Edible Oil Price Cut: కస్టమర్లకు గుడ్‌న్యూస్! 15% తగ్గిన వంట నూనె ధరలు
వంట నూనెలపై 17.5 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 12.5 శాతానికి తగ్గించడంతో వినియోగదారులకు ఊరట కలిగింది. అంతర్జాతీయంగా పెరిగిన నూనెల ధరలు ప్రజలు, పాలకులను ఇబ్బంది పెట్టాయని ఎస్‌ఈఏ తెలిపింది.
కస్టమర్లకు గుడ్‌న్యూస్! కొండెక్కిన వంట నూనె ధరలు తగ్గనున్నాయి. ఎమ్మార్పీపై 10-15 శాతం వరకు ధరలు తగ్గించామని వంట నూనెల ఉత్పత్తి, సరఫరా సంఘం (SEA) తెలిపింది. అదానీ విల్మర్, రుచి సోయా వంటి ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులపై 15 శాతం వరకు ధరలు తగ్గించి కస్టమర్లకు కాస్త రిలీఫ్ ఇచ్చాయి.
'వంట నూనె సరఫరా చేస్తున్న మా ప్రధాన సభ్యులు ఎమ్మార్పీని తగ్గించారని చెప్పేందుకు సంతోషంగా ఉంది. ఈ పండుగ సీజన్లో 10-15 శాతం వరకు ధరలు తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్పించాం' అని ఎస్‌ఈఏ ప్రకటించింది.
వంట నూనెలపై 17.5 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 12.5 శాతానికి తగ్గించడంతో వినియోగదారులకు ఊరట కలిగింది. అంతర్జాతీయంగా పెరిగిన నూనెల ధరలు దేశంలోని వినియోగదారులు, పాలకులను ఇబ్బంది పెట్టాయని ఎస్‌ఈఏ తెలిపింది. దాంతో కొన్ని నెలలుగా ధరలు బాగా పెరిగాయని వెల్లడించింది. ఈ భారాన్ని తగ్గించేందుకు రిఫైన్డ్, ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం చాలా సార్లు తగ్గించిన విషయం గుర్తు చేసింది.
తగ్గించిన దిగుమతి సుంకానికి తగినట్టుగానే వంటనూనెల ఎమ్మార్పీ తగ్గించాలని పరిశ్రమ వర్గాలను కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే కోరారు. గతేడాది డిసెంబర్లోనే దిగుమతి సుంకాన్ని 17.5 నుంచి 12.5 శాతం వరకు తగ్గించిన విషయం గుర్తు చేశారు. 2022, మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇక సరఫరా పెంచేందుకు 2022, డిసెంబర్ వరకు అన్ లైసెన్స్‌డ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకొనేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా ముడి పామ్ ఆయిల్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపైకొత్త డెరివేటివ్ కాంట్రాక్టులు ఆవిష్కరించడాన్ని నిషేధించారు.
భారత్‌లో 65 శాతం వరకు దిగుమతి చేసిన వంట నూనెల పైనే ఆధారపడుతున్నారు. మొత్తం వినియోగంలో దీని వాటా 22-22.5 మిలియన్ టన్నులు ఉంటుంది. గిరాకీ, సరఫరా మధ్య లోటును పూరించేందుకు 13-15 మిలియన్ టన్నుల ముడి నూనెను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అదానీ విల్మర్ (ఫార్చూన్ బ్రాండ్స్), బుంగె, రుచి సోయా, ఇమామీ, జెమిని, ఫ్రిగోరిఫికో అలనా, కోఫ్కో, గోకుల్ ఆగ్రో వంటి కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరలు తగ్గించాయి.
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
Also Read: Budget 2022: 3 ఏళ్ల బ్యాంకు FDకి పన్ను వద్దు ప్లీజ్! బ్యాంకర్ల డిమాండ్!!