Gas Price: ఈసారి వంతు కమర్షియల్ సిలిండర్లది - రేటు భారీగా తగ్గింపు
మన దేశంలో LPG సిలిండర్ రేట్లను ప్రతి నెల 1వ తేదీన పెంచడం/తగ్గించడం చేస్తుంటాయి.
Commercial LPG Price: ఇళ్లలో వినియోగించుకునే వంట గ్యాస్ సిలిండర్ రేటును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కొన్ని రోజుల్లోనే, 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను (Commercial LPG Cylinder Price) కూడా పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తగ్గించాయి.
కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు తాజాగా రూ. 158 చొప్పున తగ్గింది. కొత్త ధర ఈ రోజు (శుక్రవారం, 01 సెప్టెంబర్ 2023) నుంచి అమలులోకి వచ్చాయి. OMCలు, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మన దేశంలో LPG సిలిండర్ రేట్లను ప్రతి నెల 1వ తేదీన పెంచడం/తగ్గించడం చేస్తుంటాయి. ఈ ప్రాసెస్‌లో భాగంగా, కమర్షియల్ (వ్యాపారం కోసం వాడే గ్యాస్) సిలిండర్ల ధరలను ఇవాళ అప్‌డేట్ చేశాయి.
తగ్గింపు తర్వాత, దేశ రాజకీయ రాజధాని దిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ రిటైల్ సెల్లింగ్ ప్రైస్ రూ.1,522 గా ఉంటుంది. ఈ నెలంతా ఇదే రేటు అమల్లో ఉంటుంది. ఆగస్టు నెలలో, ఒక్కో సిలిండర్ కోసం ఈ ప్రాంతంలో రూ.1680 ఖర్చు చేయాల్సి వచ్చింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1640.50 నుంచి రూ.1,482.50 కి దిగి వచ్చింది. కోల్‌కతాలో 1,644.50, చెన్నైలో రూ.1,694.50, హైదరాబాద్‌లో రూ.1,760, విజయవాడలో రూ.1,692.50 వద్దకు చేరాయి.
ఆగస్టు నెలలోనూ కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను 100 రూపాయల చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి.
₹200 తగ్గిన డొమెస్టిక్ LPG రేటు
రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్‌పీజీ ధరను (Domestic LPG Cylinder Price) రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద మరో రూ.200 సబ్సిడీకి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో, ఉజ్వల పథకం లబ్ధిదార్లకు ఒక్కో సిలిండర్ మీద మొత్తం రూ.400 సబ్సిడీ లభిస్తోంది. తగ్గిన ధరలు బుధవారం (30 ఆగస్టు 2023) నుంచి అమల్లోకి వచ్చాయి.
₹200 తగ్గింపు తర్వాత, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ (రెడ్ సిలిండర్) ధర హైదరాబాద్‌లో రూ.955 (అంతకుముందు రూ. 1,155) దగ్గరకు; విజయవాడలో రూ.927 (అంతకుముందు రూ.1127) దగ్గరకు చేరాయి. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేట్లలో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
దిల్లీలోనూ 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర బుధవారం నుంచి రూ.903 వద్దకు చేరింది. కొత్త రేటు ముంబైలో రూ.902.50, కోల్‌కతాలో రూ.929, చెన్నైలో రూ.918.50, బెంగళూరులో రూ.905.50, జైపుర్‌లో రూ.906.50, భోపాల్‌లో రూ.908.50 వద్దకు దిగి వచ్చింది.
LPG సిలిండర్ రేటును ఎక్కడ చెక్ చేయాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial