Freshworks Nasdaq Listing: కోటీశ్వరులైన 500+ ఉద్యోగులు... ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్‌వేర్ సంచలనం!
అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైన భారత తొలి సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ కంపెనీగా 'ఫ్రెష్‌వర్క్స్' రికార్డు సృష్టించింది. కంపెనీలో పనిచేస్తున్న 500కు పైగా భారతీయ ఉద్యోగులు కోటీశ్వరులు అయ్యారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీ 'ఫ్రెష్‌వర్క్స్' అద్భుతం చేసింది. బుధవారం నాస్‌డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజీలో ఆ కంపెనీ బిలియన్ డాలర్ల ఐపీవో విజయవంతమైంది. దాంతో అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైన భారత తొలి సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ కంపెనీగా రికార్డు సృష్టించింది. మరో విశేషం ఏంటంటే ఈ ఐపీవోతో కంపెనీలో పనిచేస్తున్న 500కు పైగా భారతీయ ఉద్యోగులు కోటీశ్వరులుగా అవతరించారు.
Also Read: Gold-Silver Price: మరింత పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో ఇంకా.. వెండి కూడా అదే దారిలో..
ఫ్రెష్‌వర్క్స్ సంస్థను గిరీశ్ మాతృభూతమ్, షాన్ కృష్ణసామి 2010లో భారత్‌లో ఆరంభించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆ తర్వాత కాలిఫోర్నియాలోని సాన్ మాటియోకు తరలించారు. అయితే చెన్నై నుంచే ఎక్కువ మంది ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం ప్రత్యేకం. వంద కోట్ల డాలర్లు సమీకరించేందుకు బుధవారం ఐపీవోకు వెళ్లగా అంచనాలను మించి విజయవంతం అయింది. ఫ్రెష్‌వర్క్స్ షేర్లు ఏకంగా 32 శాతం ఎగిశాయి. సెషన్ ముగిసే సరికి షేరు ధర 47.55 డాలర్ల వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ 13 బిలియన్ డాలర్లకు చేరుకుంది.z
'ఈ రోజు మా కల నిజమైంది. తిరుచి నుంచి మొదలైన మా ప్రస్థానం నాస్‌డాక్‌లో ఐపీవో వరకు వెళ్లింది. మా ఉద్యోగులు, వినియోగదారులు, భాగస్వాములు, పెట్టుబడిదారులకు మా కృతజ్ఞతలు. వారంతా మాపై నమ్మకం ఉంచారు' అని ఫ్రెష్‌వర్క్స్ సహ వ్యవస్థాపకులు మాతృభూతమ్ అన్నారు.
ఈ ఐపీవో వల్ల 500కు పైగా ఫ్రెష్‌వర్క్స్ భారతీయ ఉద్యోగులు కోటీశ్వరులు అయ్యారు. అందులో 70 మంది వయసు 30 ఏళ్లలోపే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 4300 మంది ఉద్యోగులు ఉండగా అందులో 76 శాతం మంది వద్ద సంస్థ షేర్లు ఉన్నాయి. అసెల్, సెక్వోఇయా క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టగా భారత్‌లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ప్రతిభావంతులు పనిచేస్తున్నారు.
'మేం 45 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో 52వేల మంది వినియోగదారులు ఉన్నారు. వారిలో 13వేల మంది ఏటా ఐదువేల డాలర్లకు పైగా ఆదాయం అందిస్తున్నారు. ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఈ స్థాయికి ఎదగడమే నాకు అత్యంత ఆనందాన్ని ఇస్తోంది. ఎంతోమంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, కంపెనీలు ఐపీవోకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్ నుంచి మరెన్నో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రానున్నాయి' అని మాతృభూతమ్ అన్నారు.
Today is a dream come true for me - from humble beginnings in #Trichy to ringing the bell at @Nasdaq for the FreshWorks IPO. Thank you to our employees, customers, partners, and investors for believing in this dream. #Freshworks #IPO #NASDAQ pic.twitter.com/fXz73YxXXR
— Girish Mathrubootham (@mrgirish) September 22, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి