DeepSeek In India: ఇండియన్ సర్వర్లలో డీప్‌సీక్ హోస్టింగ్ - భారతీయుల డేటా ప్రైవసీకి ఇదే పరిష్కారం
DeepSeeks Privacy Policy: డీప్‌సీక్‌లో రిజిస్టర్ అవుతున్న వివిధ దేశాల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చైనా ప్రభుత్వం గుప్పిటలో పెట్టుకుంటోందన్న అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా, అమెరికా తెగ భయపడుతోంది.

Indian Servers To Host DeepSeek: ప్రసిద్ధ చైనీస్ ఓపెన్-సోర్స్ AI మోడల్ అయిన 'డీప్‌సీక్'ను త్వరలో భారతీయ సర్వర్లలో హోస్ట్ చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (IT Minister Ashwini Vaishnaw) ప్రకటించారు. వ్యక్తిగత సమాచారం గోప్యత విధానాల (Privacy Policy) విషయంలో వస్తున్న సందేహాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని మనీకంట్రోల్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు, భారతదేశ AI సామర్థ్యాలను మెరుగుపరచడం కూడా ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశంగా చెప్పారు.
సమాచారానికి భద్రత కంచె
ఇండియాఏఐ మిషన్ (IndiaAI Mission) ఈవెంట్‌లో, విలేకరులతో మాట్లాడిన అశ్విని వైష్ణవ్, దేశంలో ఓపెన్-సోర్స్ మోడళ్లను హోస్ట్ చేయడం వల్ల మెరుగైన సమాచార భద్రత & భారతీయ నిబంధనలకు అనుగుణంగా అవి ఉండేలా చూసేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు.
డీప్‌సీక్ ప్రైవసీ పాలసీపై ఆందోళనలు
అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు డీప్‌సీక్‌లో స్టోర్ చేస్తున్న డేటా గురించి, దాని చైనీస్ మూలాల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ (OpenAI) రూపొందించిన AI మోడల్ ఛాట్‌జీపీటీ (ChatGPT)కి చైనాకు చెందిన డీప్‌సీక్ బలమైన పోటీదారుగా మారింది. వాస్తవానికి, దీని రూపకల్పన ఉద్దేశం కూడా ఇదేనని సమాచారం. కృత్రిమ మేథ ఛాట్‌బాట్‌లలో అమెరికా గుత్తాధిపత్యానికి సవాల్ విసిరేందుకు చైనీయులు డీప్‌సీక్‌ను తయారు చేశారని తెలుస్తోంది. డీప్‌సీక్‌లో రెండు మోడళ్లు (R1 & R1 జీరో) ఉన్నప్పటికీ, ప్రస్తుతం, యూజర్లకు R1 మోడల్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
అగ్రస్థానంలో డీప్‌సీక్
ప్రస్తుతం, డీప్‌సీక్ R1 మోడల్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది. దీనిని యాపిల్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా "ఉచితం". యాప్ డౌన్‌లోడ్స్ విషయంలో డీప్‌సీక్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది, ఛాట్‌జీపీటీ కంటే చాలా ముందుంది.
డీప్‌సీక్ R1 మోడల్, ఛాట్‌జీపీటీ మధ్య పనితీరును పోల్చి చూస్తే.. R1 మోడల్ ప్రస్తుతానికి సమర్థవంతంగా కనిపిస్తోంది. ఛాట్‌జీపీటీతో పోలిస్తే ఇది చాలా తక్కువ డేటా ఉపయోగించుకుంటుంది. అంతేకాదు, ఒక అభిప్రాయం ప్రకారం, డీప్‌సీక్ మోడళ్లను డెవలప్ చేయడానికి కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చయింది. అయితే, అమెరికన్ టెక్ కంపెనీలు AI కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి, పెట్టుబడిదార్లను భయపెడుతున్నాయి.
డీప్‌సీక్‌లో చాలా అనుకూలతలు ఉన్నప్పటికీ, దాని ఛైనీస్ మూలమే దానికి శత్రువుగా మారింది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా సర్కారు ఈ AI మోడల్‌పై అపనమ్మకంగా ఉంది. దీనిలో రిజిస్టర్ అయ్యే వ్యక్తుల సమాచారం మొత్తం చైనా సర్వర్లలో స్టోర్ కావడమే దీనికి కారణం. అమెరికా సైన్యం, తమ సిబ్బంది ఎవరూ డీప్‌సీక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, వినియోగించవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది.
మరో ఆసక్తికర కథనం: మీ వ్యక్తిగత వివరాలు చైనాకు చేరవేత? డీప్‌సీక్ వాడుతున్న వాళ్లు జర భద్రం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

