UK Student Visa: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
UK Student Visa New Rules: యూకేలో చదువుకోవడానికి స్టుడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే వాళ్లకు, ట్యూషన్ ఫీజుతో పాటు ఖాతాలో చూపించాల్సిన మెయింటెనెన్స్ అమౌంట్‌ను పెంచారు.
UK Student Visa Rules Revised: విదేశాల్లో చదువు'కొనే' భారతీయ విద్యార్థులు కోకొల్లలు. కొంతమంది విజ్ఞానాన్వేషణ కోసం విదేశాలకు వెళుతుంటే, మరికొందరు 'ఫారిన్‌లో చదివాం' అని పబ్లిక్‌గా గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే సముద్రాలు దాటి వెళ్తున్నారు. ఎవరి కారణాలు వాళ్లవి. మన దేశ విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, రష్యా, స్విట్జర్యాండ్ సహా చాలా దేశాల్లో సీట్లు సంపాదిస్తున్నారు. మన పక్కనున్న చైనాలో కూడా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.
మీరు, స్టుడెంట్ వీసాపై నూతన సంవత్సరంలో బ్రిటన్ వెళ్లాలని ప్లాన్ చేస్తే, ఇప్పుడు అయ్యే వ్యయం కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. లండన్ యూనివర్శిటీలో చదువుకోవడానికి మెయింటెనెన్స్ డబ్బు 2025 జనవరి నుంచి 13,347 పౌండ్లకు పెంచారు. ఇది, ప్రస్తుతం 12,006 పౌండ్లుగా ఉంది, దీనిని 11.17 శాతం పెంచి 13,347 పౌండ్లకు చేర్చారు. స్టుడెంట్ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, ట్యూషన్ ఫీజు కాకుండా, మీరు 28 రోజుల పాటు మీ బ్యాంక్ ఖాతాలో ఇంత బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది కనీస మొత్తం. అంటే, దీనికి కంటే ఎక్కువ ఉండొచ్చు గానీ, తగ్గడానికి వీల్లేదు. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయం దృష్ట్యా ఈ మార్పు జరిగింది.
లండన్ వెలుపల కాలేజీల్లో ఇలా...
లండన్ వెలుపల చదువుకోవాలనుకునే విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలో, ఒక సంవత్సరానికి, ఇప్పుడున్న 9,207 పౌండ్లకు బదులుగా ఇకపై 10,224 పౌండ్లను మెయింటెనెన్స్ అమౌంట్‌గా చూపించాలి. ఇది కూడా 11.05 శాతం పెరిగింది. బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ మార్పు 02 జనవరి 2025 నుంచి అమలులోకి వస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్
బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో జమ చేయాలి
మెయింటెనెన్స్ డబ్బుతో పాటు, విద్యార్థి వీసా కోసం, ఆ విద్యార్థి బ్యాంక్ ఖాతాలో ట్యూషన్ ఫీజ్ మొత్తాన్ని కూడా చూపాలి. మీరు లండన్‌లోని కాలేజీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే, ట్యూషన్ ఫీజు 20,000 యూరోలు. స్టుడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందే మీరు 5000 యూరోలు చెల్లించాలి. ఇప్పుడు, వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు 13,347 పౌండ్ల నిర్వహణ డబ్బుతో పాటు, ట్యూషన్ ఫీజ్‌గా 15,000 యూరోలు (20,000 - 5,000 యూరోలు) చూపించాలి. కళాశాల లండన్ వెలుపల చదువుతున్నట్లయితే, ఖాతా బ్యాలెన్స్ 10,224 పౌండ్లను చూపాలి.
ఆర్థిక ప్రణాళిక అవసరం
యూకే స్టుడెంట్ వీసా కోసం మెయింటెనెన్స్ అమౌంట్ పెరగడం వల్ల, భారతీయ విద్యార్థులు తమ ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉంటుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.బ్రిటన్‌లో చదువుకోవడం నూతన సంవత్సరం నుంచి మరింత ఖరీదవుతుంది కాబట్టి, సరైన బడ్జెట్‌ను రూపొందించుకోవడం కీలకమని చెబున్నారు. లేదా, స్కాలర్‌షిప్ అవకాశాలను వెతుక్కుంటే ఆర్థిక భారం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. తగిన డబ్బు కోసం మంచి పెట్టుబడి మార్గాలను అధ్యయనం చేయాలన్నది కూడా నిపుణుల సలహా.
మరో ఆసక్తికర కథనం: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి