Rich List: బిలియనీర్ల రాజధాని బీజింగ్ కాదు, ముంబై - పెరిగిన లక్ష్మీపుత్రులు
మన పొరుగున ఉన్న చైనా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ధనవంతుల సంపద క్రమంగా తగ్గుతూ వస్తోంది.
![Rich List: బిలియనీర్ల రాజధాని బీజింగ్ కాదు, ముంబై - పెరిగిన లక్ష్మీపుత్రులు Hurun Research 2024 Global Rich List Asia Billionaire Capital Mumbai Mukesh Ambani 10th Richest Man in World Rich List: బిలియనీర్ల రాజధాని బీజింగ్ కాదు, ముంబై - పెరిగిన లక్ష్మీపుత్రులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/d558176cd9cd18099f0d95abc21d94fc1711507974226545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hurun Global Rich List 2024: ముంబై మన దేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, బిలియనీర్ల నిలయంగానూ మారింది. ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా బీజింగ్‌కు ఉన్న హోదాను ముంబై లాగేసుకుంది. చరిత్రలో తొలిసారిగా బీజింగ్‌ను ముంబై వెనక్కు నెట్టింది.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, ప్రస్తుతం 92 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తున్నారు. ఈ సంపన్నులు తమ సంపదను నిరంతరం పెంచుకుంటున్నారు. మరోవైపు, మన పొరుగున ఉన్న చైనా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ధనవంతుల సంపద క్రమంగా తగ్గుతూ వస్తోంది.
కొత్తగా 27 మంది బిలియనీర్లు
హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం, గత ఏడాది కాలంలో, ముంబై నగరంలో కొత్తగా 27 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చారు. బీజింగ్‌లో ఈ సంఖ్య 6 మాత్రమే. భారతదేశంలో పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య దేశ పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక బలాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తించింది. కొత్త బిలియనీర్ల సంఖ్య పరంగా చూస్తే.. భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.
అంబానీ సంపద విలువ
హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) పేరు మొదటి స్థానంలో ఉంది. అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీ పేరును చేర్చడం ద్వారా భారతదేశ ఆర్థిక ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది. గత ఏడాదిలో, అంబానీ సంపద 40 శాతం లేదా 33 బిలియన్ డాలర్లు పెరిగింది, 115 బిలియన్ డాలర్లకు చేరింది. మన రూపాయల్లో చెప్పుకుంటే, అంబానీ నికర విలువ (Mukesh Ambani Networth) రూ. 9.50 లక్షల కోట్లు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024లో ముకేష్ అంబానీ 10వ స్థానంతో టాప్-10లో ఉన్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు.
భారతదేశంలో పెరిగింది, చైనాలో తగ్గింది
భారతదేశం, చైనా మధ్య సంపద వృద్ధి ధోరణులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. హురున్ నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంలో, చైనాలోని 573 బిలియనీర్ల సంపద క్షీణించింది. అదే సమయంలో, ఈ ధోరణి భారతదేశంలో 24 మంది బిలియనీర్ల సంపదలో మాత్రమే కనిపించింది. ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది. ముంబై సంపద కూడా 47 శాతం పెరిగితే బీజింగ్‌లో 28 శాతం తగ్గింది. దీనివల్ల, ఆసియా నగరాల్లో ముంబై స్థానం మరింత బలోపేతమైంది. గత ఏడాది కాలంలో, భారత్‌లోని బిలియనీర్ల సగటు సంపద 3.8 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనాలో కేవలం 3.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
ముంబై వృద్ధి గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన ఎనలిస్ట్ అనస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 దీనిని నిర్ధారిస్తుంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణంలో భారతదేశంలోని బిలియనీర్లు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Aster DM, Adani, CDSL, SpiceJet
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)