Daily Hunt: VerSe Innovation సంస్థ రికార్డు! 5 బిలియన్ల విలువతో ఏకంగా 805 మిలియన్ డాలర్ల సమీకరణ
భవిష్యత్తులో ఈ నిధులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను (ML), లైవ్ స్ట్రీమింగ్, వెబ్ 3.0 వంటి కొత్త టెక్నాలజీ ప్రయోగాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని కంపెనీ ప్రకటించింది.
Daily Hunt, VerSe Innovation: ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ అయిన డైలీ హంట్ (Dailyhunt), షార్ట్ వీడియో యాప్ జోష్ (Josh) పేరెంట్ కంపెనీ VerSe Innovation స్వల్పకాలంలోనే వృద్ధిలో దూసుకుపోతోంది. 5 బిలియన్ల డాలర్ల విలువతో తాము 805 మిలియన్ డాలర్లను సమీకరించినట్లుగా తాజాగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల కొద్ది నెలలుగా టెక్నాలజీ స్టాక్‌లు ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ పెట్టుబడిదారుల నుంచి మద్దతు ఉందని పేర్కొంది.
భవిష్యత్తులో ఈ నిధులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను (ML), లైవ్ స్ట్రీమింగ్, వెబ్ 3.0 వంటి కొత్త టెక్నాలజీ ప్రయోగాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రయోగాలతో సంస్థ లోకల్ పోటీదారులైన షేర్ చాట్ (Sharechat) వంటివాటితో సహా అంతర్జాతీయ పోటీదారులైన ఇన్‌స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (YouTube) వంటి వాటితో పోటీ పడగలదు.
ఒక ఇండియన్ స్టార్టప్ ఈ స్థాయిలో నిధులు సమీకరించడంలో ఈ ఏడాదికి ఇదే తొలిస్థానంలో ఉన్నట్లు అయింది. డైలీ హంట్ (Daily Hunt) 805 మిలియన్ డాలర్లతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉండగా.. స్విగ్గీ (Swiggy) 700 మిలియన్లతో రెండో స్థానంలో ఉంది. పాలిగాన్ (Polygon), బైజుస్ (Byju's), యూనిఫోర్ (Uniphore) వంటి స్టార్టప్‌లు 400 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.
డైలీ హంట్ (Daily Hunt) దేశవ్యాప్తంగా దాదాపు 350 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. వీడియో యాప్ జోష్ (Josh) ప్లాట్‌ఫామ్ 150 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. ఈ నెల నుండి ఈ ప్లాట్ ఫామ్‌ను మానిటైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, పబ్లిక్ వైబ్ 5 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులతో కూడిన హైపర్‌లోకల్ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉంది.
సంస్థ ప్రస్థానమిదీ..
VerSe Innovation ను వీరేంద్ర గుప్తా, శైలేంద్ర శర్మ 2007లో స్థాపించారు. ఆ తర్వాత ఉమంగ్ బేడీ ఫిబ్రవరి 2018లో సంస్థలో చేరారు. టిక్ టాక్‌పై నిషేధం తర్వాత కంపెనీ 2020లో షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ యాప్ అయిన ‘జోష్’ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆ యాప్ విషయంలో గణనీయంగా వృద్ధి కనిపిస్తూ ఉంది. వీరేంద్ర గుప్తా, ఉమంగ్ బేడీ మాట్లాడుతూ.. ‘‘ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో బిలియన్ల కొద్దీ వినియోగదారులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్థానిక భాషా కంటెంట్‌ను అందిస్తుంది. ఇక నుంచి, రాబోయే సంవత్సరాల్లో మా సామర్థ్యం, లీడర్ షిప్ మరింత బలంగా ఉంటుంది.’’ అని అన్నారు.