Cash Rules For Income Tax: ఎంత నగదును ఇంట్లో ఉంచుకోవచ్చు? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి?
కొందరు, బ్యాంకులో జమ చేయకుండా చాలా పెద్ద మొత్తంలో నగదును ఇంట్లోనే ఉంచుకుని, ఆదాయ పన్ను అధికారులకు పట్టుబడుతున్నారు.
Cash Rules For Income Tax: ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును ఉంచే అలవాటు మీకు ఉంటే, అది మీకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ప్రతి రోజు బ్యాంకులో నగదు డిపాజిట్ చేసినా, తరచూ తమ ఇంటి వద్ద కూడా నగదు ఉంచుకోవాల్సి వస్తుంది. కొందరు, బ్యాంకులో జమ చేయకుండా చాలా పెద్ద మొత్తంలో నగదును ఇంట్లోనే ఉంచుకుని, ఆదాయ పన్ను అధికారులకు పట్టుబడుతున్నారు. మీరు అలాంటి పొరపాటు చేయవద్దు.
ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం.. మీరు మీ ఇంట్లో ఉంచుకోదగిన నగదుకు ఒక పరిమితి ఉంది. గత కొన్ని నెలలుగా కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ, కొందరి ఇళ్లలో భారీగా నగదు దాచినట్లు అధికారులు గుర్తించారు. ప్రతి రోజూ కోట్లాది రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు, సంబంధిత వ్యక్తుల మీద కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో, ఒక వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే, ఆ వ్యక్తి తన ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అన్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా తలెత్తాయి.
ధనం పట్టుబడితే మూలం గురించి చెప్పాల్సిందే
ఒకవేళ, ఎవరైనా భారీగా నగదు నిల్వ చేసి దర్యాప్తు సంస్థకు పట్టుబడితే, ఆ నగదు తన దగ్గరకు ఎలా వచ్చిందన్న అన్ని ఆధారాలను సంబంధిత వ్యక్తి అధికారులకు సమర్పించాలి. ఆ డబ్బును అతను సరైన మార్గంలో సంపాదించినట్లయితే, దానికి సంబంధించి పూర్తి ధ్రువపత్రాలను కలిగి ఉండాలి. నగదుకు సంబంధించిన మూలాలను చెప్పలేకపోతే... ED, CBI, Income Tax వంటి సంస్థలు చర్యలు తీసుకుంటాయి.
జరిమానా ఉంటుంది
లెక్కల్లో చూపని నగదు ఎవరి వద్దయినా పట్టుబడితే ఎంత జరిమానా చెల్లించాలి?. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) రూల్స్ ప్రకారం 137 శాతం వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అంటే, పట్టుబడిన నగదు కంటే ఎక్కువ మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయాలను మర్చిపోకుండా గుర్తుంచుకోండి
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే జరిమానా విధించవచ్చు.
ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ నంబర్ ఇవ్వాలి.
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయల నగదు డిపాజిట్ చేస్తే, అతను పాన్ (PAN), ఆధార్ (Aadhaar) గురించి సమాచారం ఇవ్వాలి.
పాన్, ఆధార్ గురించి సమాచారం ఇవ్వకపోతే రూ. 20 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదుతో షాపింగ్ చేయకూడదు.
రూ. 2 లక్షలకు మించి నగదు రూపంలో కొనుగోళ్లు జరిపితే పాన్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది.
రూ. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు & అమ్మకం చేసిన వ్యక్తి, దర్యాప్తు సంస్థ దృష్టిలోకి వెళ్లవచ్చు.
క్రెడిట్ & డెబిట్ కార్డ్ కార్డ్ చెల్లింపు సమయంలో, ఒక వ్యక్తి రూ. 1 లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినట్లయితే అతని మీద ఆదాయ పన్ను విభాగం విచారణ చేయవచ్చు.
1 రోజులో మీ బంధువుల నుంచి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు రూపంలో తీసుకోకూడదు. ఇది బ్యాంకు ద్వారా జరగాలి.
నగదు రూపంలో విరాళం ఇచ్చే పరిమితిని రూ. 2,000గా నిర్ణయించారు.
ఏ వ్యక్తి మరో వ్యక్తి నుంచి నగదు రూపంలో 20 వేలకు మించి రుణం తీసుకోకూడదు.
ఒక బ్యాంకు నుంచి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే (Withdraw) చేస్తే TDS చెల్లించాల్సి ఉంటుంది.