Fitch Ratings: అమెరికాకు 'ఫిచ్' రేటింగ్ దెబ్బ! US ఎకానమీకి వరుస షాకులు!
Fitch Ratings: అమెరికా.. అగ్రరాజ్యం.. నంబర్ వన్ కంట్రీ! అక్కడ పెట్టుబడి పెడితే డబ్బుల పంట పండుతుందన్న నమ్మకం! కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.
Fitch Ratings:
అమెరికా.. అగ్రరాజ్యం.. నంబర్ వన్ కంట్రీ! అక్కడ పెట్టుబడి పెడితే డబ్బుల పంట పండుతుందన్న నమ్మకం! కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఫిచ్ రేటింగ్స్ యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. AAA నుంచి AA+ కు సవరించింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా అపనమ్మకం, ఆందోళన మొదలయ్యాయి. రాబోయే మూడేళ్లలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని ఫిచ్ అంచనా వేయడం కలకలం రేపుతోంది.
ఫిచ్ రేటింగ్ (Fitch Rating) సంస్థ అమెరికా రేటింగ్‌ను (US Credit Rating) తగ్గించడం 2011లో ప్రభుత్వ అప్పుల పరిమితి నేపథ్యంలో స్టాండర్డ్ అండ్ పూర్ (S&P) చర్యను తలపించింది. అనిశ్చితి వల్ల అప్పుడు యూఎస్ ట్రెజరీ రుణాల ఖర్చు 1.3 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుత పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. రేటింగ్ తగ్గించడం వల్ల అమెరికా అప్పుల భారం మరింత పెరగనుంది. రుణాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేయడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరిచింది.
'పన్నులు తగ్గించడం, కొత్త ప్రాజెక్టులకు ఖర్చు చేయడం, ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి వంటివి అమెరికా బడ్జెట్ లోటును మరింత పెంచాయి. మధ్యకాలిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలేమీ లేవు. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడం రాబోయే మూడేళ్లలో ఆర్థిక క్షీణతను ప్రతిబింబిస్తోంది' అని ఫిచ్ తెలిపింది. గత 20 ఏళ్లుగా పాలనా ప్రమాణాలు క్రమంగా పడిపోయాయని నొక్కి చెప్పింది. రుణ పరిమితి విషయంలో ఆఖరి నిమిషం వరకు రాజకీయ అనిశ్చితి కొనసాగుతోందని వెల్లడించింది.
అమెరికా అప్పుల భారం 2025 నాటికి జీడీపీలో 118 శాతానికి పెరుగుతుందని ఫిచ్ అంచనా వేసింది. AAA రేటింగ్ సరాసరి 39.3 శాతానికి ఇది 2.5 రెట్లు ఎక్కువని వివరించింది. జీడీపీతో పోలిస్తే అప్పుల నిష్పత్తి మరింత పెరగడం సుదీర్ఘ కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించేందుకు కారణం అవుతుందని తెలిపింది. భవిష్యత్తులో ఇది మరిన్ని షాకులు ఇస్తాయని వివరించింది.
అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఫిచ్ తగ్గిండంపై రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. 'అమెరికా వాసులు, ఇన్వెస్టర్లు, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అమెరికా ఎంత పటిష్ఠంగా ఉందో తెలుసు. ఫిచ్ నిర్ణయం వారిపై ఎలాంటి ప్రభావం చూపించదు. ప్రాథమికంగా అమెరికా ఎంతో పఠిష్టంగా ఉంది. ట్రెజరీ సెక్యూరిటీ ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యున్నతంగా ఉన్నాయి' అని యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ జానెట్ యెలెన్ అన్నారు. మిగతా ఆర్థిక వేత్తలూ ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్న డెమొక్రాట్లు, ప్రతిపక్షంలో ఉన్న రిపబ్లికన్లు మాత్రం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అమెరికా ఇలాంటి స్థితికి దిగజారడానికి 'బైడెనామిక్స్' కారణమని రిపబ్లికన్లు అంటున్నారు. అప్పుల పరిమితి అంశం సహా అన్నింట్లోనూ విఫలమయ్యారని ఆరోపించారు. డౌన్‌గ్రేడింగ్‌కు డొనాల్డ్ ట్రంప్ కారణమని డెమొక్రాట్లు అంటున్నారు. ఫిచ్ రేటింగ్ ప్రమాణాల్లో బైడెన్ ప్రభుత్వం మెరుగ్గా ఉందని పేర్కొంటున్నారు.
అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడం వల్ల రెండేళ్ల ట్రెజరీ యీల్డులు మూడు బేసిస్ పాయింట్ల మేర తగ్గి 4.87 శాతానికి చేరుకుంది. పదేళ్ల అమెరికా బాండ్లు ఒక బేసిస్ పాయింటు మేర పతనమై 4.01 శాతం వద్ద ఉన్నాయి. ఇక 30 ఏళ్ల అమెరికా డెట్ యీల్డు చివరి తొమ్మిది నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. డోజోన్స్, నాస్‌డాక్, ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ ఫ్యూచర్స్ సూచీలు క్రాష్ అయ్యాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల పైనా ఇలాంటి ప్రభావమే నెలకొంది.
Also Read: అమెరికా క్రెడిట్ రేటింగ్ ఢమాల్! స్టాక్ మార్కెట్లలో ముసలం!