GO First: ఈ నెల 24 నుంచి మళ్లీ ఎగరనున్న గో ఫస్ట్ ఫ్లైట్స్, ఈసారి కొన్ని మార్పులు!
ప్రయాణీకులను క్షమాపణ చెప్పింది, టికెట్ల డబ్బులను త్వరలోనే రిఫండ్ చేస్తామని వివరించింది.
GO First: అప్పులు చెల్లించలేక దివాలా తీసిన చౌక ధరల విమానయాన సంస్థ "గో ఫస్ట్", తన విమాన సేవలను మళ్లీ ప్రారంభించాలని యోచిస్తోంది. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, విమానయాన సంస్థ ఈ నెల 24 నుంచి విమాన సేవలను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉంది. అయితే, ఈసారి పరిమిత సంఖ్యలో మాత్రమే విమానాలను నడుపుతుందని సమాచారం.
స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం NCLTకి దరఖాస్తు సమర్పించే తేదీ నాటికి, అంటే ఈ నెల 2వ తేదీ వరకు మొత్తం 27 విమానాలతో సేవలు అందించింది. దిల్లీ విమానాశ్రయంలో 51, ముంబై విమానాశ్రయంలో 37 డిపార్చర్ స్లాట్స్ ఈ సంస్థ కింద ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు గతంలో ప్రకటించిన ఈ ఎయిర్‌లైన్స్, తాజాగా ఆ తేదీని 19 వరకు పొడిగించింది. ప్రయాణీకులను క్షమాపణ చెప్పింది, టికెట్ల డబ్బులను త్వరలోనే రిఫండ్ చేస్తామని వివరించింది.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమాన సంస్థపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు NCLT అంగీకరించడంతో, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు భారీ ఊరట లభించింది. స్వచ్ఛంద దివాలా పిటిషన్‌లో గో ఫస్ట్ అభ్యర్థించినట్లుగా, ఆర్థిక పరమైన వ్యవహారాలపై తాత్కాలిక ఆంక్షలు (మారటోరియం) విధించింది, ఆర్థిక పరమైన రక్షణ అందించింది. దీంతో, ఈ విమానయాన సంస్థకు విమానాలను లీజుకు ఇచ్చిన కంపెనీలు ఆ విమానాలను వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. ఈ నేపథ్యలో, 23 విమానాలతో ఫ్లైట్ సర్వీసులను పునఃప్రారంభించే యోచనలో గో ఫస్ట్ ఉన్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది.
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) నిర్ణయాలు:
కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ఎక్స్‌పర్ట్‌గా (IRP) గోఫస్ట్ సూచించిన అభిలాశ్ లాల్‌నే నియమించిన NCLT, తక్షణం బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ఆదేశించింది. దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు NCLT అంగీకరించడంతో, గో ఫస్ట్ డైరెక్టర్ల బోర్డు రద్దయింది. ఇకపై కంపెనీ కార్యకలాపాలను IRP నిర్వహిస్తారు. దివాలా పరిష్కార ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా, NCLT ఆదేశం అమలయ్యేలా చూస్తారు.
ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఉద్యోగులెవరినీ తొలగించవద్దని తన తీర్పులో భాగంగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌ను NCLT ఆదేశించింది. అంటే, కంపెనీ ఆర్థిక కష్టాల్లో ఉన్న కారణం చూపి ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడానికి వీలుండదు. ఒకవేళ, ఏదైనా కారణంగా ఉద్యోగిని తొలగించాల్సిన పరిస్థితి వస్తే, ముందుగా తమకు తెలియజేయాలని కూడా ఆదేశించింది.
NCLT ఆర్డర్ తర్వాత, "గో ఫస్ట్" CEO కౌశిక్ ఖోనా మాట్లాడారు. దీనిని చారిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. సంస్థ తిరిగి గాడిన పడేందుకు సరైన సమయంలో వచ్చిన నిర్ణయంగా అభివర్ణించారు.
కాంట్రాక్టులు, అప్పులపై తిరిగి చర్చలు జరపడానికి ఒక భారతీయ విమానయాన సంస్థ స్వచ్ఛందంగా దివాలా రక్షణను కోరడం భారతదేశంలో ఇదే మొదటిసారి.