Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా?, డూప్లికేట్ సంపాదించడానికి సులభమైన దార్లున్నాయి!
డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కూడా RTO ఆఫీస్‌నే ఆశ్రయించాలి.
Duplicate Driving License: మన దేశంలో కోట్లాది మందికి ఫోర్ వీలర్, కనీసం టూ వీలర్ ఉంది. అది కారైనా, బైకైనా... బండిని బయటకు తీయాలంటే రిజిస్ట్రేషన్, పొల్యూషన్ చెకప్, ఇన్సూరెన్స్ పేపర్లు, నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వీటిలో ఏ డాక్యుమెంట్ లేకపోయినా ఇబ్బందే. ట్రాఫిక్ పోలీసులకు దొరికితే చలానా రూపంలో భారీగా వదిలించుకోవాల్సి వస్తుంది. ఈ పేపర్లు మన దగ్గర ఉన్నా, ఒక్కోసారి వాటిని పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో.. ఒక వస్తువును ఎక్కడో పెట్టి మర్చిపోవడం లేదా పోగొట్టుకోవడం సర్వసాధారణంగా మారాయి.
మీ డ్రైవింగ్ లైసెన్స్ (DL) పోయినా లేదా పాడైనా... బండిని బయటకు ఎలా తీయాలా అని వర్రీ కావద్దు. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే సులభమైన దార్లు ఉన్నాయి.
ఒక వ్యక్తికి ఒరిజినల్ డ్రైవింగ్ లెసెన్స్‌ను రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) జారీ చేస్తుంది. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కూడా RTO ఆఫీస్‌నే ఆశ్రయించాలి. ఈ ప్రాసెస్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. డూప్లికేట్ లైసెన్స్ కోసం మళ్లీ డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదు.
మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినా, దొంగతనానికి గురైనా మొదట మీరు చేయాల్సిన పని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడం, FIR కాపీ పొందడం. ఒకవేళ మీ ఒరిజినల్ లైసెన్స్ పాడైపోయినా, చిరిగిపోయినా RTO ఆఫీస్‌లో దానిని అప్పగించాలి.
డూప్లికేట్ డ్రైవింగ్ లెసెన్స్ కోసం అప్లై చేయడానికి ముందు.. FIR కాపీ (ఒరిజినల్ DL పోయిన సందర్భంలో), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, మీ అడ్రస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్లు.
డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? (How to Apply Online for Duplicate Driving License?)
అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన వివరాలు పూరించాలి, LLD ఫామ్ సబ్మిట్ చేయాలి. డూప్లికేట్ కార్డ్ కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ఆ ఫామ్ ప్రింటవుట్ తీసుకోండి. మీకు ఒరిజినల్ డ్రైవింగ్ లెసెన్స్ జారీ చేసిన RTO ఆఫీస్‌కు వెళ్లి, ఆ ఫారంతో పాటు అవసరమైన పత్రాలను అందజేయాలి. అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత, మీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. ఈలోగా మీరు బండి నడపడం కోసం, చెల్లుబాటు అయ్యే తాత్కాలిక రిసిప్ట్ అందుతుంది.
డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? (How to Apply for Duplicate Driving License Offline?)
మీకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన RTO ఆఫీస్‌కు వెళ్లండి. LLD ఫామ్ పూర్తి చేసి, అవసరమైన అన్ని ప్రూఫ్ డాక్యుమెంట్స్ అందజేయండి. డూప్లికేట్ లైసెన్స్ కోసం కొంత రుసుము చెల్లించాలి. తాత్కాలిక డ్రైవింగ్ లైసెన్స్‌గా ఉపయోగపడే రిసిప్ట్‌ను అక్కడే మీకు ఇస్తారు. కొన్ని రోజుల్లో మీ ఇంటి అడ్రస్‌కు డూప్లికేట్ డ్రైవింగ్ లెసెన్స్ వస్తుంది.
మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసినా, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసినా... LLD ఫామ్ ద్వారా మీరు సమర్పించిన వివరాలు, సర్వర్‌లో ఇప్పటికే ఉన్న వివరాలతో క్రాస్ చెక్ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే మీకు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అందుతుంది.