట్లు డీలా పడ్డప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించాయి. ట్రంప్ టారిఫ్‌లకు (Trump tariffs) 90 రోజుల విరామం ప్రకటన తర్వాత, గురువారం నాడు భారీగా లాభపడిన ఆసియా స్టాక్ మార్కెట్లు, ఒక్క రోజు వ్యవధిలో శుక్రవారం డౌన్ సైడ్ పరుగులు తీస్తున్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లు
మహవీర్ జయంతి సందర్భంగా నిన్నటి (గురువారం) సెలవు తర్వాత, ఈ రోజు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ మంచి ఆరంభాన్ని అందించాయి. బుధవారం 73,847 దగ్గర ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు దాదాపు 1000 పాయింట్ల (988 పాయింట్లు) లేదా 1.14 శాతం పెరిగి 74,835.49 వద్ద ఓపెన్ అయింది. క్రితం సెషన్‌లో 22,399 వద్ద ఆగిన నిఫ్టీ ఈ రోజు దాదాపు 300 పాయింట్ల (296 పాయింట్లు) లేదా 1.61 శాతం జంప్‌తో 22,695.40 దగ్గర ట్రేడ్ ప్రారంభించింది.
స్మాల్ క్యాప్ & మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కూడా మంచి కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మొత్తం చిత్రాన్ని పరిశీలిస్తే, BSEలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ ప్రారంభ ట్రేడింగ్‌లో రూ. 5.77 లక్షల కోట్లు పెరిగింది. ఫార్మా షేర్లు బలం పెంచుకుంటే, TCS షేర్లు క్షీణించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 90 రోజుల సుంకం విరామం ప్రకటన తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్‌కు ఇది గొప్ప ప్రారంభం. దీనికి ఒక రోజు ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును (RBI Repo Rate) 25 బేసిస్ పాయింట్లు కట్ చేసి 6 శాతానికి తగ్గించడం ద్వారా ప్రజలకు ఊరట కల్పించింది.
ఆసియా మార్కెట్లు డీలా
ఈ ఉదయం, జపాన్‌కు చెందిన నిక్కీ 225 పాయింట్లు లేదా 5.46 శాతం పడిపోయింది. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని 22 పరిశ్రమ ఉప-సూచికలు పడిపోవడంతో జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా కలుగజేసుకున్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. జపాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి రియోసీ అకాజావా ఈ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తారని, వచ్చే వారం వాషింగ్టన్ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన మార్కెట్లలో... దక్షిణ కొరియాకు చెందిన కోస్పి కూడా 1.55 శాతం క్షీణించగా, కోస్డాక్ 0.11 శాతం పడిపోయింది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ కూడా క్షీణతతో ప్రారంభమైంది. ఆస్ట్రేలియన్ షేర్లు కూడా 2 శాతం కంటే ఎక్కువ క్షీణతను చవిచూశాయి. S&P/ASX 200 ఇండెక్స్ 2.4 శాతం తగ్గి 7,524.50 వద్దకు చేరుకుంది. న్యూజిలాండ్ బెంచ్‌మార్క్ S&P/NZX 50 ఇండెక్స్ కూడా 1.5 శాతం పడిపోయింది.
యూఎస్ మార్కెట్లు పతనం
అమెరికా - చైనా మధ్య పెరిగిన వాణిజ్య ఉద్రిక్తత వాల్ స్ట్రీట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. గురువారం.. డౌ డోన్స్ 2.5 శాతం, S&P 500 సూచీ 3.46 శాతం, నాస్‌డాక్ 4.31 శాతం చొప్పున పతనమయ్యాయి.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం
ప్రతీకార చర్యలు తీసుకోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల సుంకాల విరామం ప్రకటించారు. చైనాపై సుంకాలను మరింత పెంచారు, ఇప్పుడు చైనాపై మొత్తం సుంకం 154 శాతానికి పెరిగింది. ట్రంప్ సుంకాలకు ప్రతిస్పందనగా చైనా కూడా చర్యలు తీసుకుంటోందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. ఈ నేపథ్యంలో, అమెరికాపై బీజింగ్ విధించిన సుంకం రేటును 84 శాతం నుంచి మరింత పెంచవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.





















