Investment Plan: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారా?, పర్‌ఫెక్ట్ పోర్ట్‌ఫోలియో కోసం ఈ స్ట్రాటెజీ ట్రై చేయొచ్చు!
భారతదేశ మార్కెట్ల వాల్యుయేషన్లను ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చడం సరికాదు. ఇతర దేశాలతో పోల్చడమంటే.. పావలా కోసం ఆశపడి ముప్పావలా పోగొట్టుకోవడంతో సమానం.
Investment Plan: స్టాక్ మార్కెట్ పండితుడు, Elixir Equities Pvt. Ltd. వ్యవస్థాపకుడు & డైరెక్టర్ దీపన్ మెహతా (Dipan Mehta) ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం ఇది. అపార అనుభవంతో ఆయన ఇచ్చిన విలువైన సూచనలు, చెప్పిన అభిప్రాయాలను ఒక కథనంగా మార్చి, మన తెలుగు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం "abp దేశం" అందిస్తోంది.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు కొన్ని నెలలుగా పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్ 60 వేలు, నిఫ్టీ50 18 వేల మార్క్ పైకి మళ్లీ చేరాయి. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, వడ్డీ రేట్ల పెంపుదల, ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు మొదలైన కష్ట దశలను మార్కెట్లు జీర్ణించుకుని, మళ్లీ ఈ స్థాయికి పెరిగాయి. కాబట్టి కష్టమైన దశలన్నింటినీ మార్కెట్ డిస్కౌంట్ చేసిందనే భావిస్తున్నాం. కానీ మరికొన్ని గూగ్లీలు మిగిలి ఉన్నాయి. హఠాత్తుగా ఏదైనా కంపెనీ విఫలమవ్వడం, సార్వభౌమ రుణ స్థాయిలు పెరగడం వంటివి ఇంకా ఉన్నాయి. మార్కెట్ ఇంకా వాటిని జీర్ణించుకోలేదు. అనుకోని వార్తలు వినే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు అప్పుడు మళ్లీ నేల చూపులు చూస్తాయి.
యుద్ధం తీవ్రతరం కావడం, ముడి చమురు $110కి మించి పెరగడం కూడా ప్రైసింగ్ కాలేదు. అంటే, ఈ వార్తలకు తగ్గ క్షీణత మార్కెట్‌లో ఇంకా కనిపించలేదు. కాబట్టి, ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచాలని భావిస్తున్న ఇన్వెస్టర్లు అలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి.
భారతదేశ మార్కెట్ల వాల్యుయేషన్లను ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చడం సరికాదు. మన దేశంలో వైవిధ్యం ఉంటుంది. కంపెనీల నాణ్యత, కార్పొరేట్ ప్రమాణాలు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే... అవకాశాల పరిమాణం, పరిధి ఇక్కడ చాలా ఎక్కువ. మనలాంటి దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం, రాజకీయ స్థిరత్వం సాధారణంగా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉండవు. కాబట్టి, ఇతర దేశాలతో పోల్చడమంటే.. పావలా కోసం ఆశపడి ముప్పావలా పోగొట్టుకోవడంతో సమానం.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటివరకు బాగానే ఉంది. కీలకమైన అంశాలు ఏమిటంటే... కరోనా కాలంలోని కనిష్ట స్థాయుల నుంచి కోలుకుంటున్న కార్పొరేట్ మార్జిన్‌లు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. పండుగ సీజన్ వరకు డిమాండ్ స్థిరంగా ఉంది. క్యాపెక్స్ (capex) సైకిల్ బలంగా ఉంది. మౌలిక వసతుల కల్పన మెరుగుపడుతోంది.
ఫలితాలకు సంబంధించి పెద్ద నిరాశలు లేవు. కానీ, మంచి రిజల్ట్స్ పోస్ట్ కంపెనీల షేరు ధరలు కూడా పడిపోతున్నాయి. బహుశా పెట్టుబడిదారుల అంచనాలు అంతకన్నా ఎక్కువగా ఉండి ఉండవచ్చు. విదేశీ అప్పులు ఎక్కువగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండడం మంచిది.
బ్యాంక్ - ఆటో
బ్యాంక్‌లకు ఇది స్వర్ణ యుగం. క్రెడిట్‌కు మంచి డిమాండ్ పెరుగుతోంది, క్రెడిట్ ఖర్చులు తగ్గుతున్నాయి.
ఆటో ఇండస్ట్రీ విషయానికి వస్తే.. చాలా సవాళ్ల కారణంగా కొన్నేళ్లుగా అండర్‌పెర్‌ఫార్మర్‌గా ఉంది. ఇప్పుడు కాలం మారింది. పెరుగుతున్న డిమాండ్, అధిక పట్టణ వ్యయం, పరిశ్రమ ఫండమెంటల్స్ మెరుగుపడడం వంటివి వాహన అమ్మకాలను పెంచుతున్నాయి. ముడి వస్తువుల ధరలు, సెమీకండక్టర్ కొరత తగ్గాయి. కాబట్టి, రాబోయే కొన్ని త్రైమాసికాలు వాహన పరిశ్రమకు అత్యుత్తమ కాలంగా ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజీ
ఒకవేళ ఎవరైనా 10 లక్షల రూపాయలను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టాలనుకుంటే.. బ్యాంకుల్లో 35-40%, మిడ్ క్యాప్ సాఫ్ట్‌వేర్‌లో 15%, ఆటోలో 15%, ప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్ కంపెనీల్లో 15%, న్యూ-ఏజ్ డిజిటల్ కంపెనీల్లో 10% పెట్టుబడితో మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది.
నో గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్స్
స్వర్ణ కాంతి తగ్గింది. బంగారం మీద పెట్టుబడులు ఇప్పుడు సేఫ్ హెవెన్ కాదు. ఆర్థిక సంక్షోభం లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయంలో ఇవి పెద్ద నిరాశ మిగిల్చాయి. కాబట్టి, పెట్టుబడి తరగతిగా బంగారానికి సున్నా మార్కులు వేయవచ్చు. బంగారాన్ని ఈక్విటీలతో పోల్చవద్దు, రెండిటికీ పోలిక లేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.