Update Address In Aadhaar: ఆధార్ కార్డ్‌లో అడ్రెస్‌ను సింపుల్‌గా మార్చుకోండి, స్టెప్ బై స్టెబ్ గైడ్ ఇదిగో
UIDAI, Update Address, Online, Aadhaar Card Adress, Step-By-Step Guide
Update Address In Aadhaar: ఆధార్ కార్డ్ అన్నది మన జీవితంలో ఒక భాగంగా మారింది. భారతీయులకు జారీ చేసే ఒక ప్రత్యేక/ విశిష్ఠ గుర్తింపు సంఖ్య (Unique Identification Number) ఆధార్ నంబర్. ఏ ప్రభుత్వ సేవ లేదా పథకం ప్రయోజనాన్ని పొందాలన్నా ఆధార్ తప్పనిసరి అయింది. ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ఇప్పుడు ఆధార్ అడుగుతున్నారు. ఆఖరుకు, అద్దె ఇంటి కోసం వెళ్లినా ఆధార్ కార్డ్ చూపించమని చాలా మంది అడుగున్నారు.
కొన్నిసార్లు, ఆధార్ కార్డ్‌లోని సమాచారాన్ని మార్చడం లేదా అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శాశ్వత చిరునామాలో మార్పు ఉంటే, పిల్లల వయస్సు 15 సంవత్సరాలు నిండితే, పేర్లు లేదా శాశ్వత చిరునామా సమాచారంలో అక్షర దోషాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం తప్పనిసరి.
మీ ఆధార్ కార్డ్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, ఉడాయ్ (UIDAI) వెబ్‌సైట్ ద్వారా సులభంగా మార్పులు చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్‌లోని చిరునామాను మార్చడానికి లేదా అప్‌డేట్ చేయడానికి ఏయే స్టెప్స్ పాటించాలో ఇక్కడ వివరంగా చూద్దాం.
ఆధార్‌లో చిరునామా మార్చడానికి స్టెప్ బై స్టెప్ గైడ్:
- ముందుగా, UAIDI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
- ఇప్పుడు వెబ్‌సైట్ హోమ్ పేజీలో కనిపించే 'మై ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు, 'అప్‌డేట్ యువర్ ఆధార్' సెక్షన్‌లోకి వెళ్లి, 'అప్‌డేట్ అడ్రెస్ ఇన్ యువర్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇక్కడ మీరు లాగిన్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
- లాగిన్ బాక్స్‌లో మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి. కింద కనిపించే క్యాప్చాను కూడా సంబంధిత పెట్టెలో నమోదు చేయడం ద్వారా మీ ఆధార్ నంబర్‌ను ధృవీకరించండి.
- దీని తర్వాత, ఆధార్‌తో అనుసంధానమైన మీ (రిజిస్టర్డ్) మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ లేదా OTP వస్తుంది. UIDAI సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వాలంటే, సంబంధిత బాక్స్‌లో ఆ OTPని ఎంటర్ చేయండి.
- ఇప్పుడు మీరు మీ పర్సనల్ పేజీలోకి లాగిన్ అవుతారు. ఇక్కడ, ఆధార్ కార్డ్ అడ్రెస్ చేంజ్ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ 'అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఆ తర్వాత, 'ఆధార్ డేటా ఫైల్' కింద చూపిన ఆప్షన్ల నుంచి 'అడ్రెస్' అన్నదానిని ఎంచుకోండి.
- ఆ తర్వాత, మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ చిరునామాలో మార్పులు చేయవచ్చు. మార్చిన చిరునామా ఆధార్ కార్డ్ మీద ఎలా కనిపిస్తుందని అన్నదానిని 'ప్రివ్యూ' కూడా చూసుకోవచ్చు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని తనిఖీ చేసుకున్న తర్వాత, మీ అభ్యర్థనను సబ్మిట్ చేయండి.
- మీ అభ్యర్థనను సబ్మిట్ చేసిన తర్వాత, మీరు పేమెంట్ పోర్టల్‌కు మీరు రీడైరెక్ట్ అవుతారు. చిరునామా అప్‌డేట్ చేయడానికి రూ. 50 రుసుమును ఇక్కడ చెల్లించాలి.
- మీరు UPI, నెట్ బ్యాంకింగ్ లేదా అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు పద్ధతుల ద్వారా రూ. 50 చెల్లించవచ్చు.
- డబ్బు చెల్లింపు ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత, మీకు అప్‌డేటెడ్ రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తుంది. ఇక్కడితో ఈ ప్రాసెస్ ముగిసినట్లే.
- ఆధార్ కార్డ్‌లో చిరునామా అప్‌డేట్ స్థితిని ఆన్‌లైన్ ద్వారా ట్రాక్ చేయడానికి ఈ URN నంబర్‌ని ఉపయోగించవచ్చు. అలాగే, మీ చెల్లింపు రసీదును డౌన్‌లోడ్ లేదా ప్రింట్ చేయడం మరిచిపోవద్దు.
- కొత్త చిరునామా ఉన్న ఆధార్ కార్డ్‌ను 90 రోజుల్లోపు మీరు అందుకుంటారు.