Digital Transactions: జనం జేబుల్లోంచి డబ్బులు తీయడం లేదట, మరి ₹వేల కోట్ల వస్తువులెలా కొంటున్నారబ్బా!
దీపావళి వారంలో నగదు చలామణీ తగ్గిందట. అది కూడా, ఏకంగా రూ. 7,600 కోట్ల మేర వాడకం పడిపోయింది.
Digital Transactions: పండుగ సీజన్‌లో జనం భారీ స్థాయిలో షాపింగ్ చేశారు. అటు ఆఫ్‌లైన్ - ఇటు ఆన్‌లైన్ కలిపి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చేతిలో పట్టుకునే సెల్ ఫోన్ల నుంచి, ఒంటిపై వేసుకునే నగల వరకు - డోర్ మ్యాట్ల నుంచి డోర్ స్టెప్స్ ముందు ఆగే కారు వరకు ఆర్డర్లు పెట్టారు. అక్టోబర్ నెలలోనే దసరా, దీపావళి రావడంతో పండుగ సరదా మరింత పెరిగింది. అక్టోబర్ నెలలో ఫెస్టివ్ సేల్స్ పీక్ స్టేజ్‌కు వెళ్లాయి.
జనం ఒక రేంజ్‌లో రెచ్చిపోయి కొంటే, ఒక ఆశ్చర్యకరమైన నివేదిక విడుదలైంది. దీపావళి వారంలో నగదు చలామణీ తగ్గిందట. అది కూడా, ఏకంగా రూ. 7,600 కోట్ల మేర వాడకం పడిపోయింది.
వాస్తవానికి, కొవిడ్ సమయంలో జనం రూపాయి బిళ్ల కూడా బయటకు తీయలేదు. కొవిడ్ తగ్గడం మొదలు కాగానే, డబ్బుల వినియోగం జీరో నుంచి హీరో స్థాయికి చేరింది. ఫెస్టివ్ మూడ్ పైస్థాయిలో ఉన్న దీపావళి వారంలో మాత్రం నోట్ల చలామణీ పడిపోవడం ఆశ్చర్యమే కదా!.
20 ఏళ్లలో తొలిసారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదిక ప్రకారం.. 2009 దీపావళి వారంలో నగదు చలామణీలో స్వల్ప పతనం కనిపించింది. అప్పుడు రూ. 950 కోట్ల మేర నోట్ల వినియోగం పడిపోయింది. ఆ ఒక్క సందర్భం తప్ప, ఆ తర్వాత మరెప్పుడూ క్షీణత కనిపించలేదు. అలాంటి పరిస్థితి నుంచి, ఈ ఏడాది ఒకేసారి రూ. 7,600 కోట్ల విలువైన నోట్ల వినియోగం తగ్గింది. నగదు వినియోగం ఇలా పడిపోవడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.
కరోనా తర్వాత కాలం మారింది. ప్రతి పని డిజిటల్ రంగు పులుముకుంటోంది. నగదు చలామణీ కూడా డిజిటల్ లావాదేవీల్లోకి వేగంగా మారిపోతోంది. జనమేమీ తక్కువ ఖర్చు పెట్టడం లేదు. భౌతిక నోట్ల వినియోగానికి బదులు డిజిటల్ ట్రాన్జాక్షన్లు వాడుతున్నారు. డబ్బులను చేతితో ఇచ్చే బదులు డిజిటల్ లావాదేవీల ద్వారా పంపుతున్నారు. ఈ ఏడాది డిజిటల్ లావాదేవీలు పెరగాయి కాబట్టి, నగదు చలామణీ తగ్గింది.
2002 తర్వాత, చెలామణిలో ఉన్న కరెన్సీ దీపావళి వారంలో క్షీణించడం ఇదే తొలిసారి. 2009లో ఆర్థిక మందగమనం కారణంగా స్వల్ప క్షీణత కనిపించిందని SBI నివేదిక వెల్లడించింది.
CICలో (currency in circulation) తగ్గుదల బ్యాంకులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనంగా మారుతుంది. బ్యాంకు డిపాజిట్లు పెరుగుతాయి.
డిజిటల్ చెల్లింపులు పెరగడానికి ప్రధాన కారణం UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగం పెరగడం. UPI/e వాలెట్ల ద్వారా చేసే చిన్నపాటి రిటైల్ చెల్లింపులు, దేశవ్యాప్తంగా జరిగే అన్ని రకాల చెల్లింపుల్లో 11-12% ఉంటాయి. ఈ లావాదేవీల విలువలో క్రెడిట్ & డెబిట్ కార్డ్‌ల వాటా ఫ్లాట్‌గా ఉంది. UPI చెల్లింపులు FY16లోని 0% (సున్నా) నుంచి FY22లో 16%కు పెరిగాయి.
SBI నివేదిక ప్రకారం... 2021 దీపావళి వారంలో కరెన్సీ వాడకం రూ. 44,000 కోట్లు, 2020 దీపావళి వారంలో రూ. 43,800 కోట్లు పెరిగింది. 2019లోనూ రూ. 580 కోట్లు పెరిగింది. 2022లో తగ్గింది.
డిజిటల్ చెల్లింపులు
చెల్లింపు వ్యవస్థలలో CIC వాటా FY16లోని 88% నుంచి FY22లో 20%కి తగ్గింది. FY27లో ఇది 11.2%కు పడుపోతుందని అంచనా. దీనికి బదులు డిజిటల్ లావాదేవీల వాటా FY16లోని 11.3% నుంచి ఏటా వృద్ధి చెందుతూ, FY22లో 80.4%కి చేరింది. FY27లో 88%కి చేరుకుంటుందని అంచనా.
విచిత్రమైన విషయం ఏంటంటే... దేశంలో కరెన్సీ ముద్రణ ఏటికేడు పెరుగుతూనే ఉన్నా, నోట్ల వాడకం మాత్రం తగ్గుతూ వస్తోంది. మరి, ముద్ర గుద్దిన డబ్బులన్నీ ఎటు వెళ్తున్నాయో ఏలినవారికే తెలియాలి.