Remove Your Data: గూగుల్ కొత్త టూల్ - ఇంటర్నెట్ నుంచి మీ పర్సనల్ డేటాను తీసేయండి
Remove Personal Information: వాస్తవానికి, "Remove this result" ఫీచర్ వల్ల పర్సనల్ డేటా మొత్తం ఇంటర్నెట్ నుంచి మాయమైపోదు. కానీ.. డేటా కనిపించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి, రిస్క్ కూడా తగ్గుతుంది.
Remove Personal Information From Google Search: సాంకేతికత విపరీతంగా పెరిగిన ప్రస్తుత కాలంలో, ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం రిస్క్ ఉన్నట్లే. ఫోన్ నంబర్, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాల నంబర్లు, ఫోటోలు, వీడియోలు సహా కోట్లాది మంది పర్సనల్ డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంది. గోప్యతను కాపాడుకోవడానికి ఆన్‌లైన్ నుంచి తప్పుకోవడం కూడా కుదరని రోజులు ఇవి. ఆన్‌లైన్‌లో ఉంటూనే, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాలనుకునే వ్యక్తులకు గూగుల్ కొత్త ఫీచర్ "Remove this result" ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, పరిశీలన దశలో ఉంది.
గూగుల్ సెర్చ్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని ఎలా తీసేయాలి?
-- గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మీ పేరును టైప్ చేసి సెర్చ్ చేయండి. ఏయే వెబ్‌సైట్స్‌లో మీ వ్యక్తిగత సమాచారం ఉందో తెలుస్తుంది.
-- మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడిస్తున్న వెబ్‌సైట్లను గుర్తించండి.
-- వెబ్‌సైట్ లింక్ పక్కన ఉన్న మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేయండి.
-- ఇప్పుడు, ఒక పాప్-అప్ మెనూ కనిపిస్తుంది. ఈ మెనూలో కుడి ఎగువ భాగంలో ఉన్న "Remove result" ఆప్షన్ ఎంచుకోండి.
-- ఇక్కడ ఐదు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్ వంటివి తీసివేయడానికి "It shows my personal contact info" ఆప్షన్ ఎంచుకోండి.
-- మరింత వ్యక్తిగత సమాచారాన్ని కనిపెట్టడానికి, అక్కడ కనిపించే బాణం గుర్తును ఉపయోగించండి.
-- గూగుల్ నిబంధనలకు ఓకే చెప్పడానికి కుడి వైపున ఉన్న బాణంపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత, "Continue" బటన్‌పై మూడు సార్లు నొక్కండి. దీనికి ముందే, మీ గూగుల్ అకౌంట్‌లోకి మీరు లాగిన్ అయి ఉండాలి.
-- ఇంటర్నెట్ నుంచి తీసేయాలనుకుంటున్న మీ పేరు, సంప్రదింపుల సమాచారాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఉదాహరణకు, మీ ఫోన్ నంబర్‌ను నెట్ నుంచి తొలగించాలంటే, ఆ నంబర్‌ను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పుడు, "Continue" మీద క్లిక్ చేయండి.
-- అన్ని వివరాలను మరోసారి చెక్ చేసుకుని, "Send" బటన్ నొక్కండి. ఇక్కడితో మీ రిక్వెస్ట్ పూర్తవుతుంది.
-- గూగుల్ సెర్చ్ పేజీకి తిరిగి రావడానికి "I'm done" నొక్కండి. లేదా, మీరు పంపిన రిక్వెస్ట్‌ను మరోమారు చూసుకోవాలనుకుంటే "Go to removal requests" బార్ మీద నొక్కండి.
మీ అభ్యర్థన సమర్పించిన తర్వాత, దానిని ప్రాసెస్ చేయడానికి గూగుల్‌కు కొన్ని రోజులు పట్టొచ్చు. దీనికి సంబంధించి మీ ఇ-మెయిల్ అడ్రస్‌కు గూగుల్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. గూగుల్ ఖాతా ద్వారా కూడా మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీని కోసం...
-- మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోని "Data & Privacy Settings"లోకి వెళ్లండి.
-- కిందకు స్క్రోల్ చేస్తే "My Activity" కనిపిస్తుంది, దానిని ఎంచుకోండి.
-- సెర్చ్ బార్‌లో కనిపించే మూడు చుక్కలను నొక్కండి, "Other activity" ఎంచుకోండి.
-- "Manage results about you" మీద క్లిక్ చేస్తే, మీ అభ్యర్థన తాలూకు స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది.
గూగుల్ అందిస్తున్న "Remove this result" ఫీచర్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసిన అసలు వెబ్‌సైట్ నుంచి ఆ డేటాను ఇది తొలగించలేదు. మిగిలిన వెబ్‌సైట్ల నుంచి మాత్రం తీసేస్తుంది. అంటే, సాధారణ సెర్చ్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోగల అవకాశాలను ఇది చాలా వరకు తగ్గిస్తుంది.
సోషల్ సెక్యూరిటీ నంబర్లు లేదా బ్యాంక్ ఖాతా వివరాలు వంటి గోప్యమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి తీసేయాలని మీరు భావిస్తుంటే, దాని కోసం గూగుల్ మరో లింక్ అందిస్తుంది. ఈ లింక్‌లో "Content contains your personal information"ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా చాలా సున్నితమైన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించొచ్చు.
మరో ఆసక్తికర కథనం: డబ్బుల కోసం కోర్టుకు ఎక్కిన బైజూస్ - పుట్టెడు కష్టాలు తీరేదెన్నడో?