Goldman Sachs: యూకేలో భారీ మాంద్యం తప్పదట, వృద్ధి అంచనాలో కోత
UK ఆర్థిక వృద్ధి వచ్చే ఏడాది 1 శాతం తగ్గిపోతుందని ఆ రిపోర్ట్‌లో వెల్లడించింది. గతంలో ఈ అంచనా 0.4 శాతంగా ఉంది.
Goldman Sachs: అమెరికాలో ఆర్థిక మాంద్యం (Recession) తప్పదని ప్రపంచమంతా ఊగిపోతోంది. అక్కడ వరుసబెట్టి పన్ను రేట్లు పెంచడం ఈ బెట్స్‌కు బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) హఠాత్తుగా తెర మీదకు వచ్చింది.
యూకేలో భారీ ఆర్థిక మాంద్యం (Deeper Recession) తప్పదని, గతంలో ఊహించినదాని కంటే వేగంగా రిసెషన్‌లో కూరుకుపోతుందని అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs) హెచ్చరించింది. క్వాసీ క్వార్టెంగ్‌ను ఛాన్సలర్‌గా ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ తొలగించడం, మినీ బడ్జెట్ తేవడం, కార్పొరేట్ టాక్స్‌ల తగ్గింపు మీద మాట మార్చడం వంటి అంశాల నేపథ్యంలో, బ్రిటన్ ఎకనమిక్ ఔట్‌లుక్‌ని గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషకులు తగ్గించారు.
ఆర్థిక వృద్ధి మరింత వేగంగా బలహీనపడడం, వచ్చే ఏప్రిల్ నుండి ఎక్కువ కార్పొరేట్ పన్ను కారణంగా UK వృద్ధి దృక్పథాన్ని మరింత తగ్గించాం, మరింత లోతైన మాంద్యాన్ని ఆశిస్తున్నాం. - గోల్డ్‌మన్ సాచ్స్
డౌన్ గ్రేడ్
ఆదివారం విడుదల చేసిన విశ్లేషణలో, బ్రిటన్ బ్రిటన్ ఆర్థిక వృద్ధి అంచనాను గోల్డ్‌మన్ సాచ్స్ తగ్గించింది. UK ఆర్థిక వృద్ధి వచ్చే ఏడాది 1 శాతం తగ్గిపోతుందని ఆ రిపోర్ట్‌లో వెల్లడించింది. గతంలో ఈ అంచనా 0.4 శాతంగా ఉంది. 2023 చివరిలో ప్రధాన ద్రవ్యోల్బణం 3.1 శాతం వద్ద ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ పేర్కొంది. గత అంచనా 3.3 శాతం నుంచి కాస్త తగ్గించింది.
హామీపై యూటర్న్
బ్రిటన్ కార్పొరేషన్ పన్నును 19 శాతం వద్ద ఆపేస్తామని ఎన్నికల ప్రచారం లిజ్‌ట్రస్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీపై యూటర్న్ తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కార్పొరేట్ పన్నులను 25 శాతానికి పెంచుతామని శుక్రవారం వెల్లడించారు.
సామాన్యుడికి తప్పిన వాత
కార్పొరేట్ పన్ను ప్రణాళికల నుంచి ట్రస్ వెనక్కి తగ్గడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మీద ఒత్తిడి తగ్గింది. కార్పొరేట్ టాక్స్‌లు పెంచేది లేదని గతంలో ట్రస్ చెప్పడంతో, ఆ భారాన్ని సామాన్యులపై రుద్దేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సిద్ధమైంది. ట్రస్ మాట మార్చడంతో, ఎక్కువ రేటు పెంపు జోలికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెళ్లకపోవచ్చు. నవంబర్‌లో జరిగే బ్యాంక్ తదుపరి సమావేశంలో, వడ్డీ రేటును 0.75 శాతం (75 బేసిస్ పాయింట్లు) పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్స్, డ్యుయిష్ బ్యాంక్ (Deutsche Bank), బార్ల్కేస్ (Barclays) తాజాగా అంచనా వేశాయి. గతంలో అవి వేసిన అంచనా 1 శాతం (100 బేసిస్ పాయింట్లు) కంటే తాజా అంచనా తగ్గింది. UK వడ్డీ రేట్లు ఇప్పుడు 4.75 శాతం వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంటాయని గోల్డ్‌మన్ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. ఇది గతంలోని అంచనా 5 శాతం కంటే 25 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంది.
గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్ట్ నేపథ్యంలో.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే యూరోపినయ్ స్టాక్ మార్కెట్ల మీద ఒత్తిడి ఉండవచ్చు. ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్ల మీదా కనిపించవచ్చు. కాబట్టి, లాంగ్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్లు అప్రమత్తంగా ఉంటే మంచిది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.