Gautam Adani: ప్రపంచ టాప్-3 ధనవంతుడిగా ఆదానీ, ఆయన్ని సైతం వెనక్కి నెట్టేసినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడి
గౌతమ్ ఆదానీ, ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ను వెనక్కి నెట్టారు. ఆదానీకి ముందు ఒకటి, రెండో స్థానాల్లో టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్, అమేజాన్ అధినేత జెఫ్ బేజోస్ ఉన్నారు.
Bloomberg Billionaires Index: భారతీయ సంపన్నుడు గౌతమ్ ఆదానీ ప్రపంచ కుబేరుల్లోనే మూడో స్థానానికి ఎగబాకారు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద సంపన్నుడిగా ఎదిగారు. బ్లూమింగ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇలా ఆసియాకు చెందిన ఒక వ్యక్తి బ్లూమింగ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) లో ప్రపంచ టాప్ 3 సంపన్నుల్లో చోటు సంపాదించుకోవడం ఇదే తొలిసారి.
137.4 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ ఆదానీ, ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ను వెనక్కి నెట్టారు. ఇక గౌతమ్ ఆదానీకి ముందు ఒకటి, రెండో స్థానాల్లో టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk), ఆమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ (Jeff Bezos) ఉన్నారు.
బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ఫ్రెంచ్ బిజినెస్ మాగ్నెట్, పెట్టుబడిదారు, కళాభిమాని. ఆయన ప్రపంచ లగ్జరీ గూడ్స్ కంపెనీ అయిన LVMH Moet Hennessy – Louis Vuitton SE కు కో - ఫౌండర్, ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యుటివ్ హోదాల్లో ఉన్నారు.
11వ స్థానంలో ముకేశ్ అంబానీ
పోయిన నెలలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ (Bill Gates) ను సైతం దాటేసి, గౌతమ్ ఆదానీ (Gautam Adani) నాలుగో స్థానాన్ని చేరుకున్నారు. ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఆదానీ సంపదలో ఏకంగా 36 బిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది. తొలుత ఏసియన్ రిచెస్ట్ పర్సన్ అయిన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ని వెనక్కి తోసిన ఆదానీ, తర్వాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ను గత నెలలో అధిగమించారు. 91.9 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.
ఆదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన అమెరికా బిలియనీర్‌లలో కొందరిని అధిగమించగలిగారు. ఎందుకంటే వారు ఇటీవల వారి దాతృత్వాన్ని పెంచుకున్నారు. బిల్ గేట్స్ (Bill Gates) జూలైలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు (Bill and Melinda Gates Foundation) 20 బిలియన్ డాలర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటు వారెన్ బఫెట్ ఇప్పటికే 35 బిలియన్ డాలర్లకు పైగా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు.
భారీ విరాళం ప్రకటించిన ఆదానీ, కానీ..
అదానీ కూడా తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక ప్రయోజనాల కోసం 7.7 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తానని జూన్‌లో ప్రకటించారు. అయితే, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి లావాదేవీ జరిగినట్లు ప్రకటించలేదు. 60 ఏళ్ల ఆదానీ గత కొన్ని సంవత్సరాలుగా తన బొగ్గు, ఓడరేవుల వ్యాపారాన్ని విస్తరించారు. డేటా సెంటర్ల నుండి సిమెంట్, మీడియా అల్యూమినా వరకు ప్రతిదానిలో అడుగు పెట్టారు. ఇప్పుడు ఆదానీ గ్రూప్ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్, విమానాశ్రయ ఆపరేటర్, సిటీ-గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, బొగ్గు మైనర్‌ను కలిగి ఉంది.